మన జాతీయాలు


రామలింగడి పిల్లి!

పాలు కనబడితే పిల్లికి పండగే. కన్నుమూసి తెరిచేలోపే ఆ పాలను గుటుక్కుమనిపిస్తుంది. అలాంటి పిల్లి పాలను చూసి ‘వామ్మో’ అని పరుగెడితే ఆశ్చర్యమే కదా!

 ఓసారి తెనాలి రామలింగడికొక  చిలిపి ఆలోచన వచ్చింది. పిల్లికి పాల మీద ఉండే ఇష్టాన్ని ‘భయం’గా మార్చాలని! ఒకరోజు పిల్లి కోసం కావాలనే వేడి పాలు సిద్ధం చేశాడు. విషయం తెలియక పాపం ఆ పిల్లి గటగటమని తాగడానికి ప్రయత్నించి నోరు కాల్చుకుంది. వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు తీసింది. ఇక అప్పటి నుంచి పాలను చూస్తే చాలు... భయంతో పారిపోయేది.

 

ఆ పిల్లిలాగే కొందరు ఉత్తుత్తి భయాలతో, అపోహలతో  తమ ఇష్టాలను, అలవాట్లను మార్చేసుకుంటారు. అలాంటివారి గురించి చెప్పేటప్పుడు ‘అదంతా రామలింగడి పిల్లి వ్యవహారం’ అంటుంటారు.

 

దొందు దొందేరా తొందప్పా...

విమర్శ చేయడం మంచిదేగానీ సద్విమర్శ చేయాలి. ఎదుటి వారిని విమర్శించే ముందు మనల్ని మనం ఓసారి చెక్ చేసుకోవాలి. లేకపోతే పదిమందిలో తేలికైపోతాం.

 ‘‘విమర్శించే అర్హత నీకు లేదు. దొందు దొందేరా తొందప్పా అన్నట్లు ఉంది’’ అంటుంటారు కొందరు.

 

ఇంతకీ తొందప్ప కథ ఏమిటంటే...

పూర్వం  ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వారికి ఉన్న నత్తి కారణంగా పదాలను సరిగ్గా పలకలేకపోతున్నారు. వారి సంభాషణ విన్న ఒకడు బిగ్గరగా నవ్వుతూ- ‘‘దొందు దొందేరా తొందప్పా’’ అన్నాడట. అలా ఎందుకన్నా డంటే... నిజానికి ఇతడికి కూడా నత్తి ఉంది. తన మిత్రుడి పేరు కొండప్ప. ఆ పేరు సరిగ్గా పలకలేక ‘తొందప్పా’ అన్నాడన్నమాట!

 

బెల్లం కొట్టిన రాయి

రాయితో ఏ వస్తువును కొట్టినా శబ్దం వస్తుంది. కానీ బెల్లపు అచ్చును కొట్టినప్పుడు మాత్రం తక్కువ శబ్దం వస్తుంది. చాలాసార్లు రాయికి బెల్లం పేరుకుపోయి, ఆ బరువుతో శబ్దమే చేయదు. అంటే రాయి కాస్తా తన సహజమైన లక్షణాన్ని కోల్పోయిందన్నమాట.

 మనిషన్నాక భావోద్వేగాలు ఉంటాయి. ఉండాలి కూడా! సున్నితమైన భావోద్వేగాలకు సంబంధించిన విషయాలే కాదు... సామాజిక సంచలనాలు, వర్తమాన ధోరణులు...



ఇలా రకరకాల విషయాలపై మనిషి సహజంగానే స్పందిస్తాడు. కొందరు మాత్రం వీటికి అతీతంగా ఉంటారు. ప్రకృతి అందాల నుంచి విలయాల వరకు వారిని ఏవీ ప్రభావితం చేసినట్లుగా అనిపించవు. ఎప్పుడూ ఒకే మూడ్‌తో స్పందనా రాహిత్యంతో కనిపిస్తారు. ఇలాంటి వారిని ‘బెల్లం కొట్టిన రాయి’తో పోల్చుతారు.

 

చేతడి ఆరేలోపే!

బద్ధకంగా, తీరుబడిగా చేసేవారి కంటే వీలైనంత త్వరగా పని పూర్తి చేసేవారికి ఎక్కువ గుర్తింపు వస్తుంది. అలా వేగంగా పని చేసేవారికి తగిన ప్రాధాన్యత  కూడా లభిస్తుంది!

 అటువంటి పనిమంతుల ప్రతిభ గురించి మాట్లాడేటప్పుడు వాడే జాతీయం ఇది. ‘అతనికి పని అప్పజెప్పి చూడు... చేతడి ఆరేలోపు  పూర్తి చేస్తాడు’ అని అంటారు. చేతికి పట్టిన చెమట, నీటి తడి ఆరడానికి పెద్దగా సమయమేమీ పట్టదు. అంత తక్కువ సమయంలో చేసేస్తాడు అని చెప్పడమే అందులోని ఉద్దేశం!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top