నిశ్శబ్ద విప్లవం | society to aid hearing impaired | Sakshi
Sakshi News home page

నిశ్శబ్ద విప్లవం

Sep 26 2014 12:53 AM | Updated on Sep 2 2017 1:57 PM

నిశ్శబ్ద విప్లవం

నిశ్శబ్ద విప్లవం

ఉద్యోగావకాశాలు, ఉపాధి మార్గాలు కల్పించడం మాత్రమే వీరికి న్యాయం చేయడం అవుతుందనుకుంటే పొరపాటే అవుతుంది. సమాజంలో సమాన అవకాశం ఇవ్వడం మనతోనే ప్రారంభమవుతుంది.

ఝాన్సీ కీ వాణి: ఉద్యోగావకాశాలు, ఉపాధి మార్గాలు కల్పించడం మాత్రమే వీరికి న్యాయం చేయడం అవుతుందనుకుంటే పొరపాటే అవుతుంది. సమాజంలో సమాన అవకాశం ఇవ్వడం మనతోనే ప్రారంభమవుతుంది. ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో మనకి ముందు తెలిసి ఉండాలి. అందుకు మనం వారిని మరింత దగ్గరగా తెలుసుకోవాలి. మన చుట్టూ వీరు రోజూ కనిపించకపోవడానికి కారణం మనం తెలిసో, తెలియకో చూపించే వివక్ష. ఒక బధిరుల, అంధుల పాఠశాలకో.. మానసికంగా ప్రత్యేక అవసరాలున్న పిల్లల కేంద్రానికో వెళ్లి చూస్తే అర్థమవుతుంది.. ఎందరి బాల్యం తమ ప్రత్యేకసామర్థ్యం వెతుక్కునే క్రమంలో కష్టపడుతోందో! వీరిలో రేపు నిజంగా ఎంతమందికి వారి ప్రతిభకి తగ్గ ఉపాధి దొరుకుతుందో అనే ప్రశ్న నన్ను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. మన ఓర్పు, సహకారం, అర్థం చేసుకోవడం.. వీరి జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురాగలుగుతుంది.
 
 35వేల అడుగుల ఎత్తులో ఈ ఆర్టికల్ రాద్దామని కాగితం, కలం తీసాను. పెన్ను రాయట్లేదు.. ఫ్లయిట్‌లో కదా ఇంక్ బిగుసుకు పోయిందేమోనని, కాస్త రాస్తే కలం కదులుతుందని రాస్తూ పోయాను. కాగితం మీద రాతలేవీ కనబడటం లేదు.. బ్లాంక్‌గా ఉంది నా మనసు లాగా! ఇంకు  కనిపించని ఆ తెల్లకాగితంపై జాగ్రత్తగా చూస్తే పెన్నుతో రాసిన అచ్చులు కనిపిస్తున్నాయి. బయటికి స్పష్టత లేకపోయినా ఈ ముద్రలు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. అచ్చం అలాగే మనం పట్టించుకోని, వినిపించుకోని.. చూడని జీవితాలు కూడా మన చుట్టూ ఉంటాయి. అస్తిత్వం కోసం పోరాటం చేసే ఆ గళాలని కనిపిస్తున్నా వినిపించుకోని నిర్లక్ష్యం మనది.
 
 వినిపించే స్వరం లేని ఈ జీవితాలకి కనిపించే గళం ఉంది. ఈ వాక్యంలోని అంతరార్థం అర్థం కావాలంటే నేను మీకు తన్వీర్ సుల్తానా గురించి చెప్పాలి. ఈ ఇరవయ్యేళ్ల మెరిసే కళ్ల అమ్మాయి ఓ టీచర్. సెట్విన్ ట్రైనింగ్ సెంటర్‌లో ఎంబ్రాయిడరీ నేర్పించే ఈ అమ్మాయితో ముచ్చట్లలో పడి నేను ఎంత సమయం గడిపేసానో గుర్తులేదు. ఐదుగురు సంతానంలో రెండో అమ్మాయి అయిన తన్వీర్ తన అక్కకీ, చెల్లికి పెళ్లి చేసింది. మతి స్థిమితం లేని తమ్ముడి ఆలనాపాలనా చూసుకుంటోంది. అనారోగ్యంతో ఉన్న తల్లికి అండగా ఉంటోంది. ఇన్నింటికీ తన ఈ చిన్న ఉద్యోగమే ఊతం. ఇదేదో 80ల్లో తెలుగు సినిమా కథ కాదు. తన్వీర్ నిజ జీవితం. ఆ అమ్మాయి స్ఫూర్తిని వర్ణించాలంటే నాకు మాటలు చాలవు. ఎందుకంటే తన్వీర్‌కు మాటలు రావు. పుట్టుకతోనే బధిరురాలైన ఆమెకు మాటలు వచ్చే అవకాశం లేదు. కనిపించే గళానికి, వినిపించుకొనే మనసు కావాలి. మా ఇద్దరి మధ్య జరిగిన ఆ నిశ్శబ్ద సంభాషణలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
 
 వినిపించకపోయినా, మాటలు రాకపోయినా ఓ టీచర్‌గా తన్వీర్ సూపర్ సక్సెస్‌ఫుల్. ఇక్కడ మూడు విషయాలు ప్రత్యేకంగా గుర్తించాలి. ఒకటి.. తనని తాను నమ్మిన తన్వీర్, రెండు.. తన్వీర్ ప్రతిభని గుర్తించి ఉద్యోగమిచ్చిన సంస్థ నిర్వాహకులు, మూడు.. మాట్లాడకుండా ఆమె దగ్గర పని నేర్చుకున్న శిష్యులు! వీరిలో వైకల్యం ప్రతిభకి అడ్డు అని ఎవరనుకున్నా తన్వీర్ గురించి మనం ఇలా ప్రత్యేకంగా మాట్లాడుకునే వాళ్లం కాదు. నిజానికి ఏ అవయవలోపమైనా, అది సామర్థ్య లోపం అని ఆలోచించే మనది అసలు వైకల్యం. ప్రత్యేక సామర్థ్యం ఉన్న వీరికి తగిన అవకాశాలు కల్పించకపోవడం వ్యవస్థ వైఫల్యం.
 
 తన్వీర్‌ది అదృష్టం అనేవాళ్లు కొందరుంటే.. కాదు అని ఆమెది మొండి పట్టుదల అనేవాళ్లు మరికొందరు! ఏది ఏమైనా అంత పట్టుదల, అదృష్టం రెండూ ఉన్న వాళ్లు మన చుట్టూ ఎంతమంది కనపడుతున్నారు? అలాంటి వ్యక్తులకి మన మధ్యలో చోటు కల్పించేవాళ్లు ఎంతమంది ఉన్నారు? ఈ సందర్భంలో ఓ ఫాస్ట్‌ఫుడ్ చెయిన్‌ని అభినందించాలి. కేఎఫ్‌సీలో కొన్ని ఔట్‌లెట్స్‌లో నిశ్శబ్దంగా పనిచేస్తూ కస్టమర్‌లని డీల్ చేస్తున్న బధిర, మూగ వ్యక్తులు కనిపిస్తారు. అక్కడ మనకి వారి ప్రతిభ మాత్రమే కనిపిస్తుంది.
 
 ఇనార్బిట్‌మాల్‌లో డైలాగ్ ఇన్ ద డార్‌‌కలో అంధులు మనకి గైడ్‌‌సగా దారి చూపిస్తారు. ఆ చీకట్లో మనం వారిపై పూర్తిగా ఆధారపడిపోతాం. అప్పుడు కానీ మనకి వారి ప్రత్యేక సామర్థ్యం అర్థం కాదు. society to aid hearing impaired అనే ఓ స్వచ్ఛంద సంస్థతో కలసి పనిచేయడం వల్ల నాకు ఎంతో అవగాహన పెరిగింది. వినికిడి లోపం వల్ల కలిగే మరో శాపం మూగతనం. అవగాహనరాహిత్యం వల్ల చిన్నతనంలో సరిచేయగలిగే వినికిడి సమస్యలని కూడా అశ్రద్ధ చేయడంతో జీవితాంతం నిశ్శబ్దంతో కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి పిల్లలకి కలుగచేస్తున్న తల్లిదండ్రులూ ఉన్నారు. ఇటువంటి వారికి అవగాహన పెంచేందుకూ, పేదరికం వల్ల వెనుకాడే వారికి సహకారం అందించేందుకూ dr. Ec vinaykumar, dr.rambabu  వంటి ENT surgeons ఆధ్వర్యంలో సజ్జల దివాకర్‌రెడ్డి, భాగీరథి, సునీత వంటి ప్రముఖులు HATఅనే సంస్థను ప్రారంభించారు. కనిపించే గళాలను వినిపించుకునే మనసుని నేర్పించిన HAT కి, తన్వర్‌కి ధన్యవాదాలు. ప్రపంచం కొత్తగా కనిపిస్తోంది. ఇదే నిశ్శబ్ద విప్లవం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement