మా పల్లెలో క్రిస్మస్

మా పల్లెలో క్రిస్మస్


‘చింతలేదిక యేసు పుట్టెను

 వింతగను బెత్లేహమందున

 చెంత చేరగ రండి వేగమె

 దీనులై, సర్వమాన్యులై...’

 పాదిరిగారితో భక్తజనులు ఈ పాటనీ, ఇటువంటి పాటల్నీ పాడుతూ చలిలో తెల్లవారుజామున పల్లెంతా తిరుగుతుంటే ఇళ్లన్నీ మేల్కొనేవి.

ఆరోజు క్రిస్మస్ పండగ. క్రైస్తవులకు పర్వదినం. క్రీస్తు జన్మించిన రోజు. క్రీస్తు పుట్టుకే నూతన ప్రేమ యుగోదయం అంటారు భక్తులు.గుడ్ ఫ్రైడే అంటే క్రీస్తును సిలువ వేసిన రోజు. ఆ శుక్రవారం మంచి శుక్రవారం ఎందుకయిందంటే జనం కోసం దేవుడి పుత్రుడు సిలువ మరణం పొందటం వల్ల. ఇంకా కొన్ని పండగలున్నాయంటారు. ఉన్నవాళ్లకు అన్ని రోజులూ పండగ రోజులే! పేద పల్లెవాసులకు కాదు!

 

క్రిస్మస్ ఉదయం నిద్రలేచిన తల్లిదండ్రులు పిల్లల ముఖం కడిగి, తుడిచి, గవదకట్టు కట్టి గుడికి పంపేవాళ్లు. గవదల దాకా దుప్పటి లాగి కట్టి వదిలితే అది పాదాల దాకా జీరాడుతుంది. పిల్లలు చిన్న పాదిరిల్లాగా ఉండేవాళ్లు. నడుస్తున్న పెంగ్విన్ పక్షుల్లాగా ఉండేవాళ్లు.

 

గుడిలో తెల్లవారిందాకా పాటల పుస్తకంలోని భక్తి గీతాలు పాడుతూ  దశమ భాగములెల్ల దేవునివీ అనీ, ప్రథమ ఫలములెల్ల దేవునివీ అని పాడుతూ ఉండేవాళ్లు. నూత్న దంపతుల తమ ప్రథమ ఫలాన్ని గుడికి సమర్పించి, మళ్లీ ఖరీదు కట్టి కొని తెచ్చుకొనేవాళ్లు.

 

అది ఆరు రోజుల బడి. ఆదివారాలు, క్రిస్మస్, ఈస్టర్రోజుల్లో గుడి. ఆరు రోజులు బడిలో పిల్లలకు పాఠాలు చెప్పిన మాస్టరుగారే ఆదివారం పాదిరి. అది అప్పుడు లేకపోతే చాలామంది పల్లెల పిల్లలు, ఊళ్లో పిల్లల్లాగా చదువుకో గలిగేవాళ్లు కారు. ఊరి బడిలోకి పల్లె పిల్లల్ని రానిచ్చేవాళ్లు కారు గదా! క్రిస్మస్ ముందు రోజు మాస్టరుగారు రంగు రంగుల కాగితాలు దస్తాలు దస్తాలు తెచ్చి అందమైన ఆకారాలుగా కత్తిరించి నిట్రాళ్లకు, బొంగులకు, కిటికీలకు, పంచలకు, వాకిళ్లకు అంటింపజేసేవాడు. ఎన్ని రంగులో! ఎన్ని బొమ్మలో! ఎంత అందమో! పరమానందంగా ఉండేది.క్రిస్మస్ తెల్లవారుజామున కిరసనాయిలు లాంతర్ల వెలుగులో కనిపించీ, కనిపించని రంగులు చూస్తుంటే ఎంత బాగుండేదో! సూర్యుడి రాక కోసం రాత్రంతా నిరీక్షించిన లాంతర్లు సూర్యోదయంతో వెలవెలపోయేవి. వొత్తి తగ్గిస్తే వెలుతురంతా కొండెక్కేది. సూర్యుడికి ఆహ్వానం పలకటానికి చేతులెత్తేది... యేసుక్రీస్తు జననం కోసం నలభై మంది ప్రవక్తలు నిరీక్షించి, ఆహ్వానించినట్లు.

 

చిత్రమేమిటంటే గుడికి వచ్చిన పిల్లలు తెల్లవారుజామున నిద్రపోయేవాళ్లు కారు. అల్లరి చేసేవాళ్లు కారు. శ్రద్ధగా పాటలు పాడేవాళ్లు. పాదిరిగారి ప్రసంగం వినేవాళ్లు. క్రీస్తు పుట్టినప్పుడు గొర్రెల కాపరులు, జ్ఞానులతో పాటు దేవదూతలు కూడా వచ్చారని, నక్షత్ర కాంతి ప్రకాశించిందని చెప్పి, చిన్న పిల్లల చిట్టి చిట్టి చేతులతో బుల్లి బుల్లి కొవ్వొత్తులు వెలిగింపజేసేవాడు పాదిరిగారు. వేపకొమ్మను తెచ్చి పాతి క్రిస్మస్ ట్రీ అన్నారు. దాని కింద వెలిగించిన కొవ్వొత్తులు పెట్టారు. సూర్యకాంతితో పైన, కొవ్వొత్తుల కాంతితో కింద వెలుతురు. ఏ చెట్టుకైనా నీడ ఉంటుంది, క్రిస్మస్ ట్రీకి లేదు.

 

వేజండ్ల పల్లె ఇళ్లన్నీ పూరిళ్లే! కొందరు ఇళ్లు కప్పించారు. గోడలు అలికించారు. సున్నం కొట్టించారు. ఇళ్లముందు కల్లాపి జల్లి ముగ్గులు వేశారు. ముగ్గులేని, అలికించని ఇల్లు లేదు. ముసలోళ్లు చలికాగుతుంటే పిల్లోళ్లు వాళ్ల వొళ్లల్లో చేరి చలి కాగేవారు. ఈ రోజుల్లో అంత చలీ లేదు. చలి మంటలూ లేవు. తాతల దగ్గర చేరే మనవళ్లూ లేరు. తాతలకు దగ్గులు నేర్పేవాళ్లూ లేరు. ఈ రోజుల్లోలాగా ఆ రోజుల్లో జనాభా నియంత్రణ లేదు. అప్పుడు భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది.

 

ఈ పిల్లవాడు బంతినారు తెచ్చి, నాటి, నీరు పోసి, పెంచి, పూలు పూయించాడు. అవి పసుపు కుంకాల రంగుల్లో ఉన్నాయి. అంతదాకా ఒక్కటీ ఎవరినీ కోయనివ్వనివాడు అన్నీ కోసి, పదింట ఒక్కటి తీసి, మాల కట్టి తీసుకుపోయి గుడికి కట్టి, తిరిగి వచ్చి, పూలన్నీ అమ్మకు, అక్కకు, అమ్మలక్కలకు పంచిపెట్టి ముద్దులు పెట్టించుకొన్నాడు. పల్లె అమ్మలక్కల తలలో తన పూలుంటే చూచి పొంగిపోయాడు. పరిమళ ప్రవాహంలో పల్లెంతా పడవై తేలిపోతుంటే ఊగిపోయాడు.

 

పంట చేతికి రాగానే పదోవంతు తీసి పక్కన పెట్టిన రైతుకూలీలు క్రిస్మస్ నాడు గుడికి సమర్పించేవారు. వడ్లు, బుడమొడ్లు, కందులు, మినుములు, పెసలు, వేరుశనగకాయలు ఎన్నో! కూరగాయలు ఆక్కూరలు - చాలా. కొత్త బియ్యం, కొత్త కందిపప్పు, కొత్త నేయి - క్రిస్మస్ రోజు ఎంత రుచో! అందరి ఇళ్లలో అరిసెలు వండుతున్న వాసన పల్లెంతా ప్రయాణం చేసేది. ఏడాది పొడుగునా ఆకలికి అల్లాడిన పొట్టలు క్రిస్మస్ రోజున పిక్కటి బీర్లుగా నిండిపోయేవి.నీళ్లు పోసుకొని, బువ్వదిని పది గంటలకు గుడికి పోతే ఎంత ఆనందం! ఎంత లేనివాళ్లయినా కొత్త బట్టలు కట్టుకొని వచ్చేవాళ్లు. కొత్త బట్టలతో, కొత్త రంగులతో పల్లెంతా తళతళలాడుతూ సూర్యుడికి మెరవటం ఎట్లాగో నేర్పేది!

  రోజంతా ప్రసంగాలు, పాటలు, బైబిలు చదవటాలు, వివరించటాలు విసుగు విరామం లేకుండా ఉండేది. డబ్బు రూపంలో వచ్చిన కానుకలు కాక వస్తు రూపంలో తెచ్చిన కానుకలు చూస్తే సంబరంగా ఉండేది. కోడిపుంజుల్ని, మేక పిల్లల్ని గుడికి సమర్పించినవారే తిరిగి వేలంపాటలో కొనుక్కొనేవాళ్లు.అరటి పళ్లు, నారింజకాయలు, జామకాయలు, కొబ్బరి ముక్కలు, మరమరాలు పిల్లలందరికీ పంచిపెట్టేవాళ్లు.

 అప్పుడు 77 ఏళ్ల పూర్వం వేజండ్ల పల్లెలో 300 గడప ఉండేది. ఇప్పుడు 1200 గడప ఉంది. అప్పుడన్నీ పూరిళ్లు. ఇప్పుడు ముప్పాతిక స్లాబు ఇళ్లు. అప్పుడు సైకిళ్లు ఒకటో రెండో. ఇప్పుడు మోటారు సైకిళ్లు, ఆటో రిక్షాలు, వేన్లు చాలా ఇళ్లముందున్నాయి. అప్పుడందరూ రైతు కూలీలు. ఇప్పుడు చాలామంది సొంత వృత్తులవాళ్లు. చేలుదార్లు ఎక్కువ. పొగాకు కంపెనీ పనులు, చాలా పనులకు గుంటూరు ఆధారం. వీళ్లిప్పుడు చాలా పెద్ద చదువులు చదివారు. చదు వులకు తగ్గ ఉద్యోగాలు వెదుకుతూ ఉన్నారు.

 

అప్పుడు క్రిస్మస్ రాత్రి క్రీస్తు పుట్టుక నాటకం వేసేవాళ్లు. బల్లలు పరిచి స్టేజీ అనేవాళ్లు. పెట్రోమాక్సు లైటు అమర్చే వాళ్లు. అప్పుడు కరెంటు లేదు. ఇప్పు డుంది. అప్పుడు మైకులు లేవు. ఇప్పు డున్నాయి. అప్పుడు నక్షత్రాలు లేవు. ఇప్పుడున్నాయి. ఎంత పెద్ద నక్షత్రం. ఎంత పెద్ద ఎత్తు! ఎంత వెలుతురు! పల్లె రాత్రంతా వెలుతురులో స్నానం చేస్తూ ఉంటుంది. క్రీస్తు పుట్టినప్పుడు పుట్టిన నక్షత్రం ఒకటి ఆకాశంలో పుడితే ఇప్పుడు భూమిమీద ప్రతి పల్లెలో నక్షత్రాలు ప్రభవిస్తున్నాయి. రాత్రంతా పల్లె నిండా వెలుతురు. చర్చీల నిండా మందిరాల నిండా మైకులు, పాటలు. సంగీతంలో, కాంతితో వేజండ్ల పల్లె నిర్విరామ భక్తిగా పరిఢవిల్లుతూ ఉంటుంది.

 

అప్పటి క్రిస్మస్‌కి ఇప్పటి క్రిస్మస్‌కి ఎంత తేడా! అది అణగారిన పేదల క్రిస్మస్. ఇది వికాస మానవ క్రిస్మస్. ఈ డెబ్భై ఏడేళ్లలో - ఒక జీవిత కాలంలో - వేజండ్ల పల్లెలో క్రిస్మస్ తెచ్చిన మార్పు చూస్తుంటే ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంటుంది.

 ‘చింత లేదిక యేసు పుట్టెను

 వింతగను బెత్లేహమందున

 చెంత చేరగ రండి వేగమె

 దీనులై, సర్వమాన్యులై...’

  ఎంత సంతోషం! ఎంత సంబరం!

 - ఆచార్య కొలకలూరి ఇనాక్

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top