సత్యం పలికిన పాపం!

Amarashilpi Jakkanna Movie Story - Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

బీయస్‌ రంగా దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, చిత్తూరు నాగయ్య, బి.సరోజాదేవి... నటించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...
ఆ విగ్రహాన్ని చూసి రాజావారికి మతిపోయినంత పనైంది. ఏమి అందం! ఏమి అందం!!
‘‘మోహిని కాదురా. వెన్నెల వెలుగులో వెలిగిపోతున్న శిలాప్రతిమ. ఆ మోహిని మోహనమూర్తిని తిరస్కరించే అందాలబొమ్మ. ఏ సిద్ధహస్తుడు చెక్కాడో ఈ చిన్నారిని’’ సంభ్రమాశ్చర్యాలతో అన్నాడు రాజు.
‘‘నేనే ప్రభూ’’ అంటూ ఒక నిరాడంబరుడు అక్కడికి వచ్చాడు.
‘‘నీవా!’’ అంటూ ఆశ్చర్యపోయాడు రాజు.
‘‘సృష్టికర్తను మరిపించే శిల్పాన్ని ప్రదర్శించావు!’’ అని ప్రశంసించాడు.
‘‘అది మానవులకు సాధ్యం కాదు ప్రభూ. ప్రకృతిని చూసే కళాకారుడు ప్రతిరూపాన్ని సృష్టిస్తాడు. ఇది జీవం ఉన్న సింగారి శిల్పం’’ అన్నాడు శిల్పి.
‘‘ఇంతటి సౌందర్యరాశి ఎక్కడ ఉంది?’’ ఆశ్చర్యపోతూ అడిగాడు రాజు.
‘‘ఇక్కడే ఉంది’’ అని జవాబు చెప్పాడు శిల్పి.

‘‘ఇంతటి అందాలబొమ్మ మా అంతఃపురంలో అలంకారం ఉండాల్సిందే. ఈ ప్రతిమను అంతఃపురానికి తరలించండి’’ అని ఆదేశించాడు రాజు.
‘‘వద్దు ప్రభూ... ఇది నా జీవనాధారం... నా కలలసాధనం’’ అని అడ్డుపడ్డాడు శిల్పి.
‘‘శిల్పి! నీ శ్రమకు ప్రతిఫలంగా కోరినంత బంగారం ఇస్తాను. పుచ్చుకో’’ అని ఆశపెట్టాడు రాజు.
‘‘ప్రభూ! అదేనాటికీ జరగదు. నా ప్రాణమైనా వదులుకుంటానుగానీ దీన్ని మాత్రం వదలను’’ అని ఆ సుందర విగ్రహాన్ని గట్టిగా పట్టుకున్నాడు శిల్పి.
రాజుగారి అహం దెబ్బతిన్నది.
‘‘ ఈ రాజ్యం నాది... ఈ రాజ్యంలో సర్వస్వం మాదే. మా ఆనందాన్ని, మా వాంఛను ఎవరూ తొలగించలేరు’’ అన్నాడు రాజు.
విగ్రహాన్ని తరలించే క్రమంలో పెనుగులాట జరిగింది. విగ్రహం కింద పడి విరిగిపోయింది. ఇది చూసి శిల్పి గుండె పగిలిపోయింది.
‘‘విరిగిపోయిన బొమ్మను నీవే ఉంచుకో. సజీవ ప్రతిమనే మేము దక్కించుకుంటాం’’ అంటూ అక్కడి నుండి కదిలాడు రాజు.

‘‘రాజం...’’ అని పెద్దగా కేకలు వేస్తూ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు రాజు.
‘‘ప్రభూ! తమ రాకతో మా గృహం పావనం అయింది’’ అని ఆనందపడిపోయింది రాజం.
‘‘నీ కూతురెక్కడ?’’ అడిగాడు రాజు.
‘‘అమ్మాయి మంజరీ...’’ అని పిలిచింది రాజం.
మంజరి వచ్చింది.
ఆమె అందాన్ని చూసి పరవశుడైపోయాడు రాజు.
‘‘ఆహా! మంజరి నిజంగా రంభే. కరిగిన బంగారంలో చంద్రుడిని సానబెట్టి పొడి చేసి మెదిపి ఆ ముద్దతో బ్రహ్మ ఈ మూర్తిని సృష్టించాడు’’ అని పొగడ్తల వర్షం కురిపిస్తూనే...
‘‘ఇంతటి సౌందర్యరాశిని ఇంట్లో దాచి మమ్మల్ని మోసం చేశావా?’’ అని పిడుగులా గర్జించాడు రాజు.
‘‘లేదు ప్రభూ! ముందు నాట్యరాణిని చేసి తమ ముందు...’’ అని గొణికింది రాజం.
‘‘నాట్యరాణి ఎన్నడో అయిపోయింది. మా సంస్థానంలో రాజనర్తకిగా నియమిస్తున్నాను. మంచిరోజు చూసి అంతఃపురంలో నాట్యప్రదర్శన ఏర్పాటు చేయిస్తాను. ఈ నవరత్నముద్రిక నాట్యరాణికి మా ప్రేమచిహ్నం’’ రాజంకు రాజముద్రిక ఇచ్చి  ఆ ఇంటి నుంచి వెళ్లాడు రాజు.
ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేవు.
‘‘ఈనాటికి మన బాగ్యరేఖ పండి నువ్వు రాజనర్తకి అవుతున్నావు. ఈ సీమలో ఈ గౌరవం మనకే దక్కింది’’ అన్నది కూతురితో.
‘‘ఆ గౌరవం నాకు అక్కర్లేదు. ఆ అంతఃపురంలో నేను నాట్యం చేయను’’ అన్నది గట్టిగా మంజరి.
‘‘ఈ మహాయోగం నీకు పట్టాలని అహోరాత్రాలు కలలు కన్నాను. వెదుక్కుంటూ సిరివస్తే నిరాకరిస్తావా! వీల్లేదు... ఏమైనా సరే నువ్వు నాట్యం చేసి తీరాల్సిందే’’ అంటూ కూతురు మీద గట్టిగా కేకలు వేసింది రాజం.

ప్రజలు శిల్పిని చెట్టుకు కట్టేసి కొడుతున్నారు. ఇంతలో ‘‘ఆగండి’’ అనే మాట వినిపించింది.
‘‘రామానుజాచార్యులు వస్తున్నారు’’ అంటూ ప్రజలు పక్కకు తప్పుకున్నారు. 
‘‘ ఇతడిని విముక్తి చేయండి’’ అని ప్రజలను ఆదేశించి ‘‘నీవు ఎవరు నాయనా? ఎందుకీ దండన?’’ అని శిల్పిని అడిగాడు.
‘‘సత్యం పలికిన పాపం’’ అన్నాడు శిల్పి.
‘‘నీ ప్రయాణం ఎక్కడికి నాయనా?’’ అడిగారు రామానుజాచార్యులు.
‘‘ఏమో స్వామి! దిక్కులేని వాడిని ఎక్కడికని చెప్పను!’’ అన్నాడు దిక్కులు చూస్తూ ఆ శిల్పి.
‘‘సరే, మా  ఆశ్రమానికి రా. అక్కడ నీకు శాంతి లభిస్తుంది నాయనా’’ అని దిక్కులేని అతనికి ఒక దిక్కు చూపారు రామానుజాచార్యులు.
‘‘తమ ఆజ్ఞ’’ అన్నాడు కృతజ్ఞతాభావంతో శిల్పి.
‘‘నీ స్థితి నాకు అర్థమైంది నాయనా. అనిత్యమైన సౌందర్యాన్ని ప్రేమించి సాధ్యం చేసుకోలేదని బాధపడుతున్నావు’’ అన్నారు రామానుజాచార్యులు.

‘‘లేదు స్వామి, నన్ను ఈ లోకం వంచించింది. నా సుందరస్వప్నాలను తుడిచి వేసింది. నాకు ఈ లోకంలో భీకర శాకినీ ఢాకినీ పిశాచాలే కనిపిస్తున్నాయి. వంచన వికటాట్టహాసం చేస్తూ నన్ను బెదిరిస్తోంది’’ అని బాధపడుతూ ‘‘స్వామీ, నాకు ఈ లోకంలో శాంతి లేదా?’’ అని అడిగాడు శిల్పి.
‘‘ఉంది నాయనా.. పువ్వు పుష్పించి నేల రాలినట్టే... కనిపించే అందం అంతా అంతరించిపోతుంది. చరాచర జీవజాలంలో కనిపించే సౌందర్యమంతా ఆ భగవంతుడి లీలావిలాసం. నీ సౌందర్యదృష్టిని నిత్యమైన ఆ అందం వైపు మరల్చు. అర్థం చేసుకో. దానిని కళా రూపంలో సృష్టించి తరతరాల మానవులు దర్శించి ఆనందించి తరించేట్టు చెయ్యి’’ అని ఉపదేశించారు రామానుజాచార్యులు.
‘‘ధన్యోస్మి గురుదేవా! పరమార్థం బోధపరిచి దివ్యజ్యోతిని చూపించావు. శిష్యుడనై నీ సన్నిధిలోనే ఉండి ఆ సాధన చేస్తాను. కాని ఒక ప్రార్థన...’’ అన్నాడు శిల్పి.
‘‘ఏమిటది?’’ అడిగారు రామానుజాచార్యులు.
‘‘నా పూర్వచరిత్ర ఈ క్షణంతో మరుగునపడిపోవాలి’’ అన్నాడు శిల్పి
‘‘అలాగే నాయనా... సుందరనారాయణ విగ్రహాన్ని లోకోత్తరంగా సృష్టించి నీ కళాప్రతిభను సార్థకం చేసుకో’’ అని ఆశీర్వదించారు రామానుజాచార్యులు.
సమాధానం: అమరశిల్పి జక్కన

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top