ఓహో జామ! అయ్యో రామ!

Funday child story of the week - Sakshi

పిల్లల కథ

రామతీర్థం గ్రామంలో సింగరాజుగారి దివాణం వెనుక తోటలో అనేక రకాల చెట్లు ఉన్నాయి. ఆ తోట అంతటికీ ముఖ్య ఆకర్షణ మధ్యలోనున్న జామచెట్టు. దాని చిన్న పిందె దగ్గర నుంచి పండు దాకా మహా తీపి! అది ప్రతిసారీ విరగకాసేది. దాంతో పాటుగా ఒడ్డున ఉన్న పనస, దానిమ్మ, సీతాఫలం, బత్తాయి వంటి పండ్ల జాతులు సైతం ఏపుగా ఎదిగాయి. అయితే తోటలోని మిగతా చెట్లపై చిన్నచూపు ఉండేది జామచెట్టుకి. తనకున్న ప్రాధాన్యత మిగతా వాటికి లేదనే భావం బాగా పాతుకుపోయింది.ఒకసారి జామచెట్టు ఒడ్డునున్న చెట్లను చూసి ఫక్కున నవ్వి, ‘‘చూశారా! నా విలువ! ఇన్ని చెట్లు తోటలో ఉన్నా జనాల కన్ను నావైపే! తియ్యని నా కాయలు, పండ్లు తిని మెచ్చుకోనివారు లేరు. అంతేకాదు, రామచిలుకలకు ఆవాసంగా ఉన్నాను. అవి నాపైన వాలి పళ్లు తింటుంటే ఎంత అందంగా ఉంటుందో చూసేవాళ్లకు! మిగతా పక్షులన్నిటికీ కూడా ఆహారంగా పనికి వస్తాను. మీరూ ఉన్నారు పనికిరాకుండా’’ అని గేలి చేసింది.అది విన్న పనస చెట్టుకు కోపమొచ్చింది. ‘‘అదేంటి! ఎవరి గొప్ప వారికి ఉంటుంది. నువ్వు గప్పాలు కొట్టుకోవడం తగదు’’ అంది.
‘‘ఆ! చెప్పొచ్చావులే. నీలో ఏం గొప్ప ఉంది గనుక? ఏనుగులా పెరుగుతావు గాని, నీ కాయలు బండల్లా అంతలేసి. అయినా సరే వాటిని తినలాంటే మనుషులు నానా అవస్థలు పడాల్సిందే! నీ చర్మం ఒలిచి అందులో తొనలు బయటకు తీయడానికి తట్టెడు నూనె పూసుకోవాలి. ఎంతో శ్రమ పడితే తప్ప నీ తొనలను తినే యోగం లేదు. అదైనా పిందె నుంచి పండుదాకా అవడానికి యుగాలు పడుతుంది’’ అని ఎకసెక్కంగా అంది జామచెట్టు.

ఆ మాటలు విన్న సీతాఫలం చెట్టుకి మండిపోయింది. ‘‘ఏం కూస్తున్నావో తెలుసా? నీకేం తెలుసు పనస విలువ? హద్దులు మీరితే బాగుండదు’’ అని హెచ్చరించింది. ‘‘ఓహో! నువ్వా నీతులు చెబుతున్నది? నీకు మాత్రం ఏముంది గనుక? నీ పండ్లు బయటకు గుడ్లగూబల్లా కళ్లున్నట్లు ఉంటాయి గాని పైనున్న తొక్కంతా తీసి పారేస్తే గాని గుజ్జు కనబడదు. తీరా తిందామంటే కడుపులో నల్లని కాటుకలాంటి పిక్కలు అడ్డుతుంటాయి. మరి నీ పండు తినడానికి ఎంత కష్టపడాలి?’’ అని వికటంగా నవ్వింది జామ.ఆ మాటలకు దానిమ్మకు చిర్రెత్తింది. ‘‘ఏం జామా! జోరు మీదున్నావు? నువ్వొక్కత్తెవే గొప్పదానిలా మాట్లాడుతున్నావేంటి? మిగిలిన పండ్ల జాతులు నీ దృష్టిలో పనికిరానివా?’’ అని గద్దించింది.‘‘నువ్వు కూడా సీతాఫలానికి ఏమీ తీసిపోవు! ఎందుకంటే నీ కాయలు చూడటానికి ఒకేలా ఉన్నా, ఏది తీపో, ఏది పులుపో తినేదాక తెలియని అగమ్యం. చేత్తో ఒలిచి తినే సౌలభ్యమూ లేదు. నీ పండు తినాలంటే తిప్పలు పడాల్సిందే! అందువల్ల నన్ను నిలదీసే అర్హత నీక్కూడా లేదు’’ అంది వేలెత్తి చూపుతూ.జామ మాటలకు చెట్లన్నీ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాయి. ఏం జవాబు చెప్పాలో వాటికి అర్థం కాలేదు.‘‘చూశారా! మీకు నన్న ఎదిరించే దమ్ము లేదు. చూడండి నా ప్రత్యేకత ఏ పండ్ల జాతిలోనూ లేదు. ఎందుకో చెప్పనా? వినండి. ఏ పండైనా తొక్క ఒలవందే తినడానికి వీలవదు. మరి నన్ను చూడండి. చెట్లు మీంచి కాయి కోసుకుని హాయిగా నమిలెయ్యొచ్చు. వెంటనే రుచి చూసి లొట్టలేయొచ్చు. పక్షులన్నిటికీ నేను తిండి పెడుతున్నట్లే లెక్క! మిమ్మల్ని అసలు ఏ పక్షి అయినా నేరుగా తినగలదా? బిక్కమొహాలేసుకోవడం కాదు. చెప్పండి!’’ అంటూ హుంకరించింది.జామ చెప్పిన మాటల్లో నిజం ఉన్నప్పటికీ దాని అహాన్ని మాత్రం సహించలేకపోయాయి మిగిలిన చెట్లన్నీ. ఈ వ్యవహారమంతా గమనిస్తున్న తుమ్మచెట్టు తోటి చెట్లకు వత్తాసు పలుకుతూ... ‘‘నీ ప్రవర్తన సబబుగా లేదు. నీ మిడిసిపాటు ఎన్నాళ్లో సాగదు. దేనికైనా కాలమే గుణపాఠం చెబుతుంది. ఎవరి విలువ వారికి ఉంటుంది. నా కాయలు తినడానికి ఏమాత్రం ఉపయోగపడవు. కాని నా ముళ్లు తోట చుట్టూ కాపలాగా పనికొస్తాయి. దేముడు ప్రతిదానికి ఒక విలువ ఇచ్చాడు. అది గుర్తుంచుకో!’’ అంది ఎదురుదాడి చేస్తూ.

‘‘ఓహో! తోటి మిత్రులకు తోడుగా నువ్వు కూడా రంగంలోకి దిగావన్న మాట! అసలు నీ రూపం ఒక్కసారైనా చూసుకున్నావా? ఏమీ బాగులేని వారిని తుమ్మమొద్దులా ఉన్నావంటారు. నీ ముల్లు గుచ్చుకుంటే జనం గగ్గోలు పెట్టి తిట్టుకుంటారు.’’ అని చులకనగా మాట్లాడింది జామ.మరింక దాంతో తలపడలేక మౌనం వహించాయి చెట్లన్నీ. బత్తాయి, సపోటా, నేరేడు చెట్లు ఏదో అనబోతే వారించింది పనసచెట్టు. ‘‘చూశారా! మీరెవ్వరూ నాతో సాల్లేకపోయారు. అసలు నా విలువ మీ అన్నింటికంటే ఎక్కువ కాబట్టి నన్ను తోట మధ్య పాతి మిమ్మల్నందరినీ పనికిరానట్టు ఒడ్డున పడేశాడు యజమాని’’ అంటూ వికటంగా నవ్వింది జామచెట్టు.ఇది జరిగిన రెండు రోజుల తర్వాత యజమాని సింగరాజు కొందరు వడ్రంగులను వెంటబెట్టుకొచ్చి పనసచెట్టును చూపించాడు. వాళ్లు రంపాలతో దాని లావైన కొమ్మలను కోయడం చూసి, ‘‘చూశావా పనసా! నీ పనయ్యింది’’ అని హేళనగా అంది జామ. కాని వాళ్లు అదే చెట్టు కింద కూర్చొని ఆ కలపతో చిన్న చిన్న బొమ్మలు చేయడం మొదలుపెట్టారు. ఆ సన్నివేశం చూసిన జామచెట్టు ఆశ్చర్యపోవడం గమనించిన తుమ్మచెట్టు ‘‘ఎప్పుడూ పరాయివాళ్లను నిందించడమే పనిగా పెట్టుకోకు. పనస విలువ తెలిసిందా?’’ అని సూటిగా అడిగింది. అయినప్పటికీ జామకు ఏమాత్రం అహం తగ్గలేదు. సూటిపోటి మాటలు అంటూనే ఉండేది. ఇలా ఉండగా, ఒకరోజు తోట యజమాని సింగరాజు కొందరు వ్యక్తులతో తోటలోకి వచ్చాడు. వాళ్లు ఏయే చెట్లకు ఏయే తెగులు పడుతుందో చెప్పి, దానికి విరుగుడుకి కూడా సలహాలు చెబుతూ ‘‘ఈ జామచెట్టు చూస్తే బయటకు బాగానే కనిపిస్తున్నా, దీని కాండం భాగంలో తెగులు సోకింది. పైగా ఇది తోట మధ్యలో ఉండటం మూలంగా జనమంతా దాని పళ్ల కోసం మీ తోటలోకి దూకి మరీ చొరబడుతున్నారు. దాని వల్ల మీ తోట మొత్తం ధ్వంసం కావడానికి కారణమవుతోంది. దీనికున్న చీడ మిగిలిన చెట్లకు పాకక ముందే దీన్ని ఇక్కడి నుంచి వెంటనే తొలగించండి.’’ అని చెప్పడం విన్న జామచెట్టు ఒక్కసారిగా బావురుమన్నది. తప్పనిసరి పరిస్థితిలో ఆ జామచెట్టును కూకటివేళ్లతో తీసేయాల్సి వచ్చింది. అది చూసిన మిగతా చెట్లు తన అహంకారమే జామచెట్టును అంతం చేసిందని అనుకున్నాయి.

- కె.కె.రఘునందన 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top