Sakshi News home page

ఈ బంటిగాడికి తిక్క రేగితే...

Published Sun, Aug 20 2017 12:36 AM

ఈ బంటిగాడికి తిక్క రేగితే...

‘నేను జీవితంలో ఒక్క మంచిపనీ చేయలేదు.ఈ పని చేయనివ్వు’ అంటున్నాడు  బొండు తన ఆత్మీయుడితో.ఇంతకీ మంచిపని అంటే? ఒకరి కోసం ప్రాణం ఇవ్వడం కాదు.ఒకరి పగ కోసం ప్రాణం తీయడం... రక్తచరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు సృష్టించుకోవడం! నాయక్‌ అంటే కంత్రి. వాడి తమ్ముడు బంటి పరమ కంత్రి. ఈ కంత్రి అంటే ఆ కంత్రికి ఎనలేని ఇష్టం. ‘బంటీ బేటా’ అని ప్రేమగా పిలుచుకుంటాడు. నాయక్‌కు బంటి తమ్ముడు మాత్రమే కాదు అతడికి కుడిభుజం కూడా.‘ఏమ్రా బంటీ ఇంత లేటు జేసినవ్‌’ అని ‘దూకుడు’ సినిమాలో మహేష్‌బాబుతో అనిపించుకున్న ఈ బంటి అసలు పేరు అజాజ్‌ఖాన్‌.

‘రక్తచరిత్ర’ ‘దూకుడు’ ‘నాయక్‌’ ‘బాద్‌షా’ ‘హార్ట్‌ ఎటాక్‌’ ‘వేట’ ‘రోగ్‌’ సినిమాలతో ‘యువ విలన్‌’గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఖాన్‌ మొదట ముంబైలో మోడలింగ్‌ చేశాడు. కండలు తిరిగిన దేహంతో కనబడే ఖాన్‌ ‘కరమ్‌ అప్నా అప్నా’ ‘క్యా హోగా నిమ్మో కా’ ‘రహే తేరా ఆశీర్వాద్‌’ ‘కహానీ హమారీ మహాభారత్‌ కీ’...మొదలైన టీవీషోలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘అల్లాకే బందే’ ‘రక్తచరిత్ర’ సినిమాలతో వెండితెరకు పరిచయమయ్యాడు. రియాల్టీ టీవీషో ‘బిగ్‌బాస్‌–7’తో  మరింత పాపులర్‌ అయ్యాడు.

 సెయింట్‌ జేవియర్‌ స్కూల్‌లో చదువుకునే రోజుల్లో చదువు మీద కంటే సాంస్కృతిక కార్యక్రమాల మీదే ఎక్కువ ఆసక్తి కనబరిచేవాడు ఖాన్‌. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాకపోవడం లోపం అనుకోవడం లేదు ఖాన్‌. ఆయన దృష్టిలో లోపం అంటే కల కనకపోవడం. కల కని కష్టపడకపోవడం. కష్టపడినా.. త్వరగానే నిరాశ చెందడం. టైమ్‌ కోసం ఎదురుచూడక పోవడం. టైమ్‌ వచ్చినప్పుడు ఫిట్‌గా లేకపోవడం. అందుకే ఆరోగ్యంపై అమితశ్రద్ధ కనబరుస్తాడు ఖాన్‌.‘‘గ్లామర్‌ ప్రపంచంలో రాణించాలంటే నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. దానికి అంకితభావం కూడా తోడుకావాలి’’ అంటాడు ఖాన్‌.

‘సినిమా ఫీల్డ్‌లో మనకో గాడ్‌ఫాదర్‌ ఉండాలి అనుకుంటారు. ఉన్నాడనుకుందాం. ఆయన పాత్ర మనల్ని పరిచయం చేయడం వరకే. ప్రతిభతో నిరూపించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది’’ అని చెప్పే ఖాన్‌ ఇద్దరు దర్శకుల గురించి చెబుతాడు.‘‘మనం ఏ నేపథ్యం నుంచి వచ్చామనే దానితో రామ్‌గోపాల్‌వర్మ, మహేష్‌భట్‌ లాంటి దర్శకులకు పనిలేదు. మనలో ఏమాత్రం ప్రతిభ ఉన్నా భుజం తడతారు’’ అనే అజాజ్‌ఖాన్‌కు టీవీలో నటించడం కంటే సినిమాల్లో నటించడమంటేనే ఎక్కువ ఇష్టం.‘‘టీవీలో కృత్రిమత్వం ఉంటుంది. సినిమాల్లో వాస్తవం ఉంటుంది’’ అంటాడు ఖాన్‌.వాస్తవపాత్రలతో ‘యువవిలన్‌’గా ఆయన మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.

Advertisement
Advertisement