అమ్మాళీ... ఎంత బొమ్మాళీ!!!! వదలా నిన్నొదలా...

అమ్మాళీ... ఎంత బొమ్మాళీ!!!! వదలా నిన్నొదలా...


ఉత్తమ విలన్

‘అరుం....  అరుంధతా? అమ్మాళీ... ఎంత బొమ్మాళీ! పిందె పండైందే... అమ్మ బొమ్మాలే... నిన్ను చంపి ముక్కలు చేయాలని వచ్చానే. కానీ నిన్ను చంపా. ఏడు సంవత్సరాలు ఆడగాలి కరువైన ఈ పిశాచికి ఇంత అందాల బొమ్మ ఎదురుపడుతుందని నేను అనుకోలేదు’

 

‘అరుంధతి’ సినిమాలో అఘోరా గొంతు నుంచి డైలాగులు వినిపిస్తున్నప్పుడు రోమాలు నొక్కబొడుచుకుంటాయి. అఘోర... ఎంత శక్తివంతమైన విలన్!

 ‘వాడి నాలుక మరణశాసనం.

 వాడి చేతులు యమపాశాలు.

 ఎంత బలవంతుడైనా వాడిని ఎదురించలేడు. ఏ ఆయుధమూ వాడిని సంహరించలేదు’



 ‘అరుంధతి’ సినిమా కథ తయారవుతు న్నప్పుడే నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి దృష్టిలో తమిళ నటుడు పశుపతి ఉన్నాడు. కామెడీ అయినా, కర్కశత్వమైనా... పశుపతి రామస్వామి తాను చేస్తున్న పాత్రను అద్భుతంగా పండించ గలడు. అందుకే విలన్ పేరుకు ‘పశుపతి’ అని పేరు పెట్టుకున్నాడు.

 

‘అఘోర’ పాత్రలో పశుపతి జీవించడం ఖాయం! కానీ... ఒక పెద్ద డౌటు వచ్చింది.

 ‘అరుంధతి’లో విలన్ పశుపతిగా, అఘోరగా నటించాలి.

 అఘోరగా పశుపతి ఓకే.

 మరి ‘పశుపతి’ పాత్రలో పశుపతి?

 నాట్ ఓకే!

 ‘పశుపతి’ పాత్రలో రాచరికం ఉట్టి పడాలి.  రాచరికంతో కూడిన క్రౌర్యం ఉట్టిపడాలి.

 ఎందుకో ఆ పాత్రకు పశుపతి సరియైన ఎంపిక కాదనిపించిది.విలన్‌గా పశుపతి పేరు కొట్టేశాడు. విలన్ పేరును మాత్రం కొట్టేయలేదు. విలన్ పేరు పశుపతే! ఆ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ ‘అశోక్’ సినిమా చూశాడు శ్యాంప్రసాద్‌రెడ్డి. ఆ సినిమాలో ‘కేకే’గా సోనూ సూద్ విలనిజం రెడ్డిని ఆకట్టుకుంది. అలా తన ‘అరుంధతి’ సినిమాకు విలన్‌గా సోనూ సూద్‌ను అనుకున్నాడు.

 అయితే పశుపతి క్యారెక్టర్ స్కెచ్‌లు చూసిన సోనూ సూద్ ఆ పాత్రను పెద్దగా ఇష్టపడలేదు. అయితే నిర్మాత ఆసక్తి, ఉత్సాహం చూసి నటించడానికి ఒప్పుకున్నాడు. పశపతి పాత్రకుగానూ ఛాతి, పొట్టపై మంత్రాల టాటూలు వేసుకోవాల్సి వచ్చింది సోనూ సూద్. మేకప్‌కు రోజూ... మూడు గంటల సమయం పట్టేది.

 

అఘోర మేకప్ ఒక ఎత్తయితే... సోనూ నటన మరొక ఎత్తు.

 ‘అరుంధతి’ విడుదైన తరువాత ఎక్కడ చూసినా ‘అమ్మాళీ... బొమ్మాళీ’ డైలాగే! ‘పశుపతి’ పాత్రలో రాచరికపు అహాన్ని, ‘అఘోరా’లోని భయానకాన్ని సమానస్థాయిలో ప్రదర్శించి ప్రేక్షకలోకంలో జేజేలు అందుకున్నాడు సోనూ. ‘బెస్ట్ విలన్’గా నంది అవార్డ్ కూడా అందుకున్నాడు.

 పంజాబ్‌లోని మోగ నగరం సోనూ సూద్ స్వస్థలం. చదువుల కోసం నాగపూర్‌కు వచ్చిన సోనూ, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్‌లు చేసేవాడు. ఆ సమయంలోనే సినిమాల్లో నటించాలనే కోరిక బలపడింది.

 

ఒక నెలరోజులు నటనలో శిక్షణ తీసుకున్నాడు. 1999లో ‘కుళ్లళగర్’ అనే తమిళ సినిమాలో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు.  2000 సంవత్సరంలో శివనాగేశ్వర్రావు దర్శకత్వం వహించిన ‘హ్యాండ్సప్’ అనే సినిమాలో నటించాడు. బాలీవుడ్ సినిమాల్లో నటించాలని కలలు కన్న సోనూకు ఆ కల అంత తొందరగా నెరవేరలేదు. 2002లో మాత్రం ‘షాహీద్-ఏ-ఆజామ్’ అనే బాలీవుడ్ సినిమాలో భగత్‌సింగ్ పాత్ర పోషించే అవకాశం లభించింది. మణిరత్నం ‘యువ’ సినిమాలో అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించాడు. ‘సూపర్’ సినిమాలో హైటెక్-రాబర్ సోనూ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సోనూ సూద్.

 

తెలుగులో ‘అరుంధతి’ ఆయన విలనిజాన్ని తారస్థాయికి తీసుకెళితే, ‘దబాంగ్’లో చేడిసింగ్ పాత్రతో విలనిజంలో ఎంత భిన్నత్వాన్ని చూపవచ్చో నిరూపించాడు సోనూ సూద్.

 నట విద్యాలయంలో సోనూ సూద్ చదువుకుంది నెలరోజులు మాత్రమే... అయితే కెమెరా మాత్రం అతడికి సంవత్సరాలకు సరిపడేంత పాఠాలు నేర్పింది. అందుకే.. సోనూ సూద్ అనే పేరు వినబడగానే స్పందనగా ‘ఉత్తమ విలన్’ అనే మాట కూడా వినబడుతుంది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top