
న్యూఢిల్లీ: ఆల్గోరిథమ్ ఆధారితంగా (సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్) నిర్ణయాలు తీసుకోవడం, సేవలు కొన్ని వేదికలపైనే కేంద్రీకృతం కావడాన్ని సరిగ్గా నియంత్రించకపోతే.. ఇవి సంప్రదాయ రిస్క్‌లు కానందున మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం పడుతుందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జే అభిప్రాయపడ్డారు.
డిజిటల్ ఆవిష్కరణలు అన్నవి నేడు కేవలం చెల్లింపులకే పరిమితం కావడం లేదన్నారు. డిజిటల్ వేదికలపై సూక్ష్మ బీమా, పింఛను ఉత్పత్తుల పంపిణీ వేగంగా విస్తరిస్తోందన్నారు. ఈ తరహా డిజిటల్ ఆవిష్కరణలు తక్కువ ఆదాయ వర్గాలకు సాయపడుతున్నట్టు చెప్పారు. యూపీఐని ఇతర దేశాలకూ విస్తరించడం వల్ల సీమాంతర చెల్లింపులు వేగాన్ని సంతరించుకున్నట్టు పేర్కొన్నారు. బాధ్యాతయుతంగా అభివృద్ధి చెందగల వాతావరణాన్ని.. సురక్షితమైన, సుస్థిరమైన, కస్టమర్ కేంద్రంగా ఉండే కొత్త ఆవిష్కరణలు, పరిష్కారాల అభివృద్ధిని ఆర్‌బీఐ ప్రోత్సహిస్తుందని చెప్పారు.
‘‘పాలన, రిస్క్ నిర్వహణ, కస్టమర్ రక్షణకు ప్రాధాన్యం ఇస్తాం. సాంకేతిక పరమైన పురోగతి అన్నది ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయతతో సరిపోలాలి’’అని స్వామినాథన్ పేర్కొన్నారు. ఫిన్‌టెక్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు వేగంగా వృద్ధి చెందుతుండడంతో ఆర్థిక వ్యవస్థ సరిహద్దులు విస్తరిస్తున్నాయంటూ, ఇది సరికొత్త రిస్‌్కలను తెచి్చపెడుతున్నట్టు చెప్పారు. వీటిని సరిగ్గా చెక్‌పెట్టకపోతే అప్పుడు విడిగా సంస్థల నుంచి మొత్తం ఆర్థిక వ్యవస్థకు రిస్‌్కలు విస్తరిస్తాయని అభిప్రాయపడ్డారు. దేశంలో బలమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ఆర్థిక సేవల విస్తృతికి మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు.