
సెల్ మోహనరంగా!
సెల్‌ఫోన్ వాడడం లేదా!’.... ‘లేదు’ అంటే పరమ వింత! ‘ఇప్పటికీ ఆ పాత సెల్‌ఫోనే వాడుతున్నావా?’...
ఫేమస్ టూన్
‘సెల్‌ఫోన్ వాడడం లేదా!’.... ‘లేదు’ అంటే పరమ వింత! ‘ఇప్పటికీ ఆ పాత సెల్‌ఫోనే వాడుతున్నావా?’... ‘అవును’ అంటే చిన్నచూపుతో కూడిన చిరు వింత! ‘అవసరం మేరకు, కొద్దిసేపు మాత్రమే మాట్లాడతావా?’... ‘అవును’ అంటే అకారణ వింత! ఈ వింతల నుంచి తప్పించుకోవడానికి ‘నేను సైతం’ అంటూ కొత్త ఖరీదైన సెల్‌ఫోన్ కొనాల్సిందే. అది పాత బడకుండానే లేటెస్ట్ లిస్ట్‌లోకి జంప్ చేయాల్సిందే.
కొన్నాం సరే.
అన్ని డబ్బులు పెట్టి కొన్న సెల్‌ను సెల్‌లో బంధించినట్లు అలా ఒక మూలన పెడితే ఎలా?
మాట్లాడాలి.
మాట్లా......డు......తూ.....నే.... ఉండాలి!
అప్పుడుగానీ గిట్టుబాటు కాదు.
రోడిన్ ప్రపంచ ప్రఖ్యాత శిల్పం ‘ద థింకర్’ను చూసీ చూడగానే నిలువెత్తు మౌనం, ఆ చిక్కటి మౌనంలో ఉదయించిన తత్వం గుర్తుకు వస్తాయి.
దేన్నీ వదలని ‘సెల్’ఫోను ఆ ఆలోచనాపరుడిని మాత్రం ఎందుకు వదులుతుంది? అంటున్నాడు రికో.
అందుకే ఇప్పటి ‘థింకర్’ మౌనంగా ఉండడం కంటే, ఆలోచించడం కంటే...సెల్ లోకంలో తలమునకలవ్వడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఓ కార్టూన్‌ను చిత్రించాడు.
‘రికో’ పేరుతో కార్టూన్లు గీసే ఇటలీయుడు ఫెడెరికో రికియార్డీ స్వతహాగా ఆర్కిటెక్ట్. అయితే దీనికంటే ఇలస్ట్రేటర్, గ్రాఫిక్ డిజైనర్‌గా అతడికి ఉన్న గుర్తింపే ఎక్కువ. కళాకారుడికి ‘లోచూపు’ ఎక్కువగా ఉండాలి అనేది వాస్తవమైతే...అది రికోలో చాలా ఎక్కువగానే ఉందని ఈ కార్టూన్‌ని చూసీచూడగానే ఒప్పుకోవచ్చు.