అల్బేనియా కొండంత అందం!

అల్బేనియా కొండంత అందం!


అదిగో అల్లదిగో...

ఎన్నో జాతులు పరిపాలించినా తన భాష, సంస్కృతులను మాత్రం పదిలంగా కాపాడుకుంది అల్బేనియా. భౌగోళిక అందాలు ఈ చిన్ని దేశానికి కొండంత గుర్తింపును ఇస్తున్నాయి.



అల్బేనియా సామెతల్లో...‘ఎవరింటికి వారే రాజు’ అనే సామెత ఒకటి ఉంది. చిత్రమేమిటంటే, తరతరాలుగా ఎన్నో జాతుల దండయాత్రకు గురైన అల్బేనియా స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు చాలా దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఒట్టోమన్ సుల్తాన్‌లు అల్బేనియాను నాలుగు శతాబ్దాలు పరిపాలించారు. పన్నుల పెంపు, నిర్బంధ సైనిక శిక్షణ మొదలైన కారణాలతో తలెత్తిన ‘అల్బేనియన్ తిరుగుబాటు’ ఉద్యమం ఆ దేశ చరిత్రలో కొత్త అధ్యాయానికి దారి తీయడమే కాదు... ఒట్టోమన్  సామ్రాజ్యం బలహీనమైన విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.



1912లో ఒట్టోమన్ సామ్రాజ్యం నుంచి విముక్తి పొందింది అల్బేనియా. 1944-1946ల మధ్య ‘డెమోక్రటిక్ గవర్నమెంట్ ఆఫ్ అల్బేనియా’గా, 1946-1976ల మధ్య ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ అల్బేనియా’గా అల్బేనియా ఉనికిలో ఉంది.   కమ్యూనిస్ట్ నాయకుడు ఎన్‌వెర్ హోజా  1967లో అల్బేనియాను ‘ప్రపంచంలో తొలి నాస్తికదేశం’గా ప్రకటించాడు. ‘డెమొక్రటిక్ పార్టీ’ స్థాపన ఆ దేశ రాజకీయ చరిత్రలో మరో ముఖ్య ఘట్టం. దేశంలో డెబ్భైశాతం కొండలే. అల్బేనియాలో ఎత్తై పర్వతం  కొరబ్. 9,068 అడుగుల ఎత్తు ఉన్న ఈ పర్వతం అల్బేనియా, రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియాలకు సరిహద్దుగా ఉంది.



ఆగ్నేయంలో ఉన్న ఒహ్‌రిడ్ సరస్సు  యూరప్‌లోని ప్రాచీనమైన, లోతైన సరస్సులలో  ఒకటి. 1979లో యునెస్కో ‘వరల్డ్ హెరిటేజ్ సైట్’ జాబితాలో చోటు చేసుకుంది. చిన్న దేశమైన అల్బేనియా జీవవైవిధ్యంలో మాత్రం విశాలమైనది. 3000 రకాల భిన్నమైన జాతుల మొక్కలు ఈ దేశంలో పెరుగుతాయి. 353 పక్షి జాతులు అల్బేనియాలో ఉన్నాయి.  ఒకప్పుడు సోషలిస్ట్ దేశంగా పేరుగాంచిన అల్బేనియా ఆ తరువాత పెట్టుబడిదారి దారిలో నడిచింది.



దేశంలో విదేశీ పెట్టబడులు పెరిగాయి. ఒకప్పుడు కరెంట్ కష్టాలు ఎదుర్కొన్న అల్బేనియా ఇప్పుడు విద్యుత్‌ను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. వ్యవసాయ ప్రధానమైన ఈ దేశంలో  సహజ వాయువు, పెట్రోలియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. పర్యాటకపరంగా కూడా అల్బేనియాకు  ప్రాధాన్యత ఉంది. జాతీయ ఆదాయంలో ఎక్కువ భాగం పర్యాటకరంగం నుంచే వస్తుంది.  ఒట్టోమన్ పాలనలో సుదీర్ఘకాలంగా ఉండడం వల్ల  కావచ్చు... మిగిలిన యురోపియన్ దేశాలతో పోల్చితే అల్బేనియా కళారూపాలలో భిన్నత్వం కనిపిస్తుంది. ప్రస్తుతం అల్బేనియా  అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపులో ఉంది.

 

ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

* తల అడ్డంగా ఊపడం అనేది ‘ఇష్టం లేదు’ అనే భావానికి  సూచనగా భావిస్తాం. కానీ అల్బేనియాలో మాత్రం రివర్స్. తల అడ్డంగా  ఊపడం అనేది ‘నాకు ఆమోదమే’ అని చెప్పడం! నిలువునా ఊపితే ‘నాకు ఇష్టం లేదు’ అని చెప్పడం.

* అల్బేనియా ప్రధాన క్రీడ ఫుట్‌బాల్.

* అల్బేనియాను స్థానికంగా ‘షిక్విపేరియా’ అని పిలుచుకుంటారు. దీని అర్థం ‘డేగల భూమి’.

* దేశవ్యాప్తంగా  ఏడు లక్షల వరకు బంకర్లు ఉన్నాయి.

* ప్రపంచం అమ్మగా కొలిచే మదర్ థెరిసా జన్మతః అల్బేనియన్. ఒట్టోమన్ సామ్రాజ్యంలోని స్కోప్జిలో (ఇప్పుడు మాసిడోనియాలో ఉంది) జన్మించారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top