ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్, భారతీయ మూలాలున్న కశ్యప్(కాష్) పటేల్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలపై స్పందించారు. తన ప్రేయసితో కలిసి ఎఫ్‌బీఐకి చెందిన జెట్‌లో ప్రయాణించడంపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో రాజకీయ ఆరోపణలనూ ఆయన తోసిపుచ్చారు.
కశ్యప్ పటేల్(45) తన గర్ల్‌ఫ్రెండ్ అలెక్సిస్ విల్కిన్స్(26)తో కలిసి ఎఫ్‌బీఐకి చెందిన జెట్ విమానంలో అక్టోబర్ 25వ తేదీన పెన్సిల్వేనియాకు ప్రయాణించారు. అక్కడ ఓ రెజ్లింగ్ ఈవెంట్‌లో ఆమె గాన ప్రదర్శన ఇచ్చారు. ఈ విమాన ప్రయాణానికి అయిన ఖర్చు 60 మిలియన్ డాలర్లపైనే. దీంతో దుమారం రేగింది. ఈ ఘటనపై
ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్ కైల్ సెరాఫిన్ ఓ పాడ్‌కాస్ట్‌లో మండిపడ్డారు. దేశం షట్‌డౌన్ ఉన్న టైంలో.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో.. ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఇలా సంస్థ నిధుల్ని దుర్వినియోగం చేయడం ఏంటి? అని నిలదీశారు. దీంతో కాష్ పటేల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే..
భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ఎఫ్‌బీఐకి చెందిన విమానంలో ప్రయాణించారని, పైగా అందుకు అయ్యే ఖర్చులు ఆయనే భరిస్తారని, వ్యక్తిగత ప్రయాణాల్లో విమానం వినియోగం పరిమితంగానే అదీ విధానాలకు అనుగుణంగా ఉంటుందని ఎఫ్‌బీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. మరోవైపు..
ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తనపై వచ్చిన విమర్శలకు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ ఆరోపణలు అసత్యమైనవని, రాజకీయంగా ప్రేరితమైనవని అన్నారు. నన్ను విమర్శించండి, కానీ నా వ్యక్తిగత జీవితం మీద దాడి చేయడం దారుణం. అలెక్సిస్ నిజమైన దేశభక్తురాలు, నా జీవిత భాగస్వామి. ఆమెపై వచ్చిన ఆరోపణలు అతి నీచమైనవి. ఆమె దేశానికి చేసిన సేవలు చాలా మందికి పదే పదే జీవితాల్లో సాధ్యం కాదు. రాజకీయ వర్గాల్లో మాకు మద్దతు ఆశించాం. కానీ, వాళ్ల మౌనం వల్ల విమర్శలు పెరిగిపోతున్నాయి. నా కుటుంబం మీద ప్రేమే నా బలానికి మూలం. ఎఫ్‌బీఐను పునర్నిర్మించడమే మా లక్ష్యం అని అన్నారాయన.
ఎఫ్‌బీఐ అధికార ప్రతినిధి బెన్ విలియమ్సన్.. కాష్ పటేల్ విమాన ప్రయాణంపై జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. అవన్నీ అర్థం లేని కథనాలని కొట్టిపారేశారు. మరోవైపు.. తన విమాన ప్రయాణ వివరాలు లీక్ కావడంపై కాష్ పటేల్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎఫ్‌బీఐ సీనియర్ ఉద్యోగి స్టీవెన్ పాల్మర్ (విమాన విభాగం అధిపతి) రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
న్యాయనిపుణుడైన కాష్ పటేల్, అమెరికన్ సింగర్ అయిన అలెక్సిస్ విల్కిన్స్‌లు 2023 జనవరి నుంచి డేటింగ్‌లో ఉన్నారు. ఇద్దరి మధ్య వయసు తేడా 19 ఏళ్లు. అలెక్సిస్ విల్కిన్స్‌పై గతంలో ఇస్రాయెల్ గూఢచారి అనే ప్రచారం జరిగింది. ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదలపై ప్రభావం చూపేందుకు ఆమె ప్రయత్నించిందన్నది ఆ ప్రచార సారాంశం. ఈ ఆరోపణలు చేసిన కైల్ సెరాఫిన్‌పై అలెక్సిస్ 5 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ పరువు నష్టం దావా వేశారు.


