
భారతీయ ఎగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయానికి వ్యూహాత్మక ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టారిఫ్‌ల వల్ల కలిగే ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడానికి, దీర్ఘకాలిక ఉపశమనం కోసం దేశ ఎగుమతి ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి మూడంచెల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.
రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తున్నందుకు భారత్‌పై అమెరికా తీసుకున్న ఈ టారిఫ్ చర్య 60 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, లెదర్, రసాయనాలు వంటి కార్మిక ఆధారిత రంగాలపై ప్రభావం చూపుతుంది. వీటిలో చాలా వరకు ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్) పరిధిలోకి రానివే ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
స్వల్పకాలిక చర్యలు..
చాలా సంస్థలకు వడ్డీ రాయితీ పథకాలు అందించాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు పూచీకత్తు లేని రుణాలను సులభతరం చేయాలని యోచిస్తోంది. సెజ్ యూనిట్ల ఆర్డర్ వాల్యూమ్‌లను నిర్వహించడానికి, ఉద్యోగాలను రక్షించడంలో సహాయపడటానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బ్రాండింగ్, ప్యాకేజింగ్, వేర్‌హౌజింగ్, లాజిస్టిక్స్‌పై పట్టుసాధించేందుకు సాయం అందించాలని చూస్తోంది. టెక్స్‌టైల్స్, హస్తకళల్లో చిన్న ఎగుమతిదారులకు లిక్విడిటీ ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా ఉంది. ఈ సమస్య పరిష్కరించేందుకు స్వల్పకాలిక చర్యలు కీలకం కానున్నాయని అధికారులు చెబుతున్నారు.
మీడియం స్ట్రాటజీ
రాబోయే 12-24 నెలల్లో అమెరికాకు చేసే ఎగుమతులను వైవిధ్య పరచాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను పొందేందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా వంటి దేశాలతో ఇప్పటికే చర్చలు వేగవంతం చేసింది. ఎగుమతి వ్యాపారాన్ని సులభతరం చేయడానికి పన్ను రిఫండ్లను క్రమబద్ధీకరించడం, ఖర్చులను తగ్గించేలా చర్యలు తీసుకుంటోంది. యూరప్, ఆఫ్రికా వంటి కొత్త భాగస్వామ్యాలను ఏర్పరుచుకోవడానికి ట్రేడ్ ఫెయిర్‌లను ఏర్పాటు చేస్తుంది.
దీర్ఘకాలిక దృష్టి
ఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌ను ప్రారంభించింది. దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లను వైవిధ్య పరిచేందుకు చర్యలు తీసుకుంటుంది. సరళీకృత లాజిస్టిక్స్, కస్టమ్స్ క్లియరెన్స్, జీఎస్టీ రిఫండ్ విధానాలతో డిజిటల్ వాణిజ్యంలో ఎంఎస్ఎంఈలకు మరింత అవకాశాన్ని కల్పించాలని చూస్తుంది. భారతీయ ఎగుమతులకు గ్లోబల్ బ్రాండ్ విశ్వసనీయతను పెంచడానికి స్కిల్లింగ్, ఆర్ అండ్ డీ, క్వాలిటీ సర్టిఫికేషన్‌లో పెట్టుబడులు పెంచాలని చూస్తుంది.
ఇదీ చదవండి: రూ.50 లక్షలు ఆదాయం ఉన్నా స్కూల్ ఫీజు భారం!