కాళీ నుంచి సన్యాసినాయుడి వరకు! | Best Villain | Sakshi
Sakshi News home page

కాళీ నుంచి సన్యాసినాయుడి వరకు!

Jun 25 2017 2:19 AM | Updated on Sep 5 2017 2:22 PM

కాళీ నుంచి సన్యాసినాయుడి వరకు!

కాళీ నుంచి సన్యాసినాయుడి వరకు!

నాకెందుకండీ రాజకీయం. ఏదో రౌడీయిజం మీద బతుకుతున్నాను’ అంటాడు కాళీ. అంతమాత్రానా భజనపరులు ఊరుకుంటారా ఏమిటి?

ఉత్తమ విలన్‌
‘నాకెందుకండీ రాజకీయం. ఏదో రౌడీయిజం మీద బతుకుతున్నాను’ అంటాడు కాళీ. అంతమాత్రానా భజనపరులు ఊరుకుంటారా ఏమిటి?‘తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు... రౌడీ ముదిరి రాజకీయ నాయకుడు అవుతాడు’ అని ఉపదేశించి రంగంలోకి దించుతారు. ఇక అప్పుడు కాళీని ఆపతరమా! రాజకీయం అండతో చెలరేగిపోయే రౌడీ ‘కాళీ’గా ‘ప్రతిఘటన’ సినిమాలో అదరగొట్టేశారు చరణ్‌రాజ్‌. ఇప్పటికీ చరణ్‌రాజ్‌ను ‘కాళీ’గానే గుర్తుపెట్టుకుంటారు. పచ్చి రౌడీయిజం చలాయించే కాళీ పాత్ర నుంచి ‘పైసా’లో ఎలాగైనా సరే సీఎం కావాలనుకునే సన్యాసినాయుడు పాత్ర వరకు...ఆ పాత్రలలోని సారాన్ని, జీవాన్ని  కళ్లకు కట్టిన చరణ్‌రాజ్‌ కన్నడంలో చేసిన తొలి సినిమా హిట్‌ అయింది. ఆ తరువాత పది సినిమాల్లో హీరోగా చేశారు. ఆ సమయంలోనే ‘ప్రతిఘటన’ సినిమాలో ‘కాళీ’ పాత్ర వెదుక్కుంటూ వచ్చింది.

‘విలన్‌ వేషాలేంటి?’ అని వెనక్కి లాగారు కొందరు. మరోవైపు...
‘టీ.కృష్ణ గొప్ప దర్శకుడు. నీకు నటుడిగా మంచి పేరు వస్తుంది. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు’ అన్నారు మరికొందరు. సరే అంటూ ‘ప్రతిఘటన’ సినిమాలో నటించారు. ‘కాళీ’గా అతని పేరు మారుమోగిపోయింది. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించి ‘ఉత్తమ విలన్‌’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు చరణ్‌రాజ్‌. హైస్కూల్‌ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాడు చరణ్‌రాజ్‌.‘నువ్వు  హీరో అవుతావు’ అని మునగ చెట్టెక్కించేవారు  స్నేహితులు. గురురాజ్‌ భట్‌ అనే స్నేహితుడు మాత్రం ‘నీకు అంత సీన్‌ లేదు’ అనేవాడు. ఇక అప్పటి నుంచి పౌరుషం పుట్టుకొచ్చింది. ఎలాగైనా సరే సినిమాల్లో నటించాలనే పట్టుదల పెరిగింది.

‘నాన్నా... నేను సినిమాల్లోకి వెళ్లాలను కుంటున్నాను’ అని అన్నప్పుడల్లా చెంప చెళ్లుమనేది. ఇలా అయితే కుదరదని ఒక ఫైన్‌ మార్నింగ్‌ ఇంట్లో నుంచి డబ్బులు కొట్టేసి సొంతూరు బెల్గాం నుంచి బెంగళూరుకు పారిపోయి వచ్చాడు. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు. నక్కతోకను చరణ్‌రాజ్‌ తొక్కాడో లేదోగానీ ఒకరోజు దర్శకుడు యస్‌.డి.సిద్దలింగయ్య ‘కొత్తవాళ్లతో సినిమా తీస్తున్నాను. హీరోగా నటిస్తావా?’ అని అడిగాడు. ఇక చరణ్‌రాజ్‌ సంతోషానికి హద్దు లేదు. ఆ సినిమా హిట్‌ కావడంతో పదిమంది దృష్టిలో పడ్డాడు.‘హీరోగానే చేస్తాను’ అనే పరిమితి పెట్టుకోకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ  ప్రేక్షకుల చేత శభాష్‌ అనిపించుకుంటున్నారు బ్రహ్మానంద. మధ్యలో ఈ బ్రహ్మానంద ఏమిటి అనుకుంటున్నారా? ఇది ఆయన అసలు పేరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement