సీన్‌ మాది.. టైటిల్‌ మీది: రాణివాసం

Seen is yours title is ours - Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

తెలుగులో క్లాసిక్‌ అనదగ్గ సినిమాల్లో ఎప్పటికీ చోటు దక్కించుకునే ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఆ సినిమా పేరేంటో  చెప్పుకోండి చూద్దాం... 

ఊర్లో వందకు పైగానే మగ్గాలున్న నారప్పకు ఒక్కగానొక్క కూతురు మల్లీశ్వరి. నారప్ప ఆ ఊరికే పెద్ద. డబ్బున్న కుటుంబమే. మల్లీశ్వరి నిజానికి అందరిలాంటి అమ్మాయే అయితే ఆమె కథ ఈ మలుపు తీసుకోదు. మల్లీశ్వరి అందరిలో ఒకరు అనిపించుకునే సాధారణ అమ్మాయి కాదు. చురుకైనది. తెలివైనది. అద్భుతంగా నాట్యం చేస్తుంది. అంతే అద్భుతంగా పాడుతుంది కూడా! అయితే పాడమని అడిగితే సిగ్గు పడుతుంది. నాట్యం చేయమని అడిగితే ఏకంగా పారిపోతుంది. బావ నాగరాజు అడిగితే మాత్రం ఆమె సిగ్గుపడదు. అతనడిగితే ఏదైనా చేసేస్తుంది. మల్లీశ్వరికి బావంటే అంతిష్టం. 

ఒకరోజు మల్లీశ్వరి, నాగరాజు పక్క ఊర్లో సంతకు వెళ్లి తిరిగివస్తోంటే పెద్ద వర్షం కురుస్తోంది. ఒక చిన్న కొండలాంటి ప్రాంతంలో ఉన్న సత్రంలో వర్షంలో తడవకుండా దాక్కున్నారు. మల్లీశ్వరి సరదాగా ఆడి పాడుతోంది. అప్పుడే అటుగా వచ్చిన విజయనగర సామ్రాజ్య పాలకులు శ్రీకృష్ణదేవరాయల వారు, ఆయన ఆస్థానంలో పనిచేసే పెద్దలు మల్లీశ్వరి నాట్యాన్ని చూశారు. మహారాణివారి ఇష్టసఖి మర్యాదలను అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న యువతిగా మల్లీశ్వరిని రాయలవారి ఆస్థాన కవి కీర్తించారు. రాయలవారు ఆమెకు ఒక పెద్ద హారం బహుమానంగా ఇచ్చారు. వర్షం ఇంకా అలాగే కురుస్తోంది. ఆ సత్రంలో చేరిన వారంతా మల్లీశ్వరితో, నాగరాజుతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తున్నారు. ఆ కబుర్ల మధ్యలో అకస్మాత్తుగా అడిగాడు నాగరాజు – ‘‘మల్లి ఆట – పాటను మెచ్చుకున్నారు. మీరొక ఉపకారం చేస్తారా?’’.‘‘ఓ! చెప్పు నాయనా! విజయనగరంలో మీకేది కావాలన్నా మేం మీకు ఏర్పాట్లు చేయగలం.’’ భరోసానిస్తూ చెప్పాడు రాయలవారి ఆస్థాన కవి. ‘‘మరేం లేదులెండి! ఇందాక అదేదో సెలవిచ్చారు కదా. మహారాణివారి ఇష్టసఖి మర్యాదలని. అవేవో కాస్త జరిగేటట్టు చూడండి. మన రాయల వారితో ఇక్కడ మల్లీశ్వరి అని ఒక పిల్ల ఉందని మనవి చేయించి, పల్లకి పంపించేటట్టు మాత్రం చూడండే!’’ నవ్వుతూ అడిగాడు నాగరాజు. బావ ఆటపట్టిస్తూ అలా మాట్లాడుతున్నాడని తెలిసి, మల్లీశ్వరి వెక్కిరిస్తూ, బావను ఉద్దేశించి, అతని మాటల్ని తిప్పి చెప్పుతూ, ‘‘పల్లకి పంపేటట్టు మాత్రం చూడండే!’’, ‘‘.. పంపండి స్వామి! పల్లకి తప్పకుండా పంపండి. మా కోతిబావ పల్లకీ ఎక్కి, పళ్లు ఇకిలిస్తూ ఊరేగుతాడు.’’ అని గట్టిగా నవ్వింది. మల్లీశ్వరి మాటలకు అక్కడున్న వారంతా సరదాగా నవ్వుకున్నారు. అయితే అప్పటికి మల్లీశ్వరికి గానీ, నాగరాజుకు గానీ, వచ్చిన వాళ్లలో శ్రీకృష్ణదేవరాయలవారే ఉన్నారని తెలియదు.
        ∙∙ 
మహారాణివారి ఇష్టసఖి అవ్వడమన్న ఆలోచనను అప్పటికే మరచిపోయింది మల్లీశ్వరి. రోజులు గడుస్తున్నాయి. మల్లీశ్వరికి పెళ్లి చేయాలన్న ఆలోచన చేసింది తల్లి. ‘‘ఎవరినో వెతకడం ఏమిటి? మన నాగరాజే ఉన్నాడు కదా!’’ అన్నాడు తండ్రి నారప్ప. మల్లీశ్వరిని ఏ పనీ లేని నాగరాజుకు ఇచ్చి చేయడం తనకు ఇష్టం లేదని చెప్పింది తల్లి. పెద్ద గొడవ కూడా చేసింది. రెండు కుటుంబాలను నిశ్శబ్దం ఆవరించింది. నాగరాజు మల్లీశ్వరిని నొప్పించలేక, ఆమెకు దూరంగా వెళ్లి, డబ్బు సంపాదించాకే తిరిగొస్తానని తల్లికి ఇచ్చిన మాటను కాదనలేక ఊరొదిలి దూరంగా ఒక పట్నంలో పని చేసుకుంటున్నాడు.శిల్పాలు చెక్కడం నేర్చుకొని మంచి శిల్పిగా పేరు తెచ్చుకుంటున్నాడు. మల్లీశ్వరి నాగరాజు తిరిగొచ్చే రోజు కోసం ఎదురుచూస్తూనే ఉంది. అలాంటి ఒకరోజున శ్రీకృష్ణదేవరాయల వారినుంచే ఒక ఉత్తర్వు అందింది, మల్లీశ్వరిని మహారాణివారికి ఇష్టసఖిగా నియమించినట్టు. మల్లీశ్వరి ఆ ఉత్తర్వు విని అక్కడే కూలబడిపోయింది. ఒక్కసారే ఎదురైన అదృష్టాన్ని చూసి కళ్లు తిరిగిందని సర్ది చెప్పుకున్నారంతా. వైభవంగా ఏర్పాట్లు జరిగాయి.మల్లీశ్వరిని రాణివాసానికి తీసుకెళ్లడానికి పెద్ద పల్లకిని కూడా సిద్ధం చేశారు. కొండలు, గుట్టలు దాటి పల్లకి విజయనగరం చేరింది. మల్లీశ్వరి రాణివారికి ఇష్టసఖిగా చేరిపోయింది. మరోపక్క నాగరాజు ఊరికి తిరిగొచ్చాడు. మల్లీశ్వరి లేదని తెలుసుకొని కుమిలిపోయాడు.రోజులకు రోజులు ఏమీ తినకుండా ఒక్కటే ఒక్క శిల్పాన్ని చెక్కుతున్నాడు. మల్లీశ్వరి రూపమది. రాయలవారి ఆస్థానంలోని ఓ వ్యక్తి నాగరాజు చెక్కిన శిల్పాన్ని చూశాడు.

రాయలవారి రాచనగరంలో నిర్మిస్తున్న నర్తనశాలకు పనిచేయాల్సిందిగా నాగరాజును ఆ వ్యక్తి కోరాడు. నాగరాజు ముందు ఒప్పుకోకపోతే బతిమిలాడి తనతో పాటు రాచనగరానికి తీసుకెళ్లాడు. నాగరాజు పనిలో పడిపోయాడు. నర్తనశాల కోసం కావాల్సిన శిల్పాలను చెక్కుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. మల్లీశ్వరికి రాణివాసంలో ఉండటం కష్టంగా ఉంది. తల్లికి కబురుపంపి తీసుకుపొమ్మని గొడవ కూడా చేసింది. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. అక్కణ్నుంచి బయటపడే ఏ మార్గమూ లేక, అంతఃపురమంతా కలియదిరుగుతూ నాగరాజును గుర్తు చేసుకుంటోంది మల్లీశ్వరి. సరిగ్గా అప్పుడే కనిపించాడు నాగరాజు ఆమెకు. అతనితో మాట కలిపేలోపే అంతఃపురంలోని చెలికత్తెలు మల్లీశ్వరిని లోపలికి తీసుకెళ్లారు. మల్లీశ్వరి రాణివాసం నుంచి బయటకొచ్చి నాగరాజును కలవలేదు. నాగరాజుకు మల్లీశ్వరిని చేరే అవకాశమే లేదు. కానీ ఇద్దరూ ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేని పరిస్థితి. ఒకరు లేకపోతే ఇంకొకరుఉండలేనంత ప్రేమ ఇద్దరిదీ. ఇద్దరూ ఒకరినొకరు చేరే దారి కోసం ఆనాటి నుంచి అన్వేషిస్తూనే ఉన్నారు. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top