'పక్కింటి అమ్మాయిలా ఉండడానికి ఇష్టపడతా' | Sakshi
Sakshi News home page

'పక్కింటి అమ్మాయిలా ఉండడానికి ఇష్టపడతా'

Published Sun, Oct 20 2019 8:48 AM

Sakshi Funday Special Interview With Tamannah

పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహుడా చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీరా’ అంటూ ‘సైరా’లో ఉత్తేజ పరిచింది తమన్నా భాటియా. గ్లామర్‌ పాత్రలే కాదు కళనే ఆయుధంగా వాడుకున్న ‘లక్ష్మి’లాంటి పాత్రలను కూడా ‘శబ్భాష్‌’ అనిపించేలా  నటించగలనని మరోసారి నిరూపించిన తమన్నా ముచ్చట్లు...

పర్సనల్‌ స్టైల్‌
నా మానసిక స్థితిని బట్టి నా పర్సనల్‌ డ్రెస్సింగ్‌ ఆధారపడి ఉంటుంది. పొరుగింటి అమ్మాయిలా సహజంగా ఉండడానికి ఇష్టపడినట్లే రాణిలా అట్టహాసంగా ఉండడానికీ అంతే ఇష్టపడతాను. ∙నా దృష్టిలో ఫ్యాషన్‌ అంటే గుడ్డిగా ట్రెండ్‌ను అనుసరించడం కాదు. అది పూర్తిగా మన అవగాహనకు సంబంధించినది. ∙ఫ్యాషన్‌ ప్రపంచం చుట్టూ చక్కర్లు కొట్టడానికి ఇష్టపడను. అయితే ఫ్యాషన్‌కు సంబంధించిన ఆర్టికల్స్‌ను చదువుతాను. పుట్టకతోనే ‘ఫ్యాషన్‌ సెన్స్‌’ ఎవరికీ రాదు. పరిశీలనతో అది మనలో వృద్ధి చెందుతుంది. ఫ్యాషన్‌ అంటే పడి చావను కాని ఏది చేసినా కొత్తగా కనిపించాలని అనుకుంటాను. ∙ఫ్యాషన్‌కు సంబంధించి గతంలో కంటే కూడా ఇప్పుడే ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నాను. మామూలుగానైతే టీషర్ట్‌ – జీన్స్‌ ధరించడం అంటే ఇష్టం.

గ్లామర్‌
గ్లామర్‌ కోసం సౌందర్యసాధనాల మీద అతిగా అధారపడను. తినే తిండిపై శ్రద్ధ పెడతాను. న్యూట్రిషనిస్ట్‌ సలహాలు తీసుకుంటాను. మెరిసే చర్మానికి కాస్మొటిక్స్‌ కంటే క్రమశిక్షణ ముఖ్యమని నమ్ముతాను. ఆయిల్‌ ఫుడ్‌కు దూరంగా ఉండటం, ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర, సానుకూల దృక్పథం ఉండడం... మొదలైనవి ఆ క్రమశిక్షణలో బాగం..

అలా కుదరదు
సినిమా ఫీల్డ్‌లో కెరీర్‌ను ప్లాన్‌ చేసుకోవడం కుదరదు. ఇక్కడ ‘అస్థిరత’ ఎక్కువ. స్ట్రాటజీ ముఖ్యం. కొత్త ప్రదేశాలు, కొత్త భాష అంటే ఇష్టపడతాను. వాటిని ఎంజాయ్‌ చేస్తాను. అలా కాకుండా ‘అమ్మో’ అనుకుంటే కొత్తదనాన్ని ఆస్వాదించలేము. కొత్త ప్రదేశం, కొత్త భాషలు మన జ్ఞానాన్ని పెంచుతాయి.

మరో కోణం
మా ఫాదర్‌ ఎప్పటి నుంచో నగల వ్యాపారంలో ఉన్నారు. కాబట్టి నగలంటే చిన్నప్పటి నుంచే ప్యాషన్‌ ఉంది. ఈ కాలనికి సరిపడే, సౌకర్యంగా ఉండే నగలను డిజైన్‌ చేయడం అంటే ఇష్టం. ‘వసువం సర్వనం ఒన్న పడి చవంగ’ అనే తమిళ సినిమాలో నేను డిజైన్‌ చేసిన నగలను ఉపయోగించారు. మరొక విషయం ఏమిటంటే... ఖాళీ సమయంలో రచనలు కూడా చేస్తుంటాను. వంటలు చేయడం ఇష్టమే కాని చాలా సందర్భాల్లో ఉప్పు వేయడం మరిచిపోతుంటాను. పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఓషో, పాల్‌ కోయిలో పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటాను. ఆటలు అంటే ఇష్టం ఉండదు కాని యోగ, రన్నింగ్‌ చేస్తాను. ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం ఉండదు. కంపెనీ ఉండాలి. కబుర్లూ ఉండాలి! 

Advertisement
Advertisement