అఆ ట్యాబ్లెట్స్‌ ఎన్ని రోజులు వాడొచ్చు

Fundy health counseling 25 nov 2018 - Sakshi

సందేహం

నా వయసు 23. బరువు 55కిలోలు, నాకు సిజేరియన్‌ ద్వారా ఒక బాబు పుట్టాడు. పిల్లలు లేకుండా ఆపరేషన్‌ చేయించు కోలేదు. లూప్‌ వేయించుకున్నాను కానీ కొన్ని రోజులకు దురద రావడంతో దాన్ని తీయించేసుకున్నాను. మావారు కండోమ్స్‌ వాడుతున్నారు. ఒకసారి కండోమ్స్‌ వాడనందు వల్ల అనుకోకుండా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. డాక్టర్‌ను కలిసి నాకు అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అని చెబితే, ఏవో మందులు ఇచ్చారు. అవి వేసుకున్న తర్వాత ఎనిమిది రోజుల వరకు నాకు బ్లీడింగ్‌ అయింది. ఆ ట్యాబ్లెట్స్‌ నేను ఎన్ని సంవత్సరాల వరకు వాడవచ్చు? దీని వల్ల నాకు  ఏమైనా ప్రమాదం ఉందా?                               
– సుకన్య, చౌటుప్పల్‌

మొదటి బాబు తర్వాత అప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నారు కాబట్టి గర్భం రాకుండా ఉండటానికి తాత్కాలిక పద్ధతులను అనుసరించాలి. అసలింక పిల్లలు వద్దనుకుంటే.... కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవడం మంచిది. అంటే మీకైతే ట్యూబెక్టమీ ఆపరేషన్, మీవారికైతే వేసెక్టమీ ఆపరేషన్‌. తాత్కాలిక పద్ధతులు అంటే.. ఇవి వాడినంత కాలమే గర్భం రాదు, ఆపిన తర్వాత గర్భం వస్తుంది. వీటిలో లూప్, ఓరల్‌ కాంట్రాసెప్టివ్‌ పిల్స్, కండోమ్స్, హార్మోన్‌ ఇంజెక్షన్స్‌ వంటివి ఎన్నో ఉంటాయి. ఇవి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, కొందరికి సెట్‌ అవుతాయి. మరికొందరికి సెట్‌ అవ్వవు. ఇవి ఫెయిలై గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మీకు డాక్టర్‌ ఇచ్చినవి అనుకోని పరిస్థితుల్లో గర్భం వచ్చి, గర్భం వద్దనుకుంటే ఎప్పుడో ఒకసారి అదీ గర్భం రెండునెలల లోపు ఉంటే వాడటానికి మాత్రమే. అంతేకానీ గర్భం వచ్చినప్పుడల్లా అబార్షన్‌ అవ్వడానికి కాదు. వీటి వల్ల 100 శాతం అబార్షన్‌ అవుతుందని చెప్పలేం. బ్లీడింగ్‌ అయినప్పటికీ 10–15 శాతం మందిలో ముక్కలు ఉండిపోవడం, వాటివల్ల అధిక రక్తస్రావం, ఇన్‌ఫెక్షన్లు వచ్చి.. అప్పటికీ డాక్టర్‌ను సంప్రదించకపోతే ప్రాణాపాయం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో బ్లీడింగ్‌ అయినా గర్భం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆ గర్భాన్ని అలాగే ఉంచుకుంటే పుట్టబోయే బిడ్డలో అవయవలోపాలు, మానసిక, శారీరక లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇవి ఏదో ఒకసారి పని చేసిందని, ప్రతిసారీ పని చేస్తుందనే నమ్మకం లేదు. ఇవి వాడేముందు ఒకసారి స్కానింగ్‌ చేయించుకొని గర్భాశయంలో గర్భం ఉందా లేదా.. ఉంటే ఎంత సైజు, ఎన్ని వారాలు ఉందో చూసుకొని డాక్టర్‌ పర్యవేక్షణలోనే వాడాలి. వాడిన 10–15 రోజుల తర్వాత కూడా మరోసారి స్కానింగ్‌ చేయించుకొని, మొత్తంగా అబార్షన్‌ అయిందా లేదా, ఇంకా ఏమైనా ముక్కలు ఉన్నాయా అనేది తెలుసుకోవడం తప్పనిసరి. గర్భం 7–8 వారాలు ఉన్నప్పుడే వీటిని వాడటం మంచిది. కొంతమందిలో గర్భం ట్యూబ్‌లో ఉన్నప్పుడు స్కానింగ్‌ చేయించుకోకుండా, అబార్షన్‌కు మందులు వాడితే ట్యూబ్‌ పగిలి, కడుపులో అధిక రక్తస్రావమై ప్రాణానికి ముప్పుగా మారొచ్చు. కాబట్టి మీరు ఈ కిట్‌ను గర్భం వచ్చినప్పుడల్లా వాడాలనుకునే ఆలోచనను మానేయండి. ఇంక పిల్లలు వద్దనుకుంటే మీరు ట్యూబెక్టమీ ఆపరేషన్‌ చేయించుకోవచ్చు లేదా మీవారు సింపుల్‌గా అయిపోయే వేసెక్టమీ ఆపరేషన్‌ చేయించుకోవచ్చు. 

నా వయసు 45. రెండేళ్ల క్రితమే పీరియడ్స్‌ ఆగిపోయాయి. కానీ నెల క్రితం మూడు రోజుల పాటు బ్లీడింగ్‌ కనిపించింది. ఈ నెల కూడా దాదాపు ఆ తేదీలోనే బ్లీడింగ్‌ కనిపించింది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు.   నా గర్భసంచికి ఏదైనా సమస్య వచ్చిందా లేదా ఇంకేమైనా సమస్య ఉందా, దయచేసి చెప్పగలరు.  – సత్యవేణి, గాజువాక
ఆడవారిలో పీరియడ్స్‌ ఆగిపోయిన సంవత్సరం తర్వాత కాలాన్ని మెనోపాజ్‌ దశ అంటారు. ఈ సమయంలో అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ పూర్తిగా తగ్గిపోవడం వల్ల పీరియడ్స్‌ ఆగిపోతాయి. పీరియడ్స్‌ ఆగిపోయిన సంవత్సరం తర్వాత బ్లీడింగ్‌ అవ్వడాన్ని పోస్ట్‌ మెనోపాజల్‌ బ్లీడింగ్‌ అంటారు. గర్భాశయం లోపల పొరలో ఎండోమెట్రియల్‌ పాలిప్‌ ఏర్పడటం వల్ల గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్లు, పుండ్లు, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్, సెర్వికల్‌ క్యాన్సర్, ఈస్ట్రోజన్‌ మాత్రలు వాడటం వల్ల ఎండోమెట్రియల్‌ పొర పెరగడం వల్ల, అండాశయాలలో గడ్డలు వంటి అనేక కారణాల వల్ల పోస్ట్‌ మెనోపాజల్‌ బ్లీడింగ్‌ అవ్వవచ్చు. దీనిని అశ్రద్ధ చెయ్యడం అంత మంచిది కాదు. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, స్పెక్యులమ్‌ పరీక్ష, స్కానింగ్, పాప్‌ స్మియర్‌ వంటి పరీక్షలు చేయించుకోండి. అవసరమైతే ‘డి అండ్‌ సి’ పరీక్ష చేసి ముక్కని ఎండోమెట్రియల్‌ బయాప్సీ, సెర్వికల్‌ బయాప్సీకి పంపించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత పరీక్షలో వచ్చే రిపోర్ట్‌ను బట్టి చికిత్స సరిపోతుందా? లేక గర్భాశయాన్ని తొలగించవలసి వస్తుందా అనే నిర్ణయానికి రావొచ్చు.

మా అత్తగారి వయసు 48. షుగర్, బీపీ లేవు. కానీ కొన్నాళ్లుగా పొత్తి కడుపులో కుడిపక్క నొప్పి వస్తోంది. అది కిడ్నీ వరకూ వచ్చింది. కిందికి వంగినప్పుడల్లా నొప్పి వస్తోందని అనడంతో యూరాలజిస్టుకు చూపించాం. స్కాన్‌ చేసి ఏ సమస్యా లేదన్నారు. ఏవో మందులిస్తే వాడినా తగ్గలేదు. ఆకలి లేదు. రాత్రిళ్లు ఐదారుసార్లు యూరిన్‌కి వెళ్లాల్సి వస్తోంది. అండాశయ క్యాన్సర్‌ ఉన్నవాళ్లకి ఈ లక్షణాలుంటాయని తెలిసింది. అది నిజమేనా? – స్వర్ణలత, తాడేపల్లిగూడెం
అండాశయ క్యాన్సర్‌ ఉంటే పొట్టలో ఇబ్బంది, ఏదో తెలియని నొప్పి, పొట్ట ఉబ్బడం, అలసిపోవడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, బద్ధకం, మందులు వాడినా తగ్గకపోవడం వంటి లక్షణాలుంటాయి. అయితే ఏ గ్యాస్‌వల్లో, ఎసిడిటీ వల్లో అలా ఉంటోందని అనుకుని చాలామంది ఏవో మందులు వాడేసి సమయం వృథా చేస్తుంటారు. అండాశయ క్యాన్సర్‌ని ఆరంభ దశలో కనుక్కోవడం చాలా కష్టం. మెల్లగా పెరిగేకొద్దీ స్కానింగ్‌లో చిన్న గడ్డలాగా లేదా కాంప్లెక్స్‌ సిస్ట్‌లాగా కనిపిస్తుంది. అలా అన్నీ క్యాన్సర్‌ గడ్డలే కానక్కర్లేదు. నిర్ధారణ కోసం ఇ్చ125, ఇఉఅ, అఊ్క వంటి ట్యూమర్‌ మార్కర్స్‌ రక్తపరీక్షలు చేయించు కోవాల్సి ఉంటుంది. అవసరమైతే సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌ కూడా చేయించుకుంటే వ్యాధి ఎంతవరకూ పాకిందో తెలుస్తుంది. వ్యాధి ముదిరిన తర్వాత స్కాన్‌ చేస్తే అండాశయంలో పెద్ద పెద్ద ట్యూమర్లు, పొట్టలో నీరు చేరడం వంటివి కనిపిస్తాయి. మొదటి స్టేజిలోనే ఉంటే అబ్డామినల్‌ స్కానింగ్‌లో అంతగా ఏమీ కనిపించదు. ట్రాన్స్‌ వెజైనల్‌ పెల్విక్‌ స్కాన్‌ చేయించుకుంటే అండాశయాల్లో ఏవైనా చిన్న చిన్న గడ్డలు లేదా ఏవైనా అనుమానాస్పద మార్పులు ఉంటే తెలుస్తుంది. కొందరికి కనిపించకుండా మిస్సయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ వ్యాధి కనుక నిర్ధారణ అయితే... స్టేజిని బట్టి ఆపరేషన్‌ ద్వారా ట్యూమర్‌ తొలగించి, చుట్టుపక్కల ఏమైనా పాకిందా లేదా అనేది గమనించి, పక్కన ఉన్న టిష్యూస్‌ని కూడా బయాప్సీకి పంపించడం జరుగుతుంది. బయాప్సీ రిపోర్ట్‌ని బట్టి తర్వాత అవసరాన్ని బట్టి కీమోథెరపీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్పిన అన్ని లక్షణాలకీ క్యాన్సరే కారణం అవ్వాలని లేదు. కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్‌ ఉన్నా, పేగుల్లో టీబీ ఉన్నా కూడా ఈ లక్షణాలు ఉండొచ్చు. కాబట్టి మీరోసారి డాక్టర్‌ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, తద్వారా చికిత్స తీసుకోండి.  
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌ హైదరాబాద్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top