రెండు ముఖాలు

funday horror story - Sakshi

కిర్ర్‌..ర్‌..!

‘‘కోరిక తీరకుండా చనిపోతే దెయ్యం అవుతారనే విన్నాను కానీ, కోరిక తీర్చుకోడానికి చనిపోతే దెయ్యం అవుతారో లేదో నాకు తెలీదు మరి’’ అన్నాడు సుధామ. 

చచ్చి దెయ్యం అవ్వాలన్న కోరిక పట్టి పీడిస్తోంది శివశంకర్‌ని కొన్నాళ్లుగా! ‘‘కోరిక తీరకుండా చనిపోతేనే కానీ దెయ్యం అవ్వలేం’’ అన్నాడు సుధామ. శివశంకర్‌ కళ్లు మెరిశాయి. ఎందుకు మెరిశాయో సుధామకు అర్థంకాలేదు. ఇద్దరూ కొండంచున బండరాయిపై కాళ్లు కిందికి వేలాడేసి కూర్చొని ఉన్నారు. గట్టిగా గాలి వీస్తే పడిపోయేలా ఉన్నారు. అంతెత్తునుంచి ఊళ్లోని ఇళ్లు కనిపిస్తున్నాయి కానీ, ఊళ్లోని మనుషులు కనిపించడం లేదు. మనుషులు కనిపించకపోవడంతో శివశంకర్‌ మనసుకు ప్రశాంతంగా ఉంది. సుధామ ఏ ఆలోచనా లేకుండా శివశంకర్‌ పక్కన కూర్చొని ఉన్నాడు. ఇద్దరూ స్నేహితులు. జీతాల్లోకి, జీవితాల్లోకి వెళ్లిపోయిన చాలా ఏళ్లకు మళ్లీ ఊళ్లో కలుసుకున్నారు. ఉండిపోడానికి వచ్చిన రెండురోజులైనా మనుషుల్లో ఉండలేక శివశంకరే సుధామను ఆ కొండ పైకి లాక్కొచ్చాడు. చిన్నప్పుడు సాయంత్రాలప్పుడు ఇద్దరూ కలిసే ఆ కొండపైకి ఎక్కేవారు. సుధామ రాలేనప్పుడు శివశంకర్‌ ఒక్కడే వెళ్లి చీకటి పడేవరకు కొండపైనే కూర్చొని కిందికి దిగొచ్చేవాడు. అతడికెందుకో ఊళ్లో కంటే, ఊళ్లోని కొండపైనే హాయిగా ఊపిరాడేది. ఊళ్లో ఇరుగ్గా ఉన్నట్టనిపించేది. మనిషి పక్కనొచ్చి చేరితే గుండె నొక్కుకుపోయినట్లుగా ఉండేది.

‘‘కోరిక తీరకుండా చనిపోతే నిజంగానే దెయ్యం అవుతారా?!’’.. అడిగాడు శివశంకర్‌. మళ్లీ అతడి కళ్లల్లో మెరుపు. బతకాలని బలంగా కోరుకునేవాళ్ల కళ్లలో ఆశ కనిపిస్తుంది. చావాలని బలంగా కోరుకుంటున్నవాళ్ల కళ్లలో మెరుపు కనిపిస్తుంది. ‘‘ఏమైందిరా ఇప్పుడూ.. ’’ అన్నాడు సుధామ.. శివశంకర్‌ భుజం మీద చెయ్యి వేసి. ఆ చెయ్యి ఇంకొంచెం ఆత్మీయంగా వేసి ఉంటే ఆ తాకిడికి పడిపోయేలా కొండపై మరీ కొసకు శివశంకర్‌ కూర్చొని ఉండడం సుధామ గమనించలేదు. ‘‘ఈ మనుషులు నాకు నచ్చడం లేదు. పైకి ఒక రకంగా, లోపల ఒక రకంగా ఉంటున్నారు’’ అన్నాడు శివశంకర్‌. సుధామ నవ్వాడు. అలా నవ్వుతున్నప్పుడు ఆ కదలిక అతడిని కొండ రాయిపై మరికాస్త కొసకు జరిపింది. ‘‘మనుషులు పైకి ఉన్నట్లే లోపల, లోపల ఉన్నట్లే పైకి ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు శివా?’’ అన్నాడు సుధామ ఆపేక్షగా.‘‘మనుషులు రెండు రకాలుగా ఉంటే నేను సహించలేను సుధా! కాల్తో తన్నేసి వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ ఈ రెండు కాళ్లతో ఎంత మందినని తన్నను?! వెయ్యి, లక్ష, కోటి కాళ్లు కావాలి. వాటికి కొండంత బలం కావాలి. ఆ బలానికి ఈ రెండు ముఖాల మనుషులంతా పచ్చడి పచ్చడైపోవాలి’’ అన్నాడు శివశంకర్‌. పెద్దగా నవ్వాడు సుధామ. నవ్వుతూనే ఉన్నాడు. నవ్వును ఆపుకునే ప్రయత్నం చేయలేదతడు. చేసి ఉంటే, పక్కనే ఉన్న శివశంకర్‌ భుజాలు పట్టుకుని ఊపేసేవాడు. ఆ ఊపుకు ఇద్దరూ కొండ పైనుంచి పడిపోయేవారు. 

‘‘చెప్పు.. మన ఊళ్లో ఎవరున్నారు నువ్వు కాల్తో తన్నాల్సిన లిస్టులో’’ అన్నాడు సుధామ.. నవ్వును తగ్గించి. ‘‘ఒకళ్లని చెప్పలేను. ఒక చోటని చెప్పలేను. నేనెక్కడికెళితే అక్కడ ఈ రెండు ముఖాలవాళ్లు తగులుతూనే ఉన్నారు’’ అన్నాడు శివశంకర్‌. అలా అన్నాడే గానీ, సుధామ చెప్పమన్న లిస్టులో మొదట అతడికి ఇద్దరు గుర్తొచ్చారు. ఒకరు తనెంతో ఇష్టపడిన తన చిన్నప్పటి హెడ్‌మాస్టర్‌. ఇంకొకరు.. తనిప్పుడు పనిచేస్తున్న ఊళ్లో అనుకోకుండా ఇటీవలే పరిచయం అయిన తన అభిమాన కథా రచయిత.శివశంకర్‌కి హెడ్‌మాస్టర్‌ని చిన్నప్పుడే కాలితో తన్నాలనిపించడానికి కారణం.. ప్రవల్లికను ఆ హెడ్‌మాస్టర్‌ తాకకూడని చోట తాకడం! నైన్త్‌లో ప్రవల్లిక శివశంకర్‌ క్లాస్‌మేట్‌. ప్రవల్లికది ఫస్ట్‌ బెంచ్‌. శివశంకర్‌ వెనుక ఎక్కడో కూర్చునేవాడు. ఆఫీస్‌ రూమ్‌లోకి పిలిపించుకుని హెడ్‌మాస్టర్‌ ప్రవల్లికను తాకకూడని చోట తాకినందు వల్ల శివశంకర్‌కు కోపం వచ్చేంత స్పెషల్‌ ఫీలింగ్సేమీ శివశంకర్‌కి ప్రవల్లిక మీద లేవు. కానీ హెడ్‌మాస్టర్‌ మీద ఉన్నాయి! గర్ల్‌ స్టూడెంట్స్‌కి, ఉమెన్‌ టీచర్స్‌కి ఆయనిచ్చే రెస్పెక్ట్‌లో శివశంకర్‌కి గొప్ప ఔన్నత్యం కనిపించేది. రామకృష్ణ పరమహంసలానో, రాజారామ్‌మోహన్‌ రాయ్‌లానో కనిపించేవారాయన. అలాంటి మనిషి ప్రవల్లికను అలా తాకడంతో మానవజన్మ మీదే గౌరవం పోయింది శివశంకర్‌కి. 

మనుషుల నుంచి తప్పించుకోడానికి కథల పుస్తకాల్లోకి వెళ్లిపోయాడు శివశంకర్‌. అలా వెళ్లినప్పుడే.. తనలాగే మనుషుల్ని విశ్వసించి, వారి అసలు స్వరూపానికి దిగ్భ్రాంతికి లోనై మానవ నైజాల మీద కథలు రాస్తున్న ఒక రచయిత శివశంకర్‌కి తగిలాడు. ఆ రచనలు అతడికి ఎంతో ఊరటనిచ్చేవి. ఇంత గొప్ప రచయిత పుట్టిన కాలంలో తనూ పుట్టడం తన పూర్వజన్మ సుకృతం అనుకున్నాడు. కొద్దికాలంలోనే ఆ రచయిత శివశంకర్‌ అభిమాన కథా రచయిత అయిపోయాడు. ఎలాగైనా ఆయన్ని ముఖాముఖి కలవాలనుకున్నాడు. కలిశాడు! అలా కలిసి  వస్తున్నప్పుడు ఆయన్ని కాలితో ఒక్క తన్ను తన్ని రావాలనిపించింది శివశంకర్‌కి. అందుక్కారణం ఆ రచయితలో రెండో ముఖం కనిపించడం. కథలు రాసిన మనిషి, తన ఎదురుగా ఉన్న మనిషి ఒకరు కాదని ఆయనతో కూర్చున్న కాసేపటికే తెలిసిపోయింది శివశంకర్‌కి. కుమిలిపోయాడు. ఇక ఈ లోకంలో తను నమ్మవలసిన మనిషెవరూ లేరని నిర్ణయించుకున్నాడు. మనుషులంటే చికాకు పడుతూ మనిషిగా బతకడం ఎందుకు అనుకున్నాడు. చచ్చి దెయ్యమై ఈ రెండు ముఖాల వాళ్లందర్నీ కాళ్లతో తన్నుతూ తన మానవజన్మకు పరిహారం చెల్లించుకుందామనుకున్నాడు.

‘‘కోరిక తీరకుండా చనిపోతే దెయ్యం అవుతారనే విన్నాను కానీ, కోరిక తీర్చుకోడానికి చనిపోతే దెయ్యం అవుతారో లేదో నాకు తెలీదు మరి’’ అన్నాడు సుధామ. శివశంకర్‌ నివ్వెరపోయాడు. అతడి ముఖంలో మెరుపు మాయమైంది. ‘‘పైగా మనుషులంతా లోపల, బయట ఒకే ముఖంతో ఉండాలన్న నీ కోరిక తీరనిదే అయినా, అది తీరనందుకు కాకుండా, కోపం తీర్చుకునేందుకు నువ్వు దెయ్యం అవ్వాలని కోరుకుంటున్నావు కనుక నువ్వు చచ్చిపోయాక కచ్చితంగా దెయ్యం అవుతావో లేదో చెప్పలేను’’ అన్నాడు సుధామ. ‘‘అయితే ఏం చెయ్యాలంటావు?’’ అడిగాడు శివశంకర్‌. ‘‘మనుషుల్తో అలా వేగడమే’’ అన్నాడు సుధామ. ‘‘సాధ్యమేనా?’’ అన్నాడు శివశంకర్‌. ‘‘ఎందుకు సాధ్యం కాదు? నేను వేగట్లా. మనిషి జన్మ కన్నా దెయ్యం జన్మ ప్రశాంతమైనదని నేనూ నీలాగే అనుకున్నాను. ఇక్కడా రెండు ముఖాలు ఉన్నాయి’’ అన్నాడు సుధామ.  తలతిప్పి చూడ్డానికి భయపడ్డాడు శివశంకర్‌. ఒక్కసారిగా కిందికి దూకేసేంత ఎత్తులో లేడతడు. కొద్దికొద్దిగా కొండ దిగి వెళ్లవలసిందే. 
- మాధవ్‌ శింగరాజు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top