నిజం చంపుతుంది
ప్‌కార్‌లోని ఐదు వందల ఇళ్లల్లో రాబర్ట్‌ది ఒకటి. అతని ఎదురిల్లు లిచీది. రెండు నెలల క్రితం రాబర్ట్ ఆ ఇంట్లోకి మారినప్పటినించి...
	మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 4
	కేప్‌కార్‌లోని ఐదు వందల ఇళ్లల్లో రాబర్ట్‌ది ఒకటి. అతని ఎదురిల్లు లిచీది. రెండు నెలల క్రితం రాబర్ట్ ఆ ఇంట్లోకి మారినప్పటినించి రాబర్ట్‌కి, అతని భార్య సిల్వియాకి ఓ సమస్య ఎదురైంది. అది ఎదురింటి లిచీయే. ఆమె సదా తమని గమనిస్తోందని వాళ్లు మొదటి వారంలోనే గ్రహించారు. వాళ్లు ఎప్పుడూ తలుపు తెరిచి బయటికి వెళ్లినా అంతసేపూ తెరిచి ఉన్న ఎదురింటి కిటికీ వెనీషియన్ బ్లైండ్స్ మూసుకుంటాయి.
	
	తమ కిటికీ వెనీషియన్ బ్లైండ్స్‌ని ఎప్పుడు ఎత్తిచూసినా ఆమె కిటికీ వెనీషియన్ బ్లైండ్స్ వెనక రెండు కళ్లు కనిపించసాగాయి. వాటిని తెరిచి లిచీ తమ ఇంటినే గమనిస్తోందని వారు ఇట్టే గ్రహించారు. అది వాళ్లకి ఇబ్బందిగా ఉంది.
	 ‘తెల్లవారుఝామున నాలుగున్నరకి బాత్‌రూంలో లైట్ వెలిగిందే? నిన్న రాత్రి మీలో ఎవరికైనా ఒంట్లో బాగాలేదా? మీ మధ్య పోట్లాటలే ఉండవనుకుంటా. మీ ఇద్దరి గొంతులూ నేనెప్పుడూ వినలేదు’ లాంటివి లిచీ తమ డోర్ బెల్ నొక్కి అడిగి తెలుసుకుని, తను చేసిన ‘ఏపిల్ పై’ నో, గుమ్మడి సూప్‌నో ఇచ్చి వెళ్తూంటుంది.    
	 
	రాబర్ట్, సిల్వియాలు ఆ సమస్య మీద చర్చించుకున్నారు.
	‘‘ఆమెకి ఇంతదాకా పెళ్లికాలేదు. బహుశ ఓ జంటని గమనించడం ఆమెకి ఆనందాన్నిస్తుందేమో?’’ సిల్వియా చెప్పింది.
	‘‘లేదా అసూయతో చూస్తోందేమో?’’ రాబర్ట్ తన అభిప్రాయాన్ని చెప్పాడు.
	‘‘అసూయే అయితే కష్టమే. అది మనకి మంచిది కాదు.’’ సిల్వియా చెప్పింది.
	‘‘ఆవిడతో మనకి స్నేహమూ లేదు. శత్రుత్వమూ లేదు. స్నేహం కలిగితే ఇంకాస్త ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి లిచీ పలకరించినా ఆమెతో మాట్లాడకు. శత్రుత్వం ఉంటే మనమీద ఆసక్తి పోతుంది’’ రాబర్ట్ సూచించాడు.
	 
	‘‘నాకన్నా మీరే తెలివిగలవారు. కాబట్టి ఎలా శత్రువులం అవుతామో కూడా మీరే ఆలోచించండి.’’
	 రాబర్ట్ నాలుగైదు రోజులు ఆలోచించాక చెప్పాడు.
	 ‘‘రేపు ఏప్రిల్ ఫస్ట్. మనకి లిచీతో శత్రుత్వం తెచ్చుకోడానికి ఓ మంచి అవకాశం వచ్చే రోజు.’’
	 ‘‘ఎలా?’’ సిల్వియా ప్రశ్నించింది.
	 ‘‘మనం ఏదైనా నేరం చేసినట్లుగా లిచీ పోలీసులకి ఫిర్యాదు చేసేలా చేస్తే వాళ్లు మన దగ్గరికి వస్తారు. ఆ నేరం జరగలేదని తెలిశాక మనమీద తప్పుడు ఫిర్యాదు ఇచ్చినందుకు వాళ్లు లిచీని మందలిస్తారు. దాంతో తనని ఫూల్ చేసినందుకు ఆమెకి మనమీద ద్వేషం కలుగుతుంది.’’
	 
	‘‘బావుంది. ఆ తర్వాత మన ఇంటి బయట ‘ఏప్రిల్ ఫూల్’ అనే బోర్డుని ఉంచుదాం. అది చూసినప్పుడల్లా ఆమె మనసు భగ్గుమంటుంది. ఇక మన జోలికి రాదు. కాని ఏం నేరం చేసినట్లుగా మనం నటించాలి?’’ సిల్వియా నవ్వుతూ ప్రశ్నించింది.
	 ‘‘పోలీసులు తక్షణం చర్య తీసుకునే నేరం ఒకటి ఉండనే ఉందిగా’’ రాబర్ట్ నవ్వుతూ చెప్పాడు.
	 ‘‘ఏమిటది?’’ సిల్వియా ఆసక్తిగా అడిగింది.
	
	ఇంటి బయట తన కారు దగ్గరికి వచ్చిన సిల్వియాకి ఎదురింటి కిటికీ బ్లైండ్స్ మూసుకోవడం కనపడింది. లిచీ అక్కడే ఉండి సన్నటి కంతలోంచి తనని గమనిస్తోందని ఆమెకి తెలుసు.
	‘‘సిల్వియా. ఇంట్లోకి రా’’ రాబర్ట్ గుమ్మంలోంచి గట్టిగా పిలిచాడు.
	 బయట కారు దగ్గర ఉన్న సిల్వియా లోపలకి రాకపోవడంతో రాబర్ట్ మళ్లీ అరిచాడు.
	 ‘‘సిల్వియా. నిన్నే! రమ్మన్నాను.’’
	
	‘‘నేను రాను రాబర్ట్. నీతో విసిగిపోయాను. నువ్వో మృగానివి. ఇక నీతో కలసి జీవించలేను’’ సిల్వియా కోపంగా అరిచింది.
	 లిచీ చెవిటిదైతే తప్ప ఆమెకి వారి మాటలు వినపడకుండా ఉండవు.
	 రాబర్ట్ బయటికి పరిగెత్తుకు వచ్చి సిల్వియా చేతిని గట్టిగా పట్టుకుని లోపలికి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. ఆమె విదిలించుకుని అరిచింది.
	 ‘‘వదలండి. నన్నాపద్దు. మీరు సారీ చెప్పరు. నేను వెళ్తున్నాను. మీకు విడాకులు ఇవ్వదలచుకున్నాను.’’
	 ఆ కుటుంబ కలహాన్ని లిచీ కళ్లు పెద్దవి చేసుకుని ఆసక్తిగా గమనించసాగింది.
	 
	‘‘తప్పు నీది. ఐనా సారీ చెప్పనన్నావు. సారీ చెప్పి ఇంట్లోకి రా. నేనెందుకు సారీ చెప్పాలి?’’ రాబర్ట్ కంఠం పెంచాడు.
	 ‘‘మీరు ఇప్పుడు సారీ చెప్పినా నేను రాను.’’
	 వెంటనే రాబర్ట్ ఇంట్లోకి పరిగెత్తుకు వెళ్లి చేతిలో ఓ సుత్తితో బయటికి వచ్చి అడిగాడు.
	 ‘‘ఆఖరిసారి అడుగుతున్నాను. మర్యాదగా ఇంట్లోకి రా.’’
	 ‘‘రాను. ఏం చేస్తారేమిటి?’’ సిల్వియా ఉక్రోషాన్ని నటిస్తూ అడిగింది.
	 
	ఆమె కన్ను కొట్టింది. రాబర్ట్ నవ్వుని ఆపుకుని సుత్తితో ఆమె నెత్తిమీద కొట్టినట్లు నటించాడు. ముందు అనుకున్నట్లుగా సిల్వియా కెవ్వున అరిచి నేలమీద కూర్చుంది. రాబర్ట్ మరో రెండు దెబ్బలు వేయడం లిచీ చూసింది. కాని కారువెనక కూర్చున్న సిల్వియాకి అవి తాకాయో లేదో కనపడలేదు. ఆమె అరుపులు మాత్రం వినపడ్డాయి.
	 రాబర్ట్ కారు డిక్కీ తలుపు తెరిచి అందులో సిల్వియా శరీరాన్ని ఉంచి మూసి కారెక్కి పోనించాడు.
	 
	కొద్ది దూరం వెళ్లాక తమ పథకం ప్రకారం కారుని ఆపి సిల్వియాని ముందు సీట్లో ఎక్కించుకోవాలని కారుని ఆపబోయాడు. దాని వేగం తగ్గగానే వెనక నించి వచ్చే ఓ లారీ అతని కారు వెనక ఫెండర్‌ని ఎడమవైపు రాసుకుంటూ వెళ్లిపోయింది.
	 ‘ఇడియట్’ అని తిట్టుకుంటూ కారు దిగి డిక్కీ తలుపు తెరిచాడు. సిల్వియా గడ్డం నించి కిందికి కారుతున్న రక్తాన్ని చూశాడు. ఆమె మరణించిందని కొద్ది నిమిషాల్లో తెలుసుకున్న రాబర్ట్‌కి ముచ్చెమటలు పోశాయి. జీవం లేకుండా చూేన  సిల్వియా కళ్లని చూడలేక కనురెప్పలని మూసేశాడు.
	
	అతనిలో దుఃఖం, భయం రెండూ సమానంగా తన్నుకు వచ్చాయి. ఆ సరికే లిచీ పోలీసులకి ఫోన్‌చేసి ఉండచ్చు. తను ఇంటికి తిరిగి వెళ్లేసరికి వాళ్లు తనకోసం ఎదురు చూస్తూంటారు.
	 ఎంతో నైపుణ్యంగా తను అల్లిన సాలెగూడులో తనే చిక్కుకున్నాడు! రక్తం డిక్కీలోకి కారకుండా దుప్పటి మీదకి కారడం అదృష్టం అనుకున్నాడు. ఆమె తప్ప మరో సాక్షి లేరు.
	 ఒంగి ‘సిల్వియా! సారీ’ అని ఆమె శవాన్ని ఎత్తి భుజాన వేసుకున్నాడు. టూల్ బాక్స్‌లో తవ్వడానికి అణుగుణంగా ఓ పెద్ద స్క్రూ డ్రైవర్ కనిపించింది.
	   
	ఉదయం పదిన్నరకి డోర్ బెల్ మోగితే రాబర్ట్‌కి మెలకువ వచ్చింది. గత రాత్రి జరిగింది గుర్తుకురాగానే పోలీసులు వచ్చి ఉంటారని అనుకున్నాడు. లేచి వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగా లిచీ! చేతిలోని గిన్నెలో హేంబర్గర్, చికెన్ శాండ్‌విచ్‌లు కనిపించాయి.
	 ‘‘సిల్వియా వెళ్లిపోయిందిగా. ఇక మీ ఆలనా పాలనా నేనే చూసుకుంటాను. ఇదవకండి.’’ చెప్పి దాన్ని ఇచ్చి వెళ్లిపోయింది.
	 అతనికి చాలా రిలీఫ్ కలిగింది. ఆ మధ్యాహ్నం లిచీ మళ్లీ వచ్చింది.
	 
	‘‘రేపట్నించీ మా ఇంట్లోనే మీ తిండి, పడక. ఒకే పడక మనది. దీన్ని ఖాళీ చేసేయండి. ఇవాళ నేనే వండుతాను. దేనికి పోట్లాడుకున్నారు?’’ వంట చేస్తూ లిచీ ప్రశ్నించింది.
	 ‘‘మా మధ్య పోట్లాట లేదు. మిమ్మల్ని దూరంగా ఉంచాలని...’’ నిజాన్ని దీనంగా లిచీకి వివరించాడు.
	 ఆమె దాన్ని మౌనంగా విని దీర్ఘంగా నిట్టూర్చింది. లిచీ వంట అధ్వానంగా ఉంది. అతను తిన్నాక బయటికి వెళ్తూ గుమ్మం దగ్గర ఆగి చెప్పింది.
	 
	‘‘మీరు ఆ నిజం చెప్పకుండా ఉండాల్సింది. కొన్ని నిజాలు సుత్తి దెబ్బల కన్నా బాధిస్తాయి.’’    
	 ‘‘సారీ’’ వెంటనే ఆమెకి క్షమాపణ చెప్పాడు.
	 గంట తర్వాత డోర్ బెల్ మోగింది. ఆమె మనసు మార్చుకుని సారీ చెప్పడానికి వచ్చిందని అనుకుని లేచి వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగా యూనిఫాంలోని పోలీసులు. ఒకడు అతని కారు డిక్కీ తలుపు తెరిచి చూస్తున్నాడు.
	 ‘‘మీమీద ఓ ఫిర్యాదు అందింది’’ రెండో పోలీస్ అధికారి చెప్పాడు. లిచీ ఇంటి కిటికీ బ్లైండ్స్ కొద్దిగా పెకైత్తి ఉన్నాయి.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
