ఉంగరం | Sakshi
Sakshi News home page

ఉంగరం

Published Sat, Apr 16 2016 10:59 PM

ఉంగరం

క్లాసిక్ కథ
అమ్హయ్య! ఈ రోజుతో తన కష్టాలన్నీ ఫలిస్తాయి. దేనికైనా ధైర్యం ఉండాలి. ఎటువంటి అద్భుతమైన ఆలోచన తట్టింది తనకి! ఎలాగ మెరుస్తోంది తన అందమైన వేలికి? - ఇంక దీనితో తాను బతుకుని కొత్తగా తీర్చుకోవాలి. సుఖంగా దర్జాగా జీవితం గడపాలి. ఇంతవరకూ తానెంత నీచంగా బతికిందీ తలుచుకుంటేనే అసహ్యం వేస్తోంది. అంట్లు తోమడం, గదులూడ్చడం, వాళ్ళిచ్చే పాసిపోయిన అన్నంతో పాటు తిట్లనీ శాప నార్థాల్నీ మూటకట్టుకుని నిస్సహాయతతో ఉడుకుమోతుతనంతో యింటికి వెళ్ళడమూ - అక్కడ తల్లి రోగంతో మంచం మీద బల్లిలాగా అంటుకుపోయి, తాను ఆలస్యంగా వచ్చి నందుకు ఇంకా తిట్టడమూ - తన వొళ్ళంతా చాకిరితో నొప్పులూ - ఏడుపొచ్చేది తనకి.

చచ్చిపోవాలనిపించేది. అందరిలాగా తాను హాయిగా కులాసాగా ఎందుకు బతకకూడదు? పంతులమ్మ కూతురిలా సిల్కు వోణీలు తన కెందుకుండవు? రవణమ్మ బుగ్గలూ వొళ్ళూ ఎలా నిగనిగలాడుతుంటాయో - రెండు పూటలా మీగడ పెరుగూ వెన్నపూసా వేసుకుని తింటుంది కదూ! తన యీడుదే వరహాలు మరి. రోజూ తల్లో పువ్వులు పెట్టుకుని కాటుక పెట్టుకుని సినిమాకు వెళ్తుంటుంది మొగుడితో. మరి తనకి పువ్వులూ సినిమాకి డబ్బులూ ఎప్పుడూ వుండవు. మరి మొగుడూ లేడు!
 
తనలో ఎన్ని కోరికలు! ఎన్ని కలలు! చిన్నప్పట్నుండీ తనకెందుకో ఎగిరిపోవాలనీ, పాటలు పాడాలనీ, నాట్యం చెయ్యాలనీ ఎన్నో ఎన్నో - పొలంగట్టుకాడ కూర్చుని సినిమా పాటలు పాడుతుంటే తనకేసి అందరూ చూసి నవ్వేవారు. తనని వెర్రిదనేవారు. ఏమిటో తన వెర్రి! మంచిబట్టలు కట్టుకోవాలనీ, షోగ్గా సింగారించుకోవాలనీ హాయిగా బతకాలనీ ఎవరనుకోరు! వాళ్ళకి డబ్బూ యిల్లూ ఉన్నా ఎంత అసహ్యంగా బతుకుతారు! ఎంత లేకిగా వుంటారు? వడ్డాణమూ కాసులపేరూ పెట్టుకుని తిరుగుతుంది అమ్మగారు.

‘అమ్మా, ఈవాళ తిరణాల, ఓ బేడ డబ్బు లివ్వండి’ అని అడిగితే దండకం చదువుతుంది. ‘నా దగ్గర ఏం ఒలకడంలేదు. ముష్టిముండా పీనుగని ఒక్క అణా డబ్బులు కూడా నాకివ్వరు. తాళి కట్టాడు కాబట్టి యిలా బతుకుతున్నాను కుక్కిన పేనులాగ. ఈయన్నీ ఈయన డబ్బునీ చూచి పీక కోశాడు మానాన్న’ - అబ్బబ్బ వినలేక వచ్చేస్తాను. ఇవ్వకపోతే మానె, ఇంత అఘాయిత్యంగా మాట్లాడుతుందే విటి: అయ్యగారు ఊళ్ళో లేనప్పుడు ధాన్యం చాటుగా అమ్మి డబ్బు దాచేసుకుంటుంది. పోనీ అయ్యగారిని అడిగితే ఆయన ఒకటే తిట్లు.

‘‘ఈ గది సరీగా ఊడవలేదేం! వెధవ పనితనం నువ్వూ, పైగా డబ్బులు కావాలిట! మీ అమ్మ నిరుడు వైద్యానికి మూడు రూపాయలు తీసుకు వెళ్ళింది. తీర్చడం మాట ఉత్తిదే. అయినా తిరణాలకెందుకే నీకు? వెధవ చిరుతిండి తింటా నికా? రెండు పూటలా తింటున్నావు చాలదూ?’’
 ఉక్రోషం వచ్చింది తనకి! తనదగ్గరే డబ్బులుంటే ‘‘ఏడవకయ్యా! ఈ రూపాయి తీసుకుని తిరణాలకెళ్ళి నువ్వే కొనుక్కో’’ అని యిచ్చేసును. ఇవ్వనంటే పోయేది యింతంత మాటలెందుకో!
 
తనకి అందం లేదా! తెలివితేటలు లేవా! సుబ్బయ్యగారి గదిలో ఎవరూ లేనప్పుడు అద్దంలో తన మొహాన్ని చూచుకొనేది. ఎంత అందంగా వుంది తన మొహం - నిగనిగలాడే వొళ్ళూ, మెరిసే కళ్ళూ, బుగ్గమీద సొట్టా - వాళ్ళ అచ్చెమ్మకన్న వెయ్యిరెట్లు నయం. కొంచెం సబ్బు పెట్టి మొహం తోముకుని పువ్వులరైక తొడుక్కుంటే అచ్చెమ్మ డీలా అయి పోదూ! చిన్న కళ్ళూ, లావాటి పెదవులు - దాన్నెవడు మనువు చేసుకుంటాడూ! డబ్బుని చూశా? వెర్రిముండాకొడుకులు. పిల్ల యేపుగా ఊతంగా వుంటే సరదా కాని డబ్బుతో ఏం మనసు తీరుతుందీ? తిని బలిసిన అచ్చెమ్మకి ఎప్పుడూ సొగసులూ సొలపులూ.

లేవలేదు, కూర్చోలేదు. తనకున్న విలువ వాళ్ళకుందా. తన అందాన్ని ఊరకే తక్కువకి కొనెయ్య వచ్చునని అను కుంటారు రౌడీ వెధవలు. రోడ్లమ్మటి పోతుంటే కోరగా జోరుగా చూస్తారు. సుబ్బయ్య గారి కోడలు - అదేవిటి అలా చూస్తాడు? జేబులోంచి వెండి రూపాయితీసి మోగిస్తాడు. చెయ్యి వూపుతాడు! మళ్ళీ భయం. వీధి గుమ్మంలో జోడు చప్పుడవగానే గటుక్కున గదిలోకి దూకి తలుపులు వేసుకుంటాడు, వాళ్ళ బాబు వస్తున్నాడని.
 
తన వాళ్ళందరిలాగా తనకెందుకో తృప్తి వుండదు. రంగురంగుల ఊహలు కలవర పెడు తుంటాయి. తనకెన్నో కథలు వచ్చును. ఊరవతల గుడికాడ సాధుబాబా వుండేవాడు. చిన్నప్పుడు తనకి మాంచి కథలు చెప్పేవాడు. తెల్లని గడ్డం, ముడతలు పడిన కళ్ళూ, వళ్ళూ, చిరిగిన బనీనూ వేసుకుని తన్నెంతో ఆప్యా యంగా చూసేవాడు. తాను గొప్పదానినౌతా నని రాజకుమారినవుతానని చెప్పేవాడు. రాజకుమారులు తెల్లని గుర్రాలమీద ఎక్కించేసుకుని తీసుకెళ్ళిపోయి పెళ్ళి చేసు కుంటారట. వాళ్లకి పెద్ద పెద్ద మేడలు, నౌకర్లు, మాంచి పిండివంటలు, జిగేల్మనే నగలు...
 
సీతాలుని ఓ అబ్బాయి అలాగే లేవ తీసుకుపోయాడు. ఏడాది పోయాక మళ్ళీ వచ్చింది సీతాలు. ఎంచక్కావుంది. సిల్కుచీర కట్టుకుంది. బంగారపు గాజులు వేసుకుంది. ఆ అబ్బాయి పట్నం తీసుకెళ్ళి అక్కడ పెళ్ళి చేసుకున్నాడట. వర్తకం చేస్తాడట. ఎంతో డబ్భు లాభం వస్తుందిట!  ‘‘నన్ను కూడా తీసుకు పోయేందుకు ఎవడినేనా చూసిపెట్టు సీతాలూ’’ అని అడిగింది ఆ రోజున. ఎంతో బతిమాలు కుంది. సీతాలు విరగబడి నవ్వింది. ‘‘నేను చూసి పెట్టనా.

ఓయమ్మ యిదేం సోద్దెమే ’’ అంది. ‘‘నాకేం తక్కువ?’’ అంది తను ఉక్రోషంగా. ‘‘ఇలాంటి బట్టలు వేసుకుంటే ఎలాగ? మాంచి పరికిణీ వోణీ కుట్టించుకో, ఆ మొగుడెవరో వాడే వస్తాడులే’’ అంది సీతాలు.
 తనకి మంచి బట్టలు ఎలా వస్తాయి? పోనీ సుబ్బయ్యగాడు, వెర్రిపిల్ల చాలాకాలం నుంచి చాకిరీ చేస్తోందని కొనిపెట్టకూడదూ? ఆయన కూతురు అచ్చెమ్మ ఓ చీర యివ్వకూడదూ? ఇలా అనుకునేది తను.

కానీ యింత సులువైన ఊహ తట్టనేలేదు ఎప్పుడూ తనకి. సుబ్బయ్య చిన్న కొడుకు బళ్ళో నుంచి వస్తున్నాడు. వాడి వేలిని ఉంగరం మెరిసింది. ఈ కబురూ ఆ కబురూ చెప్పి మిఠాయి కొనిపెట్టి ఉంగరం తీసేసుకుంది. కుర్రనాగన్న యింటి దగ్గర చెప్పగలడా? సుబ్బయ్యగారూ, పెళ్ళామూ ఉంగరం ఎక్కడో పోయిందనుకుంటారు. ఈ ఉంగరం అమ్మితే ఇరవై రూపాయలేనా వస్తాయి. ఆ డబ్బుతో అందమైన బట్టలు కొనుక్కుని కట్టుకుని వెళుతూవుంటే మాంచి రాజకుమారుడులాంటి కుర్రాడు తన్ను చూసి ‘‘ఏయ్ అమ్మాయ్’’ అని నవ్వుతాడు అదోలా. పెళ్ళికొడుకులు నవ్వినట్టు నవ్వుతాడు. అప్పుడు...
 
అయినా తను అందర్నీ నమ్మకూడదు. మంచివాణ్ణి, డబ్బున్న వాడినీ ఏరుకోవాలి. దొరలాగ వుండాలి వాడు. ‘నిన్ను పెళ్ళి చేసి కొంటాను. నువ్వులేందే బతకలేను లచ్చీ’ అనాలి. అప్పుడెంచక్కా వాడిని పెళ్ళి చేసు కుంటుంది. సీతాలులాగా పట్నం వెళ్ళిపో తుంది. ఎప్పుడేనా సుబ్బయ్యగారు యిటువస్తే తనను చూసి ‘అబ్బో’ అని ముక్కు మీద వేలేసు కుంటారు! పెళ్ళి చేసుకోలేకపోతే నలుగురిలో గౌరవం ఉండదు. అందరూ తిడతారు. ఛీ అంటారు. పెళ్ళయితే కాని - మగవాడికి అలుసివ్వకూడదు. దొంగవెధవలు సరదా తీరాక పురుగును దులిపినట్టు దులిపి పారేస్తారు. సింగడు మరి యిదివరకూ ఏం చేశాడు?

ఎన్ని కబుర్లు చెప్పాడు? రంగం వెళ్ళిపోదామన్నాడు. తీరా ఓ రోజున మరెవత్తెనో పెళ్ళి చేసుకున్నాడు. తనింకా అప్పుడు చిన్నపిల్ల. ఎంతో ఏడ్చింది. ‘‘ఏంటి యిలా అన్యాయం చేశావ్’’ అంటే ‘నిన్నెవడు పెళ్ళాడుతాడు’ అన్నాడు.
 నల్లని ఉంగరాల జుట్టు ఉండాలి. తెల్లగా పొడుగ్గా ఉండాలి. మంచి యిల్లు తోటా వుండాలి. అలాంటి అబ్బాయి వచ్చి పెళ్ళి చేసుకోవాలి. తలలో పువ్వులు పెట్టుకొని పెరట్లో పాటలు పాడుతూంటుంది తను. వెనకాలే వచ్చి కళ్ళు మూస్తాడు. చేతులు తీయ కుండానే బుగ్గమీద ముద్దు పెట్టుకుంటాడు.

తను మళ్ళీ ఆయన మొహాన్ని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంటుంది. తను రోజూ నీళ్ళు పోసుకుంటుంది. ఘుమఘుమలాడే సబ్బుతో వొళ్ళంతా రుద్దుకుంటుంది. బలే వాసన. ఓసారి సుబ్బయ్యగారి అల్లుడు వదిలేసిన సబ్బు ముక్క తెచ్చుకుని నీళ్ళు పోసుకుంది. తన వొళ్ళు కొత్తగా మెత్తగా పట్టుచీరలా మెరిసిపోయింది.
 ఒకానొక వేసవిలో ఊరికి దూరంగా ఉన్న ఒక మామిడితోపులో కూర్చుని పగటి కలలు కంటోంది. పదిహేడేళ్ళ దాసీపిల్ల లక్ష్మి చిరిగిన మానిన బట్టలూ సంస్కారంలేని చిక్కబడిన జుట్టూ, ఆమె కళ్ళల్లో ఊహల నిచ్చెనలమీద ఎగబ్రాకే కోర్కెల్ని ఆపలేకపోతున్నాయి.

చల్లని పైరుగాలి, ప్రశాంతమైన మామిడితోటా, యౌవనం కొత్తగా వింతగా అలుముకుంటూన్న ఆమె వయస్సూ ఆమె కలల్ని మరింత రెచ్చ గొడుతున్నాయి. తాను దిక్కులేని దాసీపిల్లననీ, తన భవిష్యత్తు ఎప్పుడూ యింతేననీ వాస్తవికంగా ఆమె ఆలోచించగలిగితే అప్పుడీ స్వప్నాలవల్ల కలిగే క్షణికమైన మధురానుభూతి కూడా జీవితంలో లేకుండా చేసుకోవడమే అవుతుందేమో! బతుకు అడుక్కిపొయినకొలదీ బతకడానికి చేయూత స్వప్నం మాత్రమే కాబోలు. అందరూ అభాగిని అయిన లక్ష్మిలాగ కలలు కంటారు.

కానీ ఆ కలలు నిజాలౌతా యని నమ్మరు. అక్కడ వాళ్ళు తెలివిగా జాగ్రత్త పడతారు. కాని లక్ష్మిలాంటి అమాయకులూ ఆవేశ హృదయాలూ కలల్ని తరుముకుంటూనే పరుగెత్తుతారు. దానిలో గొప్పితగిలేదీ గొయ్యి వచ్చేదీ చూచుకోరు. రోగిష్టి ఆరోగ్యాన్ని గురించీ, ఆకలితో ఉన్నవాడు రుచికరమైన పిండి వంటల్ని గురించీ, దరిద్రుడు ధనం యిచ్చే సౌఖ్యాన్ని గురించీ ఆలోచించకుండా ఏ చట్టమూ శాసించలేదు. నిజమే. అందుకే భయంకర దరిద్ర పీడితులూ, అంగవికలులూ, దుర్భర వ్యాధిగ్రస్తులూ ఆత్మహత్య చేసుకుని కడతేరకుండా బతుకుతూనే వుంటారు, రేపటి సుఖంకోసం.
 
కళ్ళెంలేని భావనా ప్రపంచంలో విహారం చేస్తూన్న లక్ష్మి తనని ఓ గంట నుండి నారాయణ అదేపనిగా పరికిస్తున్నాడని గమ నించలేకపోయింది. కొంతసేపయ్యాక అతను మెల్లగా ఆమె దగ్గరకు నడచి వచ్చాడు. చామన చాయగా వున్నాడు. పైజామా తొడిగి తెల్లని గ్లాస్కో చొక్కా వేసుకున్నాడు. కాళ్ళకి నల్లని స్లిప్పర్సు, జుట్టు వెనక్కు దువ్వాడు, పెదవులు ఎర్రగా ఉన్నాయి తాంబూల సేవనం వలన. సుబ్బయ్యగారి కొడుకు కన్న, సింగడు కన్న ఎంతో బాగున్నాడు. ఎంతో బాగున్నాడు. చదువుకున్నవాడిలా ఉన్నాడు. లక్ష్మికి ఎదురుగా వచ్చి నిలుచున్నాడు. లక్ష్మి తల పెకైత్తి చూసింది. ఫక్కున నవ్వింది. ఆమెకి కథలో రాజ కుమారుడు నిజంగా వచ్చేసినట్టనిపించింది.

 ‘‘ఎవరు నువ్వు?’’ అన్నాడు నారాయణ గంభీరంగా. ‘‘ఏం?’’ అంది ఓరగా చూస్తూ లక్ష్మి. ఇంకా ఆమెకు పూర్తిగా మెలకువ రాలేదు. వేలినున్న ఉంగరాన్ని ఆప్యాయంగా చూచుకుంటోంది.
 ‘‘నీ పేరేవిటి?’’ అడిగాడు నారాయణ.
 సన్నగా నవ్వి తియ్యగా చూసింది లక్ష్మి జవాబుగా.
 ‘‘ఈ తోట ఎవరిదో తెలుసునా?’’ ఈసారి కోపంగా అధికారంగా అన్నాడు నారాయణ.
 ఉలిక్కిపడింది లక్ష్మి ‘‘మీదేంటి బాబూ, ఊరికనే కూర్చున్నాను...’’ భయపడుతూ లేచి నుంచుంది లక్ష్మి. వీడు తనని పెళ్ళి చేసుకోడానికి రాలేదా?
 నారాయణ గీరగా చూశాడు. అదోవిధంగా దగ్గాడు. లక్ష్మి కూడా గమ్మత్తుగా చూసింది: నవ్వింది. ‘‘నీ పేరేవిటీ?’’ ప్రశ్నించాడు మృదువుగా నారాయణ.
 ‘‘లచిమి.’’
 ‘‘ఈ వూరేనా?’’
 ‘‘ఉహు పక్క ఊరు’’
 ‘‘ఏం చేస్తుంటావ్?’’
 
సందేహంగా కనురెప్ప పెకైత్తి నారాయణను చూసింది. దాసీ దాన్నని చెప్పాలా చెప్పకూడదా అని తటపటా యిస్తోంది. నారాయణ మీద చెయ్యివేశాడు. జాలిగా అన్నాడు. ‘‘పాపం. దాసీ పిల్లవా?’’
 లక్ష్మి తలూపింది ఔనని. నారాయణ ఈసారి ఆమె బుగ్గలమీద చేత్తోరాశాడు. ‘‘మాంచి దానివి.’’
 ఆశగా చూసింది లక్ష్మి!
 ‘‘అలాగరా - ఆ పక్కకి’’ అని అర్థవంతంగా నవ్వాడు నారాయణ.
 ‘‘ఎందుకూ?’’
 ‘‘ఇక్కడ అందరూ చూస్తారు.’’
 తెల్లబోయి చూస్తోంది లక్ష్మి.
 ‘‘డబ్బులిస్తాను సరేనా, రా.’’

 ఛీ, తననింత లోకువగా చూస్తున్నాడేమిటి? తనని ప్రేమించాననీ పెళ్ళి చేసుకుంటాననీ అనడేం అనుకుంది లక్ష్మి. ‘‘నాను సెడిపోయిన దాన్ని కాదు. నానల్లా రాను’’ అంది లక్ష్మి. ‘‘ఇక్కడి కెందుకొచ్చావు మరి?’’ కోపంగా అడిగాడు నారాయణ. ‘‘పెళ్ళి చేసుకుందుకు-’’ అమాయకంగా అంది లక్ష్మి. ‘‘ఎవర్నీ?’’ అన్నాడు. పెళ్ళిచేసుకునేందుకు మామిడి తోపులోకి రావడమెందుకో రకరకాల అనుభవం గల నారాయణకే అర్థమవలేదు.
 
‘‘నాకు నచ్చినవాణ్ణి, డబ్బున్నవాణ్ణి’’ అంది లక్ష్మి. నారాయణకి లక్ష్మి ఒక్కసారిగా అర్థమై పోయింది, మెల్లగా కబుర్లలోకి దింపాడు. ఆమె ఊహలు పయనించే తోవలేమిటో తెలుసు కున్నాడు. తర్వాత జాలిగా ప్రేమగా అన్నాడు ‘‘నన్ను పెళ్ళి చేసుకుంటావా లక్ష్మీ’’
 ‘‘మిమ్మల్నా?’’
 ‘‘అవును.’’
 ‘‘ఒట్టు?’’
 ‘‘ఒట్టు’’
 ‘‘మరి సింగడిలాగ..’’
 ‘‘సింగడెవడూ?’’

 ‘‘దొంగనా...’’... రెండు మాటలలో సింగడెవడో చెప్పింది లక్ష్మి. ‘‘ఛఛ.. నేనలాంటివాణ్ణికాను. నీలాంటి పిల్లకోసమే చూస్తున్నాను. నిన్ను ప్రేమించాను. పెళ్ళి చేసుకుంటాను. పువ్వుల్లో పెట్టి పూజిస్తాను’’ అన్నాడు నారాయణ.
 ‘‘నిజం?’’ పెద్దకళ్ళలో వెలుగు నిండగా అడిగింది లక్ష్మి.
  ‘‘ఇంకా నీకు చదువు చెప్పిస్తాను.’’
 ‘‘ఓహ్!’’
 ‘‘డ్యాన్సు నేర్పిస్తాను.’’
 ‘‘అబ్బో.’’
 
‘‘మరి ఎప్పుడు పెళ్ళి చేసుకుందాం?’’ అన్నాడు నారాయణ.
 ‘‘పట్నంలో కాదా పెళ్ళి?’’ - సీతాలుని జ్ఞాపకం చేసుకుంటూ అడిగింది లక్ష్మి. నారాయణ ఓ సెకను ఆలోచించి ‘‘అవును పట్నంలోనే - నేనక్కడేగా ఉండేది’’ అన్నాడు.
 ‘‘మీరు పట్నంలో ఏం చేస్తుంటారు?’’
  నారాయణ చిక్కులో పడ్డాడు. ఈ పల్లెటూరిపిల్ల, అమాయకురాలూ, రొమాంటిక్ ఊహలు ఉన్న లక్ష్మికి ఏం చెపితే పని జరుగు తుందో గటుక్కున ఊహించడం నారాయణ వంటి చురుకైనవాడికేనా కష్టమే. హోటలులో సర్వర్‌గా, కారు క్లీనరుగా, పిక్‌పాకెటర్‌గా, రైలులో మందులమ్మేవాడిగా బహుపాత్రాభి నయం చేసిన నటనావతంసుడు ఆలోచించి అన్నాడు ‘‘మోటారు డ్రైవర్ని.’’
 
‘‘అంటే’’
 ‘‘పెద్ద పెద్ద మోటారులూ, లారీలూ నడుపుతాను. నేనెలాగ నడుపితే అలాగ వెడతాయి.’’
 చక్రం దగ్గర కూర్చుని మోటార్లు నడిపేవాళ్ళని చూడకపోలేదు లక్ష్మి. కాని నారాయణ చెప్పడంలో, ఈ డ్రైవరు పని అసాధారణమైనదిగా తోచింది ఆమెకి.
 ‘‘బాగా డబ్బొస్తుందా?’’
 ‘‘ఓ, కావల్సినంత. మనం హాయిగా బతకొచ్చును.’’
 లక్ష్మి హాయిగా బతకటాన్ని ఆలోచిస్తోంది.
 ‘‘నిన్నెప్పుడూ కారుమీద తిప్పుతాను. పట్నంలో కార్ల మీద పెద్ద పెద్ద వీధుల్లో ఝామ్మని పోతూంటే’’ అన్నాడు నారాయణ.

కిలకిల నవ్వింది లక్ష్మి. నారాయణ సమర్థతలో నమ్మకం చిక్కింది. సంజ యెరుపులు కళ్ళల్లో కలలకి మరింత విభ్రమాన్ని చేకూర్చాయి.
 ‘‘మరి ఎప్పుడు పట్నం వెళ్ళటం?’’ అంది.
 ‘‘ఆ ఉంగరం ఎక్కడిది నీకు?’’ అన్నాడు నారాయణ లక్ష్మిపై గల శ్రద్ధను విశదపరుస్తూ.
 ‘‘నాదే.. ఏం?’’ బెదురుగా అంది లక్ష్మి.
 ‘‘అబద్ధం. నా దగ్గర దబాయించకు.’’
 ‘‘నాదే నాదే.. మరి..’’
 ‘‘నిజం చెప్పు. లేకపోతే పోలీసులొచ్చి జైల్లో పడేస్తారు నిన్ను.

నీ కోసమే చెపుతున్నాను. నమ్మవా నన్ను?’’
 లక్ష్మి సంగతంతా చెప్పింది.
 ‘‘ఈ ఉంగరం నీ దగ్గరుంటే అపాయం వెర్రిదానా. రేపీపాటికి ఖైదులో వుంటావు. ఈ ఉంగరం నా చేతికిచ్చెయి. రాత్రికి రాత్రి కరిగించేసి రూపాయలు తీసుకొస్తాను’’ అన్నాడు నారాయణ ఆత్రంగా. ‘‘నేను మంచి వోణీ పరికిణీ కొనుక్కుందామనుకున్నాను’’ దీనంగా అంది లక్ష్మి.
 ‘‘పిచ్చిదానా, నేను కొని తీసుకొస్తాను. ఈ చిరిగిన బట్టలతో పట్నం వెళ్ళితే నవ్వుతారు.’’
 
లక్ష్మి సందేహంగా బెదురుగా బాధగా ఉంగరాన్ని వేలినుంచి మెల్లగా తీసి ఇచ్చింది. ‘‘మరి పెళ్ళి చేసుకుంటావా!’’ అంది.
 ‘‘ఒట్టు వెయ్యలేదూ?’’
 ఒట్టుయొక్క మహత్యాన్ని కిమ్మనకుండా అంగీకరిస్తుంది లక్ష్మి. ‘‘మళ్ళీ ఎప్పుడొస్తారు!’’
  ‘‘ఈ రాత్రికి ఎక్కడో ఒకచోట పడుకో. తెల్లారగానే గుడి దగ్గరకు వచ్చి ఉండు. అక్కడికి నేను వస్తాను. రాత్రి కరిగించేసి అమ్మేసి డబ్బులు తీసుకొస్తాను. ఇద్దరం కలసి రెలైక్కి బొంబాయి వెళ్ళిపోదాం ఏం?’’
 
‘‘అదేం వూరు? ఛ, నేను రాను.’’
 ‘‘బొంబాయి చాలా పే..ద్ద పట్నం లక్ష్మీ.’’
 ‘‘సీతాలు మరి చెన్నపట్నం వెళ్ళిందేం?’’
 ‘‘వెధవ చెన్నాపట్నం. బొంబాయి ఇంకా గో.. ప్పవూరు. అక్కడ డబ్బు బోలెడు దొరుకుతుంది.’’
 లక్ష్మి ఆలోచించింది. ‘‘గుడి కాడనే వుంటాను వస్తారా?’’
 ‘‘తప్పకుండా. వెళ్ళొస్తాను - ఏం?’’
 లక్ష్మి తలూపింది బెదురుగా. బుగ్గమీద చిటికవేసి గబగబా పొలాలలోంచి నడచి వెళ్ళిపోయాడు నారాయణ. చీకటి పడుతూంటే భయం కలసిన ఆనందంతో కలల మత్తుతో గుడివైపు నడచింది లక్ష్మి.
   
ఆరు, ఏడు, ఎనిమిది. తొమ్మిది కూడా అయింది. లక్ష్మికి ఆకలి ఎక్కువౌతోంది. ఎండ చుర్రుమనగానే గుడి దగ్గర రావిచెట్టు నీడకి వెళ్ళికూర్చుంది. గుడిగోపురం అంత ఎత్తుగా ఎవరు కట్టారా అని చాలాసేపు ఆలోచించింది. గోపురం మీద ఏదో పక్షి వాలింది. లక్ష్మికి సరదా వేసింది. తనకి అంత పైన నుంచి భూమి అన్ని వైపులా చూడాలనిపించింది. కొంతసేపు ముసలి రోగిష్టి తల్లి జ్ఞాపకం వచ్చింది. బొడ్డులో తాళాలు దోపుకున్న సుబ్బయ్యగారు కేకలు వేస్తోన్నట్టు అనిపించింది. మధ్య మధ్య అకారణంగా ఉలిక్కిపడింది. గాలిలోంచి యేదో కమ్మని వాసన వస్తోంటే, లాలాజలాన్ని గుక్కిళ్ళు మింగింది.

పూజారి గవరయ్య ఎవరు నువ్వని అడిగాడు. ‘బొమ్మాయి’ వెళ్తున్నానని చెప్పింది. నారాయణ ఎటువైపునుండీ రావడం లేదు. తనని దగా చేశాడా? గుండె కొట్టుకుంది భయంతో, ఆశాభంగంతో కాదు. తప్పకుండా వస్తాడు. తనని పెళ్ళిచేసుకుంటాడు. ఆ కళ్ళలో ఎంత ఇష్టంగా చూశాడు!
   కాలవ రేవు నుంచి తడిసిన బట్టలతో బిందెలు బుజాన పెట్టుకుని ఆడవాళ్ళు వెళు తున్నారు. గుళ్ళోంచి మంత్రాలు వినపడు తున్నాయి. దేవుణ్ణి తలచుకుని నమస్కరించింది. కళ్ళెత్తి చూసింది. ఎదురుగా సుబ్బయ్యగారు పోలీసులతో. లక్ష్మి కంగారుపడిపోయింది. పారిపోదామనుకుంది. ‘‘ఆగక్కడ’’ గద్దించాడు పోలీసు.

లక్ష్మి జబ్బ పట్టుకున్నాడు.
 ‘‘ఇక్కడ తగులడ్డావా, ఇదేం బుద్ధే నీకు?’’ అన్నాడు సుబ్బయ్య. లక్ష్మి వణుకుతూంది.
 ‘‘ఏదీ ఉంగరం?’’ వగరుస్తూన్న సుబ్బయ్య గారు గట్టిగా గొంతుచించుకుని అడిగాడు.
 ‘‘ఉంగరవేంటీ?’’- తనని తాను కాపాడుకుంటానికి ఒకటే మార్గం అయిన అబద్ధాన్ని ఆశ్రయించింది లక్ష్మి. ‘‘రెండు తన్నండి’’ సుబ్బయ్య సలహా ఇచ్చాడు.
 పోలీసు లాఠీతో వీపు మీద పొడిచాడు. ‘‘అమ్మో’’ అంది లక్ష్మి.
 ‘‘చెప్పు ఉంగరం ఏంచేశావు?’’
 ‘‘నాకు తెల్దు’’ మొరాయించింది లక్ష్మి.
 
పోలీసు మొకాళ్ళ మీద లాఠీతో కొట్టాడు. అరిచింది లక్ష్మి. కళ్లమ్మట నీళ్లు ప్రవాహం కట్టాయి. జనం మూగారు. కొందరు వెకిలిగా నవ్వారు. కొందరసహ్యించు కున్నారు.
 ‘‘స్టేషనుకి నడు’’ అన్నాడు పోలీసు. మునివేళ్ళ మీద నిలబడి చుట్టూ మూగిన జనంలోకి, జనం అవతల వున్న రోడ్డు వైపూ పరకాయించి ఆశగా చూసింది నారాయణ వస్తున్నాడేమో అని. కానీ జాడ లేదు. తల్లి జ్ఞాపకం వచ్చింది. ఒక్కసారిగా పెద్దపెట్టున ఏడ్చింది రోడ్డు మీద చతికిలబడి. పోలీసు ఒక పక్కా, సుబ్బయ్య ఒక పక్కా నడుస్తోంటే దారి పొడుగునా నారాయణ వస్తాడనీ, తనని విడిపిస్తాడనీ ఆశతో కన్నీళ్ళతో చూస్తూనే ఉంది.
 
రెండు నెలలు జైలులో ఉండేటప్పటికి నారాయణ ఇంక రాడని లక్ష్మికి దృఢమైంది. ఇసుకలాంటి అన్నమూ, చీకటి కొట్టులాంటి జైలుగదీ, మనోవ్యథా... లక్ష్మిని నీరసంగా అసహ్యంగా చేసివేశాయి. ‘ఉంగరమూ పోయింది. పెళ్లీ పోయింది’ అని గొణుగుకునేది ఒక్కతే, కటకటాల్ని పట్టుకుని. మగవాడినెవడినీ నమ్మకూడదనుకుంది. అయినా సుబ్బయ్యగారి కొడుకు ఉంగరం తాను తీస్తే పోలిసులకెందుకూ బాధ అనిపించింది లక్ష్మికి.

లక్ష్మి హేతువుకి ఈ చట్టాలు మనుష్యులూ అర్థం లేకుండా కనిపించాయి. రోజూ తెలియకుండా ఏడ్చేది. జ్వరం వచ్చేది. కదలకపోయినా కాళ్ళు లాగేవి. ముసలితల్లి చచ్చిపోయిందేమో అన్న దిగులు, రాత్రుళ్ళు నిద్రలో తనూ నారాయణా ‘బొమ్మాయి’ వెళుతూన్నట్టూ, దారిలో రైలు లోంచి తనని నారాయణ కిందికి తోసేసినట్లు, తన తల చితికి రక్తం ప్రవహించినట్టూ కలవచ్చి ‘బాబోయ్’ అని అరుస్తూ లేచి కూర్చునేది.
 
ఒకరోజు ‘లక్ష్మీ’ అన్న పిలుపు వినబడింది. ఎక్కడా అని తెల్లబోయి గది నలువైపులా చూసింది. ఎవరూ కనబడలేదు. మళ్ళీ ‘లక్ష్మీ ఇక్కడ... నేను’ అన్న మాటలు వినిపించాయి. ధ్వని వచ్చిన వైపే చూసింది. తన గదినాను కున్న గది గోడ పగులులోంచి నారాయణ చూసి నవ్వుతున్నాడు. ‘‘నేనూ-నారాయణని లక్ష్మీ’’
 ‘‘నువ్వెలాగొచ్చావు?’’ ఆశ్చర్యంతో అడిగింది లక్ష్మి.
 ‘‘నిన్న రాత్రి తీసుకువచ్చారు’’
 ‘‘ఏం?’’
 
‘‘సైకిల్ షాపులో పనికి కుదిరాను. డబ్బు అవసరం వచ్చి సైకిల్ చక్రం అమ్మేశాను. పోలీ సులు వచ్చి ఇక్కడ ఉండమని బతిమాలు కొన్నారు’’ నవ్వుతూ చెప్పాడు నారాయణ.
 ‘‘బలేగా అయింది సచ్చినోడా-బాగా అయింది’’ కసితో మెటికలు విరిచింది లక్ష్మి.
 ‘‘నాకిదేమీ కొత్త కాదు పిల్లా. ఇది అయిదోసారి మనం రావడం’’ అన్నాడు నారాయణ తన ఆధిక్యతను నిరూపిస్తూ.
 ‘‘మంచిదానివి లక్ష్మీ, నీ ఉంగరం అమ్మితే ఇరవైరూపాయలొచ్చినై. వారం రోజులు దర్జాగా వెలిగింది మన బతుకు. సినిమాలూ, కాఫీ హోటళ్ళూ హాయ్ హాయ్’’
 ‘‘దొంగనాయాల’’ తిట్టింది లక్ష్మి.
 ‘‘నీ తిట్లు నాకు తగలవు’’ అన్నాడు.
 ‘‘అన్నాయం చేశావు దొంగసచ్చినోడా. నా ఉసురు నీకు తగుల్తుంది’’ అంది ఉక్రోషంతో.
 
‘‘ప్రపంచవే అన్యాయం లక్ష్మీ. ఎవడికి అవసరమైతే వాడే అన్యాయం చేస్తాడు. నువ్వు దొంగతనం చెయ్యలేదూ? నీ దగ్గర్నుంచి నేను కొట్టేశాను’’
 ‘‘ఫో...నీ జిమ్మడా’’
 ‘‘ఎక్కడికి పోను. ఇక్కడే నీకు సావాసనంగా వుంటాను’’
 లక్ష్మి బాధతో మొహం మరోవైపు తిప్పి కూర్చుంది. నారాయణ నవ్వుతూ అన్నాడు..
 ‘‘జైలు నుంచి విడిచాక వచ్చి నిన్ను తప్పకుండా పెళ్లిచేసుకుంటానులే’’ అంటూ ఫక్కున నవ్వాడు నారాయణ. లక్ష్మి ఉక్రోషంతో మాట్లాడలేదు. ‘‘అప్పుడు బొంబాయి వెళ్లిపోదాం. ఏది లక్ష్మీ ఇటు చూడు. ఒక ముద్దియ్యి’’ అంటూ ‘ప్చ్’ అని పెదవులతో చప్పుడు చేశాడు నారాయణ.
 లక్ష్మి దగ్గరున్న నీళ్ల లోటా తీసి పగులు వైపు విసిరింది. పెద్ద చప్పుడయింది. పోలీసు ‘ఏమిటది’ అని కేక వేశాడు. లక్ష్మి మోకాళ్ళ మీద తల ఆన్చి ఏడుస్తోంది. నారాయణ వెకిలినవ్వు జైలుగదిలో కోలాహలంగా ప్రతిధ్వనించింది.
 -  తిలక్

Advertisement
Advertisement