శ్మశానంలో ఊయల..

Sakshi Funday Horror Story

కిర్ర్‌..ర్‌..!

వేసవి రాత్రి.. 
ఆరుబయట.. చల్లగా ఉంది. ఆమె తన గూడు ముందే ఉన్న వేప చెట్టుకి ఊయల కట్టే ప్రయత్నం చేస్తోంది. ఆ చప్పుడికి లోపలి నుంచి ఓ కేక.. మూలుగులా!
‘‘ఏం చేస్తున్నావే బయట?’’ 
‘‘వేప చెట్టుకు ఊయల కడ్తున్నానమ్మా...!’’ చేస్తున్న పని మీద నుంచి దృష్టి మరల్చకుండానే సమాధానమిచ్చింది ఆమె. 
‘‘రాత్రివేళల్లో చెట్ల కింద ఉండకూడదు తెలుసా?’’ హెచ్చరిక  లోపలి నుంచే. 
వెనక్కి తిరిగి.. ‘‘అమ్మా.. ’’ అని నవ్వుతూ విసుక్కుంది. 
ఆ అమ్మకూడా నాలుక కర్చుకున్నట్టుంది మాటలేదు. కాసేపటికి ఏదో తట్టినట్టు ‘‘ఊయల దేనితో  కడ్తున్నావే?’’ సందేహం వెలిబుచ్చింది. 
‘‘ఊ... తాళ్లు’’ అంది చెట్ట కొమ్మ మీదకి వేసిన తాళ్లను కిందకి లాగుతూ!
‘‘తాళ్లా? ఎక్కడివి?’’ మళ్లీ ప్రశ్న.
‘‘అమ్మా... ఈ చెట్టు మీద వేల్లాడినవన్నీ పోగేశా... తెలిసీ అడుగుతావేంటీ?’’ తాళ్లను లాగడంలో అలసిపోయినట్టుందేమో.. నడుం మీద చేతులు పెట్టుకొని సేద తీరుతూ చిరు కోపాన్ని ప్రదర్శించింది ఆమె. ఇంతలోకే  పక్కనే పిట్ట గోడ మీదున్న ఫోన్‌ గుర్ర్‌... గుర్ర్‌.. మంటూ వైబ్రేట్‌ అయింది.

‘‘అబ్బా... ఈ టైమ్‌లో ఎవరో..’’ అని చిరాకు పడుతూ  ఫోన్‌ అందుకుంది. 
‘‘హాయ్‌’’ 
‘‘హెలో.. వాట్సప్‌?’’ 
‘‘పడుకున్నావా?’’ 
అంటూ వరుసగా మూడు మెసేజ్‌లు ఉన్నాయి. 
‘‘పట్టువదలని పరాక్రముడు.. ’’అనుకుంటూ.. ఆ మూడు మెసేజ్‌లకు రిప్లయ్‌ ఇచ్చింది..‘‘పడుకోలేదు.. ఊయలూగుతున్నా’’ అని!
అవతలి నుంచి వెంటనే రెస్పాన్స్‌. ‘‘వావ్‌..  వెన్నెల్లో ఊయలా?’’ అంటూ.
ఆమె..ఆ వెంటనే.. ‘‘ వెన్నెల్లో కాదు.. చీకట్లోనే.. రేపు అమావాస్య..’’ అంటూ కన్నుగీటే ఇమోజీతో రిప్లయ్‌ ఇచ్చింది
అవతల మెసేజ్‌ రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి.. ఆమె ఇంప్రెషన్‌ కోసం తండ్లాడుతున్నాడు గత కొద్ది రోజులుగా!  ఆ ఊళ్లో జరిగిన ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లో ఆమెను చూశాడు. అప్పటి నుంచి మనసు పారేసుకున్నాడు. ఎలాగో ఆమె నంబర్‌ సంపాదించాడు. పలకరించాలంటే భయపడ్డాడు. ఈ పరిచయం.. పరిచయం వరకే ఉంటే ఓకే.. కాని ప్రేమగా మారి ముందుకు వెళితే.. తను ఆమెతో ఉండగలడా? సాధ్యమా? సాధ్యం కాకపోతే ఆ అమ్మాయి పరిస్థితి? 
‘‘ముందు మాట్లాడు.. తర్వాత సంగతి తర్వాత’’ అంటూ మెదడు ధైర్యమిచ్చి.. ప్రోత్సహించింది. అలా  మొదలైన ఆ ఫోన్‌ మెసేజ్‌ కమ్యూనికేషన్‌ను అంతవరకే పరిమితం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కాదు.. అతను అంతవరకే ఉండేలా ఆమె నియంత్రిస్తోంది. 
ఇప్పుడు.. ప్రస్తుత సందర్భంలో.. అదే అనుకుంటున్నాడు.. ఆ కన్నుగిటే ఇమోజీకి జవాబివ్వకుండా.. ‘‘కలిసి ఉండడం సాధ్యం కాకపోతే అనవసరంగా ఆ అమ్మాయి పరిస్థితేంటో అని ఎంత పిచ్చిగా ఆలోచించాడు? ఇన్ని రోజులైనా ఆమె తన సంభాషణతో ఈ పరిచయాన్ని ఒక అంగుళం కూడా ముందుకు తీసుకెళ్లలేదు. ఇలాంటి గట్టి పిల్లనా తను తేలిగ్గా అంచనా వేసింది?’’ అని. 
అలా అనుకుంటున్నాడే కాని.. ఆమె ఆ ముక్తసరి.. ముక్కుసూటి తీరు.. అతనిలో పట్టుదలను పెంచుతోంది. ఎలాగైనా ఆమెను.. కలవాలి అని. ఇంకా చెప్పాలంటే ఆ పిల్లను ప్రేమించడం మొదలుపెట్టాడు. 
అందుకే ఆ  క్షణాన ఆమెకు మెసేజ్‌ పెట్టాడు.. ‘‘నిన్ను కలవాలనుంది’’ అని. 
ఆమె ఆ మెసేజ్‌ను చూడకుండా ఇగ్నోర్‌ చేసింది. 

షాపింగ్‌ మాల్‌లోని లేడీస్‌ సెక్షన్‌లో న్యూ  ఎరైవల్స్‌ దగ్గర అమర్చిన డ్రెసెస్‌ను ఆసక్తిగా గమనిస్తోంది ఆమె.
‘‘హాయ్‌’’ అన్న పిలుపు వినిపించి ఉలిక్కిపడి చూసింది. 
నవ్వుతూ అతను. 
‘‘ఓ హాయ్‌’’ తేరుకుంటూ ఆమె. 
‘‘డ్రెస్‌ కొంటున్నావా?’’ అతను. 
‘‘లేదు.. చూస్తున్నా’’ ఆమె. 
అతను నవ్వాడు. 
 ‘‘అవునూ.. ఇంతకుముందే  ఈ షాప్‌ అంతా కలియ తిరిగాను. ఎక్కడా కనపడలేదు నువ్వు!  అంత హఠాత్తుగా ఎలా ప్రత్యక్షమయ్యావ్‌?’’ ఆశ్చర్యపోతూ ఆమె. 
ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. ప్రసన్నంగా ఉంది ఆమె మొహం. ‘‘ఇదే మంచి అవకాశం.. మనసులో ఉన్నది చెప్పేయ్‌’’ రెచ్చగొడుతోంది అదని మెదడు.
ఏదో వినిపడినట్టు వెంటనే అతని వైపు చూసింది ఆమె ‘‘ఏమన్నా అన్నారా?’’ అంటూ. 
అనలేదన్నట్టు.. అన్నాను అన్నట్టు తల అడ్డదిడ్డంగా ఊపుతూ ‘‘నువ్వంటే నాకు ఇష్టం.. నీతో కలిసి బతకాలనుంది’’ చెప్పాడు టపీమని. 
తాపీగా అతని కళ్లల్లోకి చూసింది ఆమె. 
‘‘నిజం... నువ్‌ లేకుండా ఉండలేను.. నీ కోసం ఈ లోకాన్ని కూడా వదులుకుంటా’’  అతను. 
అలాగే చూస్తూ ఆమె.
‘‘ప్లీజ్‌.. చెప్పు..’’  ఆమె మౌనం అతనికి భారమైంది. 
ఆమె గబగబా తన సెల్‌ఫోన్‌లో ఏదో టైప్‌చేసి అతని ఫోన్‌ నంబర్‌కి సెండ్‌ చేసి.. ఫోన్‌ చూసుకో అన్నట్టు సైగ చేసింది. చూశాడు అతను. 
అడ్రస్‌..
‘‘ఎవరిది?’’ అడిగాడు. 
‘‘మాదే.. రాత్రి ఇంటికి రా.. ఇంట్లో ఎవరూ ఉండరు. చెప్తాను’’ అంది.
అతని మొహంలో ఆనందం. 
‘‘సరే మరి.. నేను వెళ్తా’’అంది లేచి నిలబడుతూ!

రాత్రి.. పదకొండు అవుతోంది.. 
ఆమె చెప్పిన అడ్రస్‌కు వచ్చాడు. ఒక్క వీధి దీపం తప్ప అక్కడ ఇళ్లే కాదు జనసంచారమే లేదు. అయినా కాస్త ముందుకు నడిచాడు. వేప చెట్టు.. దానికి కట్టి ఉన్న ఊయలా కనిపించాయి.  ‘‘హమ్మయ్యా.. వచ్చేశా’’ అనుకుని గబగబా ముందుకు నడిచాడు.
 పెద్ద ప్రహరీ.. పెద్ద గేట్‌.. 
గేట్‌ తీసుకొని లోపలికి వెళ్లాడు. బయటి స్ట్రీట్‌ లైట్‌ వెలుతురు పడి.. శ్మశానం స్పష్టంగా దర్శనమిస్తోంది.. 
భయంగా వేపచెట్టు వైపు చూశాడు.. ఊయల ఊగుతోంది.. నెమ్మది నెమ్మదిగా వేగం పెంచుకుంటూ!

- సరస్వతి రమ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top