హరియాణాలో 25 లక్షల నకిలీ ఓట్లున్నాయి
వీటి సాయంతోనే బీజేపీ గెలిచింది
బ్రెజిలియన్ మోడల్‌కూ ఓట్లు
22 సార్లు ఆమె పేరిట ఓటేశారు
ఈ మోసాన్ని బిహార్‌లోనూ అమలుచేయబోతున్నారు
ఈసీ, బీజేపీపై నిప్పులు కురిపించిన కాంగ్రెస్ అగ్రనేత
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నిల సంఘంపై, కేంద్ర ప్రభుత్వంపై సాధారణ విమర్శలు చేసే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం భారీ హైడ్రోజన్ బాంబు పడేశారు. ఏకంగా పాతిక లక్షల నకిలీ ఓట్లతో, ఈసీ అండదండలతో హరియాణా ఎన్నికల్లో బీజేపీ దొంగమార్గంలో గెలిచిందని రాహుల్ విమర్శించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను చోరీచేశారని ఆరోపించారు.
హరియణాలో బీజేపీ విజయం సాధించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు బీజేపీతో కలిసి పనిచేశారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వీళ్లంతా ప్రధాని మోదీకి భాగస్వాములని వ్యాఖ్యానించారు. ఈ విమర్శల జడివానకు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’ వేదికైంది. బుధవారం మీడియా సమావేశంలో రాహుల్ పలు సంచలనాత్మక ఆరోపణలు చేశారు. బిహార్ తొలి దశ పోలింగ్‌కు కొన్నిగంటల ముందు రాహుల్ ఈ విమర్శల జల్లు కురిపించారు.
సీమా.. స్వీటీ.. సరస్వతి..
‘‘హరియాణాలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని ఐదు వేర్వేరు ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెప్పాయి. కాంగ్రెస్ 73 చోట్ల గెలిస్తే బీజేపీకి 17 సీట్లే వస్తాయని చెప్పాయి. కానీ బీజేపీ చేసిన ఈ ఓట్ల చోరీ, నకిలీ ఓట్ల దందాతో కాంగ్రెస్ ఓడిపోయింది. బీజేపీ వ్యక్తులు అటు ఉత్తరప్రదేశ్‌లో ఓటేసి తర్వాత హరియాణాలోనూ ఓటేశారు. పాతిక లక్షల ఓట్లు ఉన్నాయనడానికి ఈ బ్రెజిల్ మోడలే ప్రత్యక్ష ఉదాహరణ. ఈమె ఫొటో, వివరాలతో 22 ఓట్లు ఉన్నాయి. సీమా, స్వీటీ, సరస్వతి.. ఇలా 22 పేర్లతో ఉన్న ఓట్లన్నీ ఈమె ఫొటోతో నమోదై ఉన్నాయి. గత ఏడాది ఎన్నికల్లో 10 బూత్‌లలో ఆ ఓట్లన్నీ పోలయ్యాయి. బీజేపీ కార్యకర్తలు నేతలు అటు ఉత్తరప్రదేశ్‌లో ఇటు హరియాణాలో ఓటర్లుగా నమోదయ్యారు.
బీజేపీ నేత దాల్చంద్ యూపీ, హరియాణాల్లో ఓటేశారు. మథురలో బీజేపీ సర్పంచ్ ప్రహ్లాద్ అదే పనిచేశారు. ఇలాంటి వాళ్లు వేలల్లో ఉన్నారు. పాల్వాల్ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్, బీజేపీ నేత 150వ నంబర్ ఇంట్లో ఉంటున్నారు. ఆయన ఇంట్లో ఏకంగా 66 ఓట్లు ఉన్నాయి. ఇంకొకరైతే తన ఇంట్లో 500 మంది ఓటర్లు ఉన్నారని అన్ని ఓట్లను నమోదుచేశాడు. ఇవన్నీ మేం స్వయంగా క్షేత్రస్థాయిలో తిరిగి తెల్సుకున్నవే. ఇక హరియాణా ఎన్నికల చరిత్రలో తొలిసారిగా బ్యాలెట్ ఓట్లు అనేవి వాస్తవ ఓటర్లతో సరిపోలలేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు. కాంగ్రెస్ చరిత్రాత్మక విజయాన్ని వ్యవస్థీకృత నేరం ద్వారా ఓటమిగా మార్చేశారు’’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
మేం అటు పోరాడుతుంటే ఇటు చంపేశారు
‘‘భారత ప్రజాస్వామ్యాన్ని సర్కార్‌చోరీ విధానంతో నాశనంచేశారు. ఈ వినాశనానికి ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) అనేది సరికొత్త ఆయుధంగా దాపురించింది. బిహార్‌లోనూ ఓటు చోరీని మొదలెట్టారు. మేం విపక్ష పార్టీలతో కలసి ఓ వైపు ఎస్‌ఐఆర్‌పై పోరాటం చేస్తుంటే మరోవైపు ప్రజాస్వామ్యాన్ని కొన్ని శక్తులు చంపేస్తున్నాయి. ఆనాడు హరియాణా ఓట్ల లెక్కింపునకు రెండ్రోజుల ముందు సీఎం నయాబ్ సైనీ ఓ మాట అన్నారు. ఒక వ్యవస్థను సిద్ధంచేశాం. అందుకే మేం గెలవబోతున్నాం అని అన్నారు. అప్పుడే మాకు అనుమానం వచ్చింది. కర్ణాటకలోని మహాదేవపుర, ఆలంద్ నియోజకవర్గాల్లో జరిగిన మోసమే రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో జరుగుతోందని మాకు అర్థమైంది’’ అని రాహుల్ వివరించారు.
మోదీ, ఈసీల సారథ్యంలో వ్యవస్థీకృత ఓటు చోరీ
‘‘ప్రధాని మోదీ, ఎలక్షన్ కమిషన్ సంయుక్తంగా వ్యవస్థీకృత ఓటు చోరీ విధానాన్ని తీసుకొచ్చారు. ఈసారి బిహార్ ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు దానిని రంగంలోకి దింపుతున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఈసీ పార్ట్‌నర్‌షిప్ కొనసాగిస్తోంది. వీళ్లంతా మూకుమ్మడిగా దేశ ప్రజాస్వామ్య పునాదులను పెకలిస్తున్నారు. ఓట్ల చోరీని ఓ పరిశ్రమగా మార్చేశారు. పోలింగ్ జరిగే ప్రతి రాష్ట్రానికి దానిని పట్టుకొస్తున్నారు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వేదిక మీదకు రాహుల్ కొందరు బిహారీ ఓటర్లను ఆహా్వనించారు. తన ఒక్కడి ఓటే తీసేశామని అధికారులు చెప్పారని, తీరాచూస్తే గ్రామంలో మరో 187 ఓటర్ల ఓట్లు కూడా గల్లంతయ్యాయని ఆ బిహారీలు చెప్పారు.
ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీదే
‘‘ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వ అధికారాన్ని చేజిక్కించుకునే ‘ఆపరేషన్ సర్కార్ చోరీ’కి ఈసీ తెరతీసింది. ఇంటి నంబర్ లేని సందర్భాల్లో, నిరాశ్రయులకు మాత్రమే ‘జీరో నంబర్’ ఇస్తామనేది శుద్ధ అబద్ధం. మా బృందం స్వయంగా క్షేత్రస్థాయిలో తిరిగి లెక్కలేనన్ని లొసుగులను పట్టుకుంది. ఇంటి నంబర్ జీరో అని ఓటరు జాబితాలో ఉన్న వాళ్లెందరో తమ సొంత ఇళ్లలో ఉంటున్నారు. ఇల్లు లేని వాళ్లకు మాత్రమే జీరో నంబర్ కేటాయించామని ఈసీ చెబుతున్న దాంట్లో నిజం లేదు. హరియాణాలో 25,41,144 నకిలీ ఓట్లు ఉన్నాయి. వీటిలో చాలా ఓట్లు రెండు మూడు చోట్ల ఉన్నాయి. అంటే 5,21,619 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి.
అడ్రస్‌లేని 93,174 ఓట్లు ఉన్నాయి. ఒక అడ్రస్‌పై వందల ఓట్లున్నాయి. అలాంటివి రాష్ట్ర ఓట్ల జాబితాలో ఏకంగా 19,26,351 ఓట్లు ఉన్నాయి. నకిలీ ఓటర్ల ఫొటోలతో 1,24,177 ఓట్లు సృష్టించారు. హరియణాలోని ప్రతి ఎనిమిది ఓట్లలో ఒకటి నకిలీదే. పాతికలక్షల ఓట్లు అంటే రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో 12 శాతం ఓట్లు నకిలీవే. ఒక్క నియోజకవర్గంలో 22,000 ఓట్ల మెజారిటీ అంటేనే చాలా పెద్ద సంఖ్య. అలాంటిది 25 లక్షల ఓట్లు అంటే ఇక లెక్కేసుకోండి. ఎంతటి కుట్ర జరిగిందో. ఈ కారణంగానే గత ఏడాది హరియాణా ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ 22,779 ఓట్ల తేడాతోఓడిపోయింది. ఈ అంకెల గారడీలు చూస్తే నేనే షాక్ అయ్యా. మీ భవిష్యత్తు ఎలా చోరీకి గురవుతోందో జెన్‌జెడ్ యువత ఇకనైనా తెల్సుకోవాలి’’ అని రాహుల్ అన్నారు.


