మనిషి – మనీషి 

Shankara Vijayam Part 9 - Sakshi

శంకర విజయం 9

ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర 

కాశ్యాంహి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా
సా కాశీ విదితా న తేన ప్రాప్తాహి కాశికా

– ఈ కాశీలోనే ఆత్మజ్ఞానమనే కాశిక ప్రకాశిస్తుంది. జ్ఞానరూపమైన ఈ కాశికయే సమస్తాన్నీ ప్రకాశింప చేస్తోంది. దీనిని ఎరిగిన వారికే కాశీప్రాప్తి కలుగుతుంది... మణికర్ణికలో మునుగుతున్న వేళ శంకరుడి మనసంతా కల్లోలంగా ఉంది. గంగలో సుడుల్లాంటి ఆలోచనలు నైమిత్తికాలను వెనక్కు నెట్టేస్తున్నాయి. ఆత్మవిచారణలో లీనమై ఆవలి ఒడ్డుకేసి చూస్తూ చాలాసేపు నీళ్లలోనే ఉండిపోయాడు. దూరం నుంచి విశ్వనాథాలయ ఘంటానాదం ఓంకారంగా పరావర్తన చెంది, గంగా తరంగాలపై నడిచి వచ్చి శంకరుని దేహమంతా నిమురుతోంది. 

కాశీవాసులకు అహరమమూ జ్ఞానభిక్ష పెట్టే అన్నపూర్ణ దయామయి. ఒకప్పుడు వ్యాసుణ్ణి పరీక్షించడానికి మూడురోజుల పాటు ఆహారం దొరకకుండా చేశాడట విశ్వనాథుడు. ఆకలి బాధ తట్టుకోలేక శిష్యులు పడుతున్న వేదన చూడలేక కినుక వహించిన వ్యాసుడు కాశీనే శపించబోయాడట. అప్పుడు అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై వ్యాసునికి, ఆయన శిష్యులకు కడుపార అనేక వంటకాలతో తినబెట్టిందట. కాశీని శపించబోయినందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోమని వెలివేసిందట. తప్పు చేసినా, బిడ్డమీద తల్లికెంత ఆప్యాయత?!.... శంకరుని మనసులో వ్యాసుని వృత్తాంతమంతా మెదులుతోంది.

‘భర్తను కోల్పోయి హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆ స్త్రీ ఇందాక ఎంత వేదాంతం చెప్పింది?! శవాన్ని పక్కకు జరపమంటే ముందు బదులు చెప్పలేదు. నాకు చెప్పే బదులు నువ్వే కాస్త సాయం పట్టు బాబూ! అనలేదామె. ఆ చెప్పేదేదో శవంతోనే చెప్పమంది. సమస్తాన్నీ నడిపించే పరబ్రహ్మ చైతన్యం శవాన్ని పక్కకు జరపలేదా? అని ప్రశ్నించింది. ఎంత చిత్రం? రోదన తీరును బట్టి అవిద్యావంతురాలిలా కనిపించిన ఆమె సత్యాన్ని ఎంత చిత్రంగా చెప్పింది?!’ అనుకుంటున్నాడు శంకరుడు. 

గంగాస్నానానికి వెళ్లిన ఆచార్యుడు ఎంతకూ వెనక్కు తిరిగి రాకపోవడంతో సనందుడు, విష్ణుశర్మ ఆయన్ను వెతుక్కుంటూ వచ్చారు. గంగలో పసిపిల్లవాడిలా కనిపిస్తున్న శంకరుణ్ణే చూస్తూ గట్టుమీద కూర్చున్నారు. ఆనందగిరి అప్పటికే స్నానం కానిచ్చి విశ్వేశ్వర దర్శనం కోసం ఆత్రుత పడుతున్నాడు. అప్పుడే సూర్యోదయమవుతోంది. గంగలో తళుక్కుమనే చేపల కోసం పక్షుల వేట అప్పుడే మొదలైపోయింది. 

‘ఈ మణికర్ణిక ఒడ్డున ప్రాణాలు విడిచిన వాడికి సాయుజ్య మోక్షమిచ్చేందుకు శివకేశవులు ఇద్దరూ పోటీ పడతారట. ఇద్దరిలోనూ మొదటిగా విష్ణువు, ఈ మనుష్యుడు నా రూపం పొందుగాక! అంటాడట. దానికి శివుడు సమాధానం చెప్పేలోపలే మరణించిన మనిషి శ్రీవత్స లాంఛనుడై, పీతాంబర ధారియై, గరుత్మంతుణ్ణి అధిరోహించి వెళ్లపోతాడట. ఓహో ఏమి చిత్రం! విష్ణువు ఒక్కడే... శివుడూ ఒక్కడే. కానీ ఈ మణికర్ణికలో మునిగిన ప్రతివారూ శివుడుగానో, విష్ణువుగానో మారిపోయినట్లయితే... శివుడు ఒక్కడే విష్ణువు ఒక్కడే అనే మాట ఎలా నిజమవుతుంది?’ తర్కించుకుంటూనే శంకరుడు ఎలాగో ఒడ్డుకు నడుచుకుంటూ వచ్చాడు. 
ఆలోచనల బరువుతో అడుగులు భారంగా పడుతున్నాయి. శిష్యులు ముందు నడుస్తున్నారు. 
ఎదురుగా ఒక చండాలుడు నడుచుకుంటూ వస్తున్నాడు. వాడి వాలకం చూస్తుంటేనే రోత పుడుతోంది. తెల్లగా తెల్లవారకముందే ఒక చేత కల్లుముంత పట్టుకున్నాడు. ఒక పడుచుకత్తె బుజాలపై చేతులు ఆన్చి తూలుతూ నడుస్తున్నాడు. వీపుమీద ఏదో జంతువు తోలు వేళ్లాడుతోంది. దానినుంచి కారే రక్తపు చుక్కల కోసం ఎగబడుతూ నాలుగు కుక్కలు వెంబడిస్తున్నాయి. 
అసలే అది ఇరుకు దారి. 
‘‘ఏయ్‌! పక్కకు తప్పుకో’’ అన్నారు శంకర శిష్యులు.
‘‘వెలుగులో అయినా, చీకట్లో అయినా మడిసిని నడిపించేది.... అదేదో వేరే ఉంటదంటగా. అసలే తడబడుతున్నాను. కాస్త ఓపిక పట్టండి సాములూ’’ అన్నాడు చండాలుడు.
‘‘ఏమిటా ప్రేలాపన. తొందరగా తప్పుకో.’’
‘‘ఉండండి సాములూ! ఇందాక ఇదే మాట నాతో సెప్పమని మా ఆడది అడిగితే.... బెల్లం కొట్టిన రాయిలా ఉలుకూ పలుకూ లేకుండా అయిపోయాడు మీ పెద్దసామి. మా బాగోతం మీకు పూర్తిగా తెలదులే.’’ 

శంకరుడప్పటికి తలపైకెత్తి చూశాడు. కనుచీకట్లో ఇందాక చూసిన ఆ మొగుడూ పెళ్లాలిద్దరినీ వెంటనే పోల్చుకోలేక పోయాడు. అప్పుడు శవంగా కనిపించింది ఇప్పుడు సజీవుడైన వ్యక్తేనా? అప్పుడు తనతో మాట్లాడింది అతని పక్కనున్న ఆమెయేనా? సందిగ్ధంలో పడ్డాడు శంకరుడు.
‘‘గురువా! నీ పలుకంటే నాకు ప్రేమ పుట్టిందనుకో. నేను పోతాను. కానీ నాలో ఉన్న వెలుగు నిన్ను వదిలి పోతుందా? నీలో నాలో ఉన్నదొక్కటే వెలుగు. వేరే లేదంటావుగా. నువ్వు దీపం పెడితే చీకటి పోతుంది. అయినా నీది మరీ చోద్యం గురువా! ఎర్రటి ఎండలో నిలబడి కళ్లకు గంతలు కట్టుకుంటే మాత్రం... చీకటి వస్తుందా? నీ ముందు నిలుచుంటే ఎవడైనా అంతే. అయినా ఈ కాశీలో నాకు నువ్వు, నీకు నేను ఎదురు పడకుండా ఎలా కుదురుతుంది? ఈ గడ్డ ఇద్దరిదీ కదా!  సరే... నీ మాటకే వస్తాను. తప్పుకు పోతాను. 
ఇంతకూ ఎవరు తప్పుకోవాలి? నేనా... నాలో ఉన్న ఆత్మా? అరిచ్చంద్ర మెట్టులో పీనుగులకు మోచ్చమిచ్చేదీ మనికర్నికలో నువ్వు మునిగేదీ ఒకే గంగ కదా! అక్కడా ఇక్కడా గంగలో ఒకే సూరీడు కనిపిస్తాడు కదా! ఇంతకూ నువ్వు సెప్పే సదువుల వెలుగుకు వీడు బేంబడు, వీడు మరొహడు అనే తేడాలుంటాయా?’’ ప్రశ్నించాడు చండాలుడు.
శంకర శిష్యులు బిత్తరపోయి చూస్తున్నారు.

ఆచార్య శంకరుడు అదాటున ఆ చండాలుని ముందు సాగిలపడి లేచాడు. ఆయనకు చండాల దంపతుల స్థానంలో గౌరీశంకరులు చిరునవ్వుతో దర్శనమిచ్చారు. నాలుగు కుక్కలూ నాలుగు వేద పురుషుల్లా మారిపోయారు. 
‘‘వత్సా! శంకరా! నేడు లోకంలో భేదభావాలు పెచ్చుమీరిపోయాయి. వాటిని నిర్మూలించ వలసిన గురుతర బాధ్యత నీపై ఉంది. భేదవాదులందరినీ నీ అద్వైతప్రజ్ఞతో జయించు. పండితుల మొదలు పామరుల వరకూ నీ బోధలను అందరూ, నేను నెత్తిన నెలవంక పెట్టుకున్నట్లు పెట్టుకుంటారు. విజయీభవ!’’ అన్నాడు శంకరుడు. గౌరీసమేతంగా అంతర్హితుడయ్యాడు. 
ఇతరుల కళ్లకు మాత్రం ఇంకా చండాలుడే కనిపిస్తున్నాడు. అతగాడికి మత్తు వదిలిపోయింది. గడగడ వణికిపోతున్నాడు. ‘‘తప్పు కాయి సామీ!’’ అంటూ లెంపలేసుకుంటూ అక్కడినుంచి త్వరత్వరగా వెళ్లిపోయాడు.

శిష్యసమేతంగా శంకరుడు అక్కడినుంచి కదిలాడు. మనీషాపంచకం ఆసక్తికరంగా మొదలైంది.
‘‘వాడు తప్పతాగి ఉన్నాడు’’ అన్నాడు కుతకుత ఉడికిపోతూ ఆనందగిరి. 
శంకరుడిలా సమాధానం చెప్పాడు. 
‘‘చైతన్యానికి అవస్థాభేదాలు లేవు. మెలకువలోనూ, నిద్రలోనూ, స్వప్నంలోనూ కూడా అది అత్యంత స్ఫుటంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. అదే బ్రహ్మ మొదలు చీమ వరకూ అంతటికీ అంతస్సాక్షి. నేను ఆ చైతన్య స్వరూపాన్నే కానీ జడపదార్థాన్ని కాను... అనే దృఢజ్ఞానం పొందినట్లయితే చండాలుడైనా, విప్రుడైనా అతడిని నేను గురువుగా భావిస్తాను.’’
‘‘బొత్తిగా చదువు సంధ్యలు లేనివాడు’’ మళ్లీ సణిగాడు ఆనందగిరి.
‘‘నేను బ్రహ్మమును. నా కంటికి కనిపిస్తున్న ఈ జగత్తు అంతా నా చిత్తం చేస్తున్న కల్పన. ఇది కేవలం నాలోని సత్త్వ రజస్తమో గుణాల వల్ల, అవిద్య వల్ల ఏర్పడింది... అని ఎవడైతే నిత్యము, నిర్మలమైన పరబ్రహ్మముపై దృఢబుద్ధిని నిలిపి ఉంచుతాడో వాడు చండాలుడైనా, విప్రుడైనా నాకు గురువే.’’
‘‘వాడు జాతి చండాలుడు’’ రుసరుసలాడాడు ఆనందుడు.

‘‘గురువాక్యంపై శ్రద్ధ ఉండాలి. దాన్ని నిత్యమూ ఎల్లవేళలా అనుసంధానిస్తూ ఉండాలి. అఖిల విశ్వమూ అనిత్యమని తెలియాలి. సంశయము, ఏమరుపాటు లేకుండా కోరికలు లేని శాంతచిత్తంతో నిరంతరమూ బ్రహ్మధ్యానంలో గడపాలి. గతంలోనూ రేపటిరోజున నేను చేసిన, చేయబోయే దుష్కృతాలన్నింటినీ జ్ఞానాగ్నిలో దగ్ధం చేశాను. గతకర్మల నుంచి సంచితంగా నాకు దక్కిన ఈ దేహాన్ని సదసత్‌ చింతనకు సమర్పణం చేశాను... అనే భావన కలవారే నావారు.’’
‘‘తప్పుకోరా అంటే అంత సాగదీయాలా?’’ యథాలాపంగా అన్నాడు ఆనందుడు.
‘‘మానవులే కాదు... దేవతల మొదలు మృగాదుల వరకు దేనిని ‘నేను’ అని అత్యంత స్పష్టంగా గుర్తిస్తున్నారో... దానివల్లనే అచేతనాలైన శరీర ఇంద్రియ అంతఃకరణాలు సైతం ప్రకాశాన్ని పొందుతున్నాయి. సూర్యుని వల్లనే పుట్టిన మేఘాలు గగనాన్ని చేరుకోగానే ఆ సూర్యమండలాన్నే కప్పేసినట్లు... అవిద్య వల్ల ఆ నేను తెలియకుండా కనిపించకుండా పోతుంది. మేఘాలు కప్పేసినా సూర్యుని స్వయంప్రకాశత్వానికి లోటు లేదు. ఆ చైతన్యాన్నే సదా భావిస్తూ శాంతచిత్తుడైన యోగి ఎవడైనా గొప్పవాడే... నాకు గురువే. ఇది నా నిశ్చయం.
‘‘గొప్పవారిని ఎదిరించడం ఘనత అనుకున్నాడు కాబోలు’’ అసహనం తొణికింది ఆనందునిలో.

‘‘ఆనంద సముద్రంలో లోటు, కొరత లేవు. దానిలోని కణలేశాన్ని మాత్రమే పొందిన ఇంద్రాది దేవతలు గొప్ప సుఖాన్ని పొందుతున్నారు. నిర్వృత్తి రహితమైన ఆ ఆనందాన్ని చిత్తవృత్తులను నిరోధించి మునులు ప్రశాంతచిత్తంతో పొందడానికి ప్రయత్నిస్తారు. ఆ నిత్యసుధా సముద్రంలో బుద్ధిని మునక లేయించినవాడు బ్రహ్మవేత్త కాదు... బ్రహ్మయే అవుతున్నాడు. అటువంటి వారికి దేవేంద్రాదులు సైతం సాహోలు పలుకుతారు. ఇది నా నిశ్చితాభిప్రాయం.’’
‘‘అంత వేదాంతం మాట్లాడాడు... చివర్లో భయపడ్డాడేం?’’ రెట్టించాడు ఆనందగిరి.
శంకరుడు సమాధానం చెప్పకుండా మౌనం వహించాడు.
‘‘శివుడైనా, విష్ణువైనా ఉపాధి ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా!’’ అన్నాడు సనందుడు.
కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపినీ జ్ఞానగంగా
భక్తిః శ్రద్ధా గయేయం నిజగురు చరణ ధ్యానయోగః ప్రయాగః
విశ్వేశో అయం తురీయః సకల జనమనః సాక్షిభూతో అంతరాత్మా
దేహోసర్వం మదీయే యది వసతి పునః తీర్థ మన్యత్‌ కిమస్తి

– పంచకోశాలు కలిగిన కాశీక్షేత్రమే ఈ శరీరం. ఇక్కడి జ్ఞానగంగ త్రిభువనాలకూ జనని. భక్తి శ్రద్ధలే గయ. నిజగురువు చరణాలపై ధ్యానాన్ని నిలిపే యోగమే ప్రయాగ. సకల జనుల మనస్సులలో అంతరాత్మగా, సాక్షిభూతునిగా ఉన్న విశ్వేశ్వరుడే అంతిమంగా కోరదగినవాడు. ఈ సర్వమూ నాలోనే వెలయుచుండగా ఇతర తీర్థాలతో పనేమిటి?... అంటూ శంకరుడు కాశీపంచకాన్ని ముగించాడు.

విశ్వనాథుని మందిరం బయట అంతా కోలాహలంగా ఉంది. లోపల విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతున్నాయి. రాజభటులు, పరివారానికి వీధులలో చోటు చాలడం లేదు. లోపల మాహిష్మతీ యువరాజు అమరుకుడు ఉన్నాడు. త్వరలోనే అతడి పట్టాభిషేక మహోత్సవం. ముందుగా విశ్వనాథుని దర్శించడానికి వచ్చాడు. రాజదర్శన సమయంలో ఇతరులకు ప్రవేశం లేదు. గురువులకు కూడా అందులో మినహాయింపు ఉన్నట్లు లేదు.     
శంకరుడు వెనుతిరిగి, శిష్యసమేతంగా అన్నపూర్ణా మందిరం వైపు సాగిపోయాడు.
‘‘దేవుడి ముందు అందరూ సమానమే కానీ, రాజు–పేద తేడాలున్నాయి కదూ ఆచార్యా!’’ అన్నాడు ఆనందగిరి అక్కసుగా.
శంకరుడేమీ సమాధానం చెప్పలేదు. కానీ ఇందాక శంకరుడు ఇచ్చిన వివరణతో ఆనందగిరి సమాధాన పడలేదన్న విషయం విష్ణుశర్మకు, సనందునికి అర్థమైంది. ఆనాటి రాత్రి అతడిని బుజ్జగించే పని పెట్టుకున్నారు వారిద్దరూ.

‘‘మన స్వామి సంగతి నీకింకా సరిగ్గా తెలీదయ్యా! ఓసారిలాగే శ్రీశైలం అడవుల్లో ఓ చెంచుల కుర్రాడు వచ్చాడు. అతగాడికీ దండం పెట్టాడీయన’’ చెప్పాడు విష్ణుశర్మ.
‘‘ఇలా కనిపించిన వాడికల్లా మొక్కుతూ పోతుంటే ఎలాగయ్యా! గురువంటే ఎలా ఉండాలీ? ఆయన ఒప్పుకున్నా మన మనసుకు నప్పుతుందా?’’ అడిగాడు అనంతగిరి.
‘‘అదే మరి చిత్రం. ఆ కుర్రాడే ఈయన్ని నర్మద ఒడ్డున నీ గురువున్నాడు. వెళ్లి కలుసుకోమని చెప్పాడు. నేను చెవులారా విన్నాను. ఆ తర్వాత నేను కూడా ఆ కుర్రాడికి మొక్కాననుకో... అది వేరే విషయం. నా కళ్లకి అతగాడు మా వినాయక స్వామిలా కనిపించాడు మరి’’ అన్నాడు విష్ణుశర్మ.

‘‘అప్పుడంటే నీకు కనిపించాడు కనుక, నమ్మావు. ఇప్పుడు మనకేమీ కనిపించలేదే?! అబ్బబ్బ! వాణ్ణి తలచుకుంటే ఇంకా శవాల కంపు ముక్కునొదిలి పోవట్లేదయ్యా!’’ బాధగా అన్నాడు ఆనందగిరి.
సనందుడు అందుకున్నాడు. ‘‘కనిపించే రూపాన్ని బట్టి ఒక అంచనాకు రావడం మంచిది కాదు ఆనందా! నా కథ చెబుతా విను. అప్పుడు నృసింహుణ్ణి ఉపాసన చేస్తూ అహోబిల అరణ్యంలో ఉన్నాను నేను. ఓసారి నా దగ్గరకు ఓ ఆటవికుడు వచ్చాడు. ‘ఎందుకు సామీ! ఈ అడివిలోకి వచ్చావు? భయం లేదా?’ అని అడిగాడు. ‘నా స్వామిని వెతుక్కుంటూ వచ్చానయ్యా!’ అన్నాను. ‘తప్పిపోయాడా... గుర్తులు సెప్పు. వెతికి పట్టుకొచ్చి అప్పగిత్తా’ అన్నాడు వాడు. నాకు నవ్వొచ్చింది. సింహం తల, మనిషి మొండెం ఉంటాయని చెప్పా. ‘ఇక నాకొదిలేయ్‌’ అంటూ వెళ్లిపోయాడు వాడు. వెళ్లిపోతున్న వాణ్ణి చూస్తే నాకు చాలా జాలి వేసింది. రెండు మూడు రోజులు  గడిచేసరికి నేనున్న చోటు వెతుక్కుంటూ వచ్చాడు వాడు. అడివిచెట్ల తీగలతో అల్లిన తాడొకటి నా చేతిలో పెట్టాడు. ‘ఇదిగో సామీ! మళ్లీ తప్పిపోకుండా బద్రంగా సూసుకో’ అంటూ నాకు అప్పగించి వెళ్లిపోయాడు. ఆ తాడు రెండోకొస నా నృసింహస్వామి మెడలో వేళ్లాడుతోంది. ఇప్పుడు నేనెవరికి నమస్కరించాలి? ఈ స్వామికా... ఈయన్ని పట్టితెచ్చిన ఆ ఆటవికుడికా?? ఈయన ఎవరికైతే సులభంగా పట్టుబడ్డాడో ఆయన మళ్లీ కనిపించలేదు నాకు.’’   
– సశేషం
నేతి సూర్యనారాయణ శర్మ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top