కొత్తకోకిలలు

కొత్తకోకిలలు


కవర్ స్టోరీ

పాట అంటే తోట. గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిరాలతో సంబంధం లేని తోట. ఇక్కడంతా నిత్య వసంతమే. వసంతం అంటేనే... తుమ్మెదలూ పువ్వులూ ఝంకారాలూ చిగురాకులూ కోకిలలూ కిలకిలలూ! సినిమా పాటల తోటలో ఒకప్పుడు అయిదారు కోయిలలే. కానీ, ఈ వసంత పరిమళానికి దాసోహమై ఎక్కడెక్కడ్నుంచో కొత్త కోకిలలు వచ్చి ఇప్పుడు ఈ తోటలో సందడి చేస్తున్నాయి. ఇప్పుడిది కొత్త కోయిలల రాజ్యం.

 

నిజమే... ఒకప్పుడు తెలుగు సినిమా పాట ఇద్దరు ముగ్గురికే సాష్టాంగ నమస్కారం చేసింది. ఇప్పుడు ట్రెండ్ మారింది. తెలుగు సినిమా పాట ఎంతమందికైనా షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అప్పుడు సినిమాల్లో పాటలెక్కువ, సింగర్‌‌స తక్కువ. ఇప్పుడు పాటలు తక్కువ, సింగర్‌‌స ఎక్కువ. అయినా బాగుంది. కొత్తదనమెప్పుడూ తియ్యదనమే కదా! ‘పాడుతా తీయగా... సూపర్ సింగర్‌‌స... లిటిల్ చాంప్స్...’ ఇలా రకరకాల టీవీ ప్రోగ్రామ్స్.



ఇవన్నీ కొత్త కోయిలల్ని వెతికి పట్టుకొచ్చే దుర్భిణులు. ఒకప్పుడు రావు బాలసరస్వతి, పి.సుశీల, ఎస్. జానకి, లీల, జిక్కీ, జమునారాణి, ఎల్.ఆర్. ఈశ్వరి, వాణీ జయరామ్, శైలజ - ఇలా గాయనులు అంటే కొందరే. నిన్నటి తరం చిత్ర వరకు ఇదే పరిస్థితి. కానీ, కొత్త సహస్రాబ్దిలో తెలుగు పాట సరికొత్తగా ముస్తాబైంది. సునీత, ఉష, కౌసల్య, గీతా మాధురి, శ్రావణభార్గవి, అంజనా సౌమ్య, చిన్మయి - ఇలా చాలామంది నవతరం గాయనులు తెర ముందుకు వచ్చారు. తెలుగు పాటకు కొత్త గ్లామర్, గ్రామర్ అద్దారు. కేవలం గడచిన పది, పదిహేనేళ్లలో వందల మంది ఫిమేల్ సింగర్‌‌స ఉద్భవించారు. ఇంకా వస్తారు కూడా.



కొందరు మాత్రం ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటే... ఇంకొందరు మాత్రం తమ సప్త స్వరాలాపనతో ఏడు రంగుల ఇంద్రధనుస్సుల్ని సృష్టిస్తున్నారు. ఒకప్పుడు కొన్ని తరాల పాటు కొందరి గాన గాంధర్వమే వినిపించింది. ఇప్పుడు అలా కాదు... తరానికో స్వరం. స్వరానికో గళం. ప్రతి గళం... ఒక వరం. ఏ పాట ఎవరు పాడారో గుర్తు పెట్టుకొనే లోపలే మరో కొత్త కోయిల కమ్మగా గొంతు సవరిస్తుంది. మరో పాట మెత్తగా మన చెవి మీటుతుంది. ప్రతి అయిదారేళ్ళకో కొత్త పాటల తెమ్మెర వీస్తోంది.

 

ఇంగ్లీషు చదువులు, ఇంజినీరింగ్ ఉద్యోగాల గందరగోళపు పరుగుపందెంలో నవ తరం మళ్ళీ తెలుగు మాట నేర్చుకోవడానికి సినిమా పాట ఒక సాధనమైంది. ప్రతిభాన్వేషక పోటీలు, పాటకచ్చేరీలు, సంగీత విభావరుల పుణ్యమా అని తల్లితండ్రులు పిల్లలకు మన సంగీతం నేర్పుతున్నారు. మన సంస్కృతి, సాహిత్యం మప్పుతున్నారు. అందుకే, ఆధునిక తరానికి కూడా గళసీమలో పాట ఒక ‘శంకరాభరణం’. కొత్త కోకిలలు గొంతు సవరించి చేస్తున్న కలకూజితాల కచ్చేరీ నిజంగా మధురాతి మధురం! అలా ఇటీవలి కాలంలో తమ స్వరాలతో మన మనసు దోస్తున్న ఏడుగురు తెలుగింటి విరిబోణుల గురి తప్పని పాటల్ని ఆలకిద్దాం.

 

రమ్య బెహరా

‘బాహుబలి’తో భారీగా గుర్తింపు తెచ్చుకున్న యువ సింగర్ రమ్య బెహరా. ‘ధీవర...’ పాట ఈ యువతికి ఇప్పుడు పెద్ద టర్నింగ్ పాయింట్. ఒక్క తెలుగుకే పరిమితం కాకుండా, పలు ఇతర  భారతీయ భాషల్లో కూడా రమ్య గళం విప్పుతున్నారు. ఏ భాషలో పాడినా ఆ భాష తాలూకు సౌందర్యం, భావం అర్థం చేసుకొని పాడడానికే ప్రయత్నిస్తానంటారు. సహజంగానే, శాస్త్రీయ సంగీత శిక్షణ, లలిత సంగీత పరిచయం ఆమెకు పెట్టనికోట అయ్యాయి.

 

స్వస్థలం: పుట్టింది గుంటూరు జిల్లా నరసరావుపేటలో. స్థిరపడింది హైదరాబాద్‌లో.

చదువు: బీఎస్సీ పూర్తయ్యింది. ప్రస్తుతం కర్ణాటక, లలిత సంగీతాలు నేర్చుకుంటోంది.

తొలి పాట: ‘వెంగమాంబ’లో ‘సప్తగిరీశుని...’,

 

పేరు తెచ్చిన పాటలు: 1. రారీ రోరేలా (రాజన్న), 2. సూడు సూడు సూడు (లౌక్యం), 3. కొత్తగున్నా హాయే నువ్వా... (ప్రేమకథా చిత్రమ్), 4.కుంగ్‌ఫూ కుమారీ... (బ్రూస్‌లీ), 5. గువ్వా గోరింకతో... రీమిక్స్ (సుబ్రహ్మణ్యం ఫర్ సేల్), 6. ధీవర... (బాహుబలి)

 

తెలుగు, కన్నడ, తమిళ, ఒరియా, హిందీ భాషల్లో పాడుతున్నాను. హిందీలో ‘బేబీ’ (2015) అనే సినిమాలో ‘మై తురుసే ప్యార్ నహీ కర్‌తీ’ పాటను కీరవాణిగారే నాతో పాడించారు. ఒరియాలో కూడా రెండు పాటలు పాడాను. ఇలా అన్ని భాషల్లోనూ అందరు సంగీత దర్శకులతోనూ పాడాలని ఉంది. ఇంగ్లీషులో కూడా ఒక్క జింగిల్ అయినా పాడాలని ఉంది. జీవితాంతం ఇలా మంచి మంచి పాటలు పాడుతూ పోవాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. అదే నా లక్ష్యం.

- రమ్య

 

లిప్సిక

కొత్త తరంలో ఆల్‌రౌండర్ లిప్సిక. ఈవిడ సింగర్‌గా ఎంత పేరు తెచ్చుకుందో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అంతకన్నా ఎక్కువ పేరే తెచ్చుకుంది. ఈ పదేళ్లలో దాదాపు 150 సినిమాలకు పైగా పాడిన లిప్సిక, గత ఏడాది విడుదలైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘కుమారి 21ఎఫ్’లో హీరోయిన్ హెబ్బా పటేల్‌కు గాత్రదానం చేసి, యువతను ఆకట్టుకుంది.

 

చదువు: ఎంబీయే పూర్తయ్యింది. కర్ణాటక సంగీతంలో డిప్లొమో, వెస్ట్రన్ మ్యూజిక్‌లో ఫిఫ్త్ గ్రేడ్ పూర్తయ్యాయి.

పేరు తెచ్చిన పాటలు: 1. వన్‌మోర్ టైమ్... (టెంపర్), 2. హ్యాపీ హ్యాపీ... (లవర్‌‌స), 3.ఓ మై లవ్... (ప్రేమకథా చిత్రమ్), 4. పిల్ల గాలుల పల్లకీలో... (మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు), 5. తూహీ తూహీ... (కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ).

 

సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇంకా పెద్ద పేరు తెచ్చుకుంటాను. ఎప్పటికైనా మ్యూజిక్ స్కూల్ పెట్టాలనేది నా డ్రీమ్.

- లిప్సిక

 

దామినీ భట్ల

ఒక్క పాట. ఒకే ఒక్క పాటతో దామిని సూపర్ సింగరైపోయింది. ‘బాహుబలి’ సినిమా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పాట... ‘పచ్చ బొట్టేసినా...’. ఈ పాట పాడింది దామినియే.

     

ఓ తమాషా తెలుసా?

‘బాహుబలి’ ఆడియో రిలీజయ్యే వరకూ ఈ పాటకు సింగర్‌ని తానేనన్న విషయం దామినికి తెలియనే తెలియదు. టాప్ మ్యూజిక్ డెరైక్టర్ కీరవాణి మ్యూజిక్ ట్రూప్‌లో మెంబర్ తను. ‘బాహుబలి’ కోసం ‘పచ్చబొట్టేసినా’ పాటను దామినితో పాడించారు కీరవాణి. అది వట్టి ట్రాకేననుకుందామె. కీరవాణి మాత్రం ఆ పాటకు ఆ వాయిస్సే కరెక్టనుకున్నారు. అదే ఫైనల్. ఆడియో రిలీజై, అందరూ కంగ్రాట్స్ చెప్పేవరకూ దామినికి విషయం తెలియలేదు. ఆ క్షణం నుంచి ఆ పాటే ఆమెకు పచ్చబొట్టయిపోయింది. బెస్ట్ సింగర్‌గా ఇటీవలే ‘గామా’ అవార్డు కూడా అందుకుందామె.

 సొంతవూరు: రాజమండ్రి

 

స్థిరపడింది: హైదరాబాద్‌లో

చదువు: ఆంధ్ర మహిళా సభలో, కర్ణాటక సంగీతంలో బి.ఎ. ఫైనలియర్.

స్ఫూర్తి: గాయని చిత్ర



తొలి పాట: మలయాళ హీరో పృథ్వీరాజ్ నటించిన ‘లవ్ ఇన్ లండన్’ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేశారు. అందులో ‘నీకోసం...’ అనే పాటను సింగర్ దీపుతో కలిసి పాడింది.

 పేరు తెచ్చిన పాటలు: 1. పచ్చబొట్టేసినా... (బాహుబలి), 2. క్రేజీ (లచ్చిందేవికో లెక్కుంది), 3. చిట్టి తల్లి... (పడేశావే)

 

నాన్న రాధాకృష్ణ ప్రైవేటు ఉద్యోగి. అమ్మ శ్రీఝాన్సీ గృహిణి. అక్క మౌనిమ కూడా గాయనే. కాకినాడ స్కూల్లో చదువుతున్నప్పుడు చదువుతో పాటు ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోమంటే అక్క మ్యూజిక్‌నీ, నేను డ్యాన్‌‌సనీ ఎంచుకున్నాం. అక్క పాడుతుంటే నేను కూడా మ్యూజిక్ వైపు ఎట్రాక్ట్ అయిపోయా. అప్పటి నుంచీ సంగీతంలో శిక్షణ తీసుకున్నాను. బుల్లితెరపై పలు సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నాను. తర్వాత కీరవాణి గారి సంగీత బృందంలో చేరాను. ‘పచ్చబొట్టేసినా’ పాట పాడే అవకాశం వస్తుందని నేను ఊహించను కూడా ఊహించలేదు. సంగీతమే నా ప్రపంచం. చివరి క్షణం వరకూ ఇక్కడే ఉండాలి. అంతకు మించి లక్ష్యాలేమీ లేవు.

- దామిని

 

మోహన భోగరాజు

‘బాహుబలి’ చాలామందికి లైఫ్ ఇచ్చింది. ఆ జాబితాలో కచ్చితంగా చేర్చాల్సిన పేరు మోహన. చిన్నతనం నుంచీ పాటే ప్రాణంగా బతికినందుకు ఆమెకు దక్కిన అపురూప బహుమతి ‘బాహుబలి’లోని ‘మనోహరి...’ గీతం. చాలా మనోహరంగా పాడింది మోహన. చాలా తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న సింగర్ అంటే మోహన పేరే చెప్పాలి.



సొంతవూరు: పుట్టింది ఏలూరు. కానీ ఇప్పుడు హైదరాబాదే సొంతవూరు.

స్ఫూర్తి: చిత్ర, బాంబే జయశ్రీ, సునిధీ చౌహాన్, చిన్మయి.

తొలి పాట: ఉదయ్‌కిరణ్ హీరోగా నటించిన ‘జై శ్రీరామ్’లో ‘సయ్యామ మాసం...’

పేరు తెచ్చిన పాటలు: 1. మనోహరి (బాహుబలి), 2. సైజ్ సెక్సీ (సైజ్ జీరో), 3. భలే భలే భలే భలే మగాడివోయ్ (భలే భలే మగాడివోయ్), 4. అక్కినేని అక్కినేని... (అఖిల్), 5. దేవ్ దేవ్ దేవుడా... (సౌఖ్యం), 6. డిక్కి డిక్కి డుమ్ డుమ్... (సోగ్గాడే చిన్ని నాయనా)

 

చిన్నతనంలోనే సింగర్‌గా చాలా పురస్కారాలు గెలుచుకున్నా. ‘జై శ్రీరామ్’లో పాడాక, రెండేళ్లు చదువు మీదే శ్రద్ధ పెట్టా. ఆ తర్వాత కీరవాణిగారిని కలిసి ఆయన బృందంలో చేరా. కోరస్ సింగర్‌గా చాలా పాడాను. ప్రభాస్ బర్‌‌తడే సందర్భంగా రిలీజ్ చేసిన ‘బాహుబలి’ టీజర్ కూడా నేను పాడిందే. ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంలో ‘అంతే ప్రేమంతే...’ పాటను కీరవాణి గారి అబ్బాయి భైరవతో కలిసి పాడాను.

- మోహన


 

సమీరా భరద్వాజ్

మన తెలుగుమ్మాయే. కానీ పదేళ్లుగా చెన్నైలో స్థిరపడిపోయింది. చెన్నైలో వివిధ సంస్థలు నిర్వహించిన పాటల పోటీల్లో పాల్గొని, బహుమతులు సంపాదించింది. ఆ పాపులారిటీతో, చెన్నైలో స్థిరపడిన సంగీత దర్శకుల ప్రోత్సాహంతో సినిమాల్లోకి అడుగు పెట్టింది. రెండేళ్ళ వ్యవధిలో దాదాపు 200 సినిమాలకు పాడింది. తెలుగు, తమిళ భాషలు రెంటిలోనూ సింగర్‌గా రాణించాలని ఆకాంక్ష, ఆశయం. అన్నట్లు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తమిళ వెర్షన్‌లో సమంతకు తమిళ డబ్బింగ్ చెప్పింది కూడా సమీరే.



పుట్టింది: హైదరాబాద్, స్థిరపడింది చెన్నై

చదువు: మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో బీకాం, సీఎస్ పూర్తయ్యింది. ప్రస్తుతం కర్ణాటక సంగీతం, హిందుస్తానీ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు.

 ఫేవరెట్ సింగర్: పి. సుశీల. ఆవిడ ఏ పాట పాడినా మనసుతో పాడినట్టే అనిపిస్తుంది. ఏ హీరోయిన్‌కి పాడినా వాళ్లలో లీనమైపోయి పాడిన ఫీలింగ్. అందుకే ఆమె వాయిస్ ఎవర్‌గ్రీన్ అంటారు సమీర.

 

తొలి పాట: రామ్ హీరోగా నటించిన ‘శివమ్’ కోసం ‘ఐ లవ్యూ...’ అనే పాటను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పాడించారు.

పేరు తెచ్చిన పాటలు: 1. అలీ అలీ బ్రూస్లీ... (బ్రూస్లీ), 2. చల్ చలోనా... (షేర్), 3. గణ గణ గణ గణ ఆంధ్రా తెలంగాణ... (డిక్టేటర్), 4.తెలుసా తెలుసా... (సరైనోడు) 5. దావాని పుల్లే... (తమిళ చిత్రం ‘ఎన్నై పిరియాదే’) 6.కన్‌వే... (తమిళ చిత్రం ‘అరణ్యం’)

 

సింగర్ అవుతాననీ, ఇదే నా ప్రొఫెషన్ అవుతుందని అస్సలు ఊహించలేదు. ఏదో నా మానాన నేను పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని. అది విని, మా ఇంట్లోవాళ్లు నా టాలెంట్‌ను గుర్తించారు. ఎంకరేజ్ చేశారు. అందుకే ఈ స్థాయికి చేరుకున్నాను. తెలుగు, తమిళ భాషలు రెండిట్లోనూ గాయనిగా మంచి పేరు తెచ్చుకోవడం కోసమే నా తాపత్రయమంతా.


- సమీరా

 

సత్య యామిని

చిన్నప్పటి నుంచి సంగీతం మీద ఆసక్తి ఉన్న యామిని అనేక ప్రైవేట్ ఆల్బవ్‌ు్సలో పాడారు. ఇంజినీరింగ్ చదువుతున్న ఈ యువ గాయని కూడా ‘బాహుబలి’ సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకున్న సింగరే. ‘మమతల తల్లి ఒడి బాహుబలి...’ అంటూ ఈమె పాడిన సూపర్‌హిట్ సాంగ్ జనాదరణతో పాటు, ఇటీవల ప్రతిష్ఠాత్మక ప్రైవేట్ అవార్డుల్లో ఒకటైన ‘ఐఫా’ అవార్డును కూడా సంపాదించి పెట్టింది. ఈ ఏడాది సంక్రాంతి రిలీజుల్లో సూపర్ హిట్టయిన నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలోని టైటిల్ సాంగ్ కూడా సత్య యామిని పాడినదే.

 

స్వస్థలం: హైదరాబాద్

చదువు: ఘట్‌కేసర్‌లోని సీఎస్సార్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం

ఫేవరెట్ సింగర్: పి.సుశీల

పేరు తెచ్చిన పాటలు: 1. మమతల తల్లి ఒడి బాహుబలి... (బాహుబలి), 2. సోగ్గాడే చిన్నినాయనా ఒక్క పిట్టనైన కొట్టలేడు... (సోగ్గాడే చిన్నినాయనా) 3. ఎదురుగా ఒక వెన్నెల... (భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ), 4. మగువ మనసు... (ఏమో గుర్రం ఎగరావచ్చు), 5. సన్నజాజి పడక... రీమిక్స్ (సైజ్ జీరో)

 

సంగీతమంటే నాకు ప్రాణం. సుశీల గారి పాటలంటే చెవి కోసుకుంటాను. ఓపక్క చదువులో బిజీ అయినా పాటలకిచ్చే ప్రాధాన్యం ఎక్కువే. మంచి గాయనిగా పేరు తెచ్చుకోవడం కోసం నిరంతర ప్రయత్నం, సాధన చేస్తున్నా. ‘ఐఫా’ అవార్డు లాంటివి రావడం నాకు ఈ దశలో ఎంతో ప్రోత్సాహమిచ్చాయి.

- సత్య యామిని

 

మౌనిమ

‘బాహుబలి’తో బ్రేక్ తెచ్చుకున్న వారిలో ఇద్దరు సిస్టర్‌‌స ఉన్నారు. ఒకరేమో ‘పచ్చబొట్టేసినా...’ ఫేవ్‌ు దామిని, ఇంకొకరు మౌనిమ. దామినికి అక్క మౌనిమ. ఆమెకు చిన్నప్పటి నుంచీ సంగీతమంటే ప్రాణం.

స్వస్థలం: రాజమండ్రి. ఇప్పుడు ఉండేది హైదరాబాద్‌లోనే.

చదువు: బీకామ్ కంప్యూటర్‌‌స. అమెరికన్ కొలాబరేషన్ బ్యాంక్‌లో ఏడాది పాటు పని చేసింది. ఇప్పుడు దృష్టంతా సంగీతమ్మీదే.

తొలి పాట: ‘బాహుబలి’ చిత్రంలోని ‘ఎవ్వడంట ఎవ్వడంట...’.

 

బోలెడన్ని భక్తి గీతాల ఆల్బమ్స్, బతుకమ్మ పాటలు పాడాను. ‘బాహుబలి’లోని ఒక్క పాటతోనే నాకు బోలెడంత క్రేజ్ వచ్చేసింది. నాకు సింగింగ్‌తో పాటు యాక్టింగ్ మీద కూడా చాలా ఆసక్తి.‘వర్షం సాక్షిగా’ అనే షార్‌‌ట ఫిల్మ్‌లో నేను యాక్ట్ చేశాను. ‘స్టేజెస్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తున్నాను.

- మౌనిమ

 

ఇంకొన్ని కొత్త కోకిలలు...

* సాయి శివాని (‘టక్కరి’లో ‘అమ్మి... అమ్మి...’ పాట, ‘మగధీర’లో ‘బంగారు కోడిపెట్ట...’ పాట రీమిక్స్, ‘కృష్ణ’లో ‘అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్ని...’ పాట, ‘రైడ్’లో ‘దంచవే మేనత్తా కూతురా...’ పాట రీమిక్స్)



* శ్రుతి (‘ఆలస్యం అమృతం’లో ‘మొదటి క్షణం...’ పాట, ‘రాజా చెయ్యి వేస్తే’లో ‘చిన్నారి తల్లి...’ పాట, ‘హితుడు’ సహా పలు ఇతర చిత్రాల్లో పాటలు)

      

* స్ఫూర్తి (‘కిక్-2’లో ‘తీస్‌మార్‌ఖాన్...’ పాట)

      

* హర్షిక (‘ఉయ్యాల-జంపాల’లో ‘ఉయ్యాలైనా జంపాలైనా...’ పాట, ‘హ్యాపీడేస్’లో ‘వీడుకోలు...’ పాట)

      

* పర్ణిక (‘దేనికైనా రెడీ’లో ‘పిల్లందం కేక కేక...’ పాట)

      

* సాహితి (‘కొత్త జంట’లో ‘అటు అమలా పురం ఇటు పెద్దాపురం...’ రీమిక్స్ సాంగ్)

      

* ఉమా నేహ (‘టెంపర్’, ‘జ్యోతిలక్ష్మి’ చిత్రాల్లో టైటిల్ సాంగ్‌‌స)

      

* నూతన (‘బెంగాల్ టైగర్’లో ‘ఆసియా ఖండంలో...’ పాట, నిఖిల్ ‘శంకరాభరణం’లో టైటిల్‌సాంగ్)

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top