Sakshi News home page

జనాల్ని కుమ్ముతూ పరుగెత్తే గిత్తల పరుగు

Published Sun, Jul 27 2014 12:29 AM

జనాల్ని కుమ్ముతూ పరుగెత్తే గిత్తల పరుగు

వర్ణం
 
కొయ్ కొయ్...
ఎంతైనా స్పెయిన్‌లో పాత సంప్రదాయాలూ, గ్రామీణ వినోదాలూ ఎక్కువే! ఇక్కడ చూడండి: నీరా సొరొందో, అమయ్యా గార్సియా ఇద్దరూ చెట్టుకాండాన్ని రంపంతో కోస్తున్నారు. ఇది పంప్లోనా నగరంలో ప్రతి ఏటా నిర్వహించే ‘సాన్ ఫెర్మిన్ ఫెస్టివల్’లో భాగంగా జరిగే గ్రామీణ క్రీడల ఛాంపియన్‌షిప్‌లో ఒక విభాగం! జనాల్ని కుమ్ముతూ పరుగెత్తే గిత్తల పరుగు కూడా ఈ ఉత్సవంలోనిదే! విదేశాలనుంచి ఇక్కడికి జనం పోటెత్తుతారు. సుమారు పదిలక్షల మంది పాల్గొంటారని అంచనా!
 
అతిథి గృహం
కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ నగరానికి 200 కిలోమీటర్ల దూరంలోని సూ సమైర్ మైదానంలో కనిపించిన దృశ్యం ఇది! సాహస యాత్రికులు కలలుగనే పర్యటన- ఉత్తర పశ్చిమాలను కలిపే ప్రాచీన వర్తక రహదారి ‘సిల్క్ రూట్’! ఆ మార్గంలో సంచరించే వారు వేళగాని వేళల్లో ఇలాంటి చోట బస చేసేవారు. దీన్ని యర్ట్ అంటారు. సంచార తెగల సంప్రదాయ తాత్కాలిక నివాసాలివి.
 
తారల దీవెన
జపాన్‌వాళ్లు నమ్మే ఒక ప్రాచీన గాథ ప్రకారం, నక్షత్రదేవత ఒరిహిమె, ఆమె మనసుపడిన నక్షత్రదేవుడు హికొబోషి... పాలపుంత వల్ల విడిపోవాల్సివస్తుంది. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇరువురూ కలిసే వీలుంటుంది. ఆ రోజును ‘తనబాతా’ వేడుకగా జరుపుకొంటారు జపనీయులు. ఆరోజు భక్తులు దేవాలయ ప్రాంగణంలోని వెదురు కొమ్మలకు తమ కోరికలను రాసిన కాగితాల్ని వేలాడదీస్తారు. అలా చేయడం శుభాన్ని కలిగిస్తుందంటారు.

Advertisement

What’s your opinion

Advertisement