
భారత సైన్యం కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ-హెచ్), ఇండియన్ ఆర్మీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ను ప్రారంభించనున్నాయి. ఈమేరకు ఐఐటీ హైదరాబాద్ సిమ్లాలోని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ (ఏఆర్‌టీఆర్ఏసీ), సిమ్యులేటర్ డెవలప్‌మెంట్ డివిజన్ (ఎస్‌డీడీ)తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. స్వదేశీ సాంకేతిక స్వావలంబనకు ఇది కీలకం కానుందని అధికారులు చెప్పారు.
‘విగ్రహ’(వర్చువల్, ఇంటెలిజెంట్, గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ ఇన్ ఏఆర్/వీఆర్ అండ్ హైటెక్ అప్లికేషన్స్ ఫర్ ఇండియన్ ఆర్మీ) పేరుతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ) భారత నైన్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇరు వర్గాలు తెలిపాయి.
‘విగ్రహ’ లక్ష్యం ఏమిటి?
భారత సైన్యం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని శిక్షణ, యుద్ధ సన్నద్ధతకు ఉపయోగించడం ద్వారా సైనిక సంసిద్ధతను నిర్ధారించాలని విగ్రాహ భావిస్తోంది.
రియలిస్టిక్ మిలిటరీ ట్రైనింగ్ సిమ్యులేషన్స్ కోసం అడ్వాన్స్‌డ్ ఏఆర్/వీఆర్ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగపడుతాయి.
సంక్లిష్ట భూభాగాల్లో సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడం, స్వయంప్రతిపత్తి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఏఐ, రోబోటిక్స్, మానవరహిత వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు ఈ సెంటర్ తోడ్పడుతుంది.
భారత సైన్యం ఆపరేషనల్ మెలకువలు, వ్యూహాత్మక అవసరాలను తీర్చడానికి బ్యాటిల్ ఫీల్డ్ సిమ్యులేషన్ టూల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ..‘ఈ కేంద్రం కేవలం టెక్ ల్యాబ్ మాత్రమే కాదు. ప్రపంచ స్థాయి ఆవిష్కరణలతో భారతదేశ రక్షణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయాలనే మా ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది’ అని తెలిపారు. బ్రిగేడియర్ ఏకే చతుర్వేది మాట్లాడుతూ..‘ఈ సహకారం తదుపరి తరం సామర్థ్యాలను స్వీకరించడానికి, స్వదేశీ సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి సైన్యం నిబద్ధతకు హైలైట్ చేస్తుంది’ అన్నారు.
ఇదీ చదవండి: భారత్ మూడంచెల ప్లాన్..