దీపక్రెడ్డి పేల్చిన బాంబు : టిడిపిలో కలకలం | Sensational comments of Deepak Reddy | Sakshi
Sakshi News home page

దీపక్రెడ్డి పేల్చిన బాంబు : టిడిపిలో కలకలం

Apr 12 2014 12:38 PM | Updated on Aug 14 2018 4:21 PM

దీపక్‌రెడ్డి - Sakshi

దీపక్‌రెడ్డి

తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ బాధ్యుడు గుణపాటి దీపక్‌రెడ్డి చేసి సంచలన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి.

తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ బాధ్యుడు  గుణపాటి దీపక్‌రెడ్డి చేసి సంచలన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి. టిడిపి రాయలసీమ బాధ్యుడు సిఎం రమేష్ను ఓ చీడ పురుగుగా పేర్కొన్నారు.  బ్రోకర్ పాత్ర పోషిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి సోదరుడు ప్రభాకర రెడ్డి అల్లుడైన దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో రాయదుర్గం నుంచి పోటీచేసే ఓడిపోయారు. ఆ తరువాత ఆయన  స్థానికంగా ఉంటూ పార్టీ కోసం పనిచేశారు.  రాయదుర్గం శాసనసభ టికెట్ వస్తుందని ఆశించారు. రాయదుర్గం శాసనసభ స్థానం కాలువ శ్రీనివాస్కు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని వారం రోజుల క్రితం హెచ్చరించారు. అయినా ఫలితంలేదు. అధిష్ఠానం తన మాటలను లెక్కచేయకుండా మొండిచేయి చూపడంతో భంగపడ్డారు. దాంతో  స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి తన సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.

దీపక్ రెడ్డి నిన్న విలేకరులతో మాట్లాడుతూ సీమాంధ్రలో పార్టీ ఓడిపోతే అందుకు రమేషే కారణమవుతారన్నారు. అతను పలువురిని మభ్యపెట్టి కోట్ల రూపాయలు దండుకోడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కొత్తగ రాజకీయ ప్రవేశం చేసిన కె.వి.ఉష అనే బిసి మహిళ నుంచి మూడు కోట్ల రూపాయలు, హైదరాబాద్ మల్కాజ్‌గిరి లోక్సభ అభ్యర్థి మల్లారెడ్డి నుంచి  20 నుంచి 60 కోట్ల రూపాయల వరకు రమేష్ వసూలు చేసినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయన్నారు.  గత ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ఆయనే కారణమని చెప్పారు. దీపక్ రెడ్డి బహిరంగంగా చేసిన ఆరోపణలతో టిడిపిలో కలకలం మొదలైంది.   దీపక్ రెడ్డి ఈ రోజు తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. పలువురు స్థానిక నేతలు ఆయనకు గట్టిగా మద్దతు పలుకుతున్నారు. దాంతో దయన  స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, దీపక్‌రెడ్డి ఆస్తులపై దర్యాప్తునకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ)లను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అనంతపురం జిల్లాకు చెందిన మార్పు డెవలప్‌మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యుడు వి.సుధీర్‌కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఈడీ, సీబీఐ జాయింట్ డెరైక్టర్‌లతో పాటు దీపక్‌రెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం ఈ నెల 15న విచారణకు రానున్నది. దీపక్‌రెడ్డి గత ఉప ఎన్నికలలో రాయదుర్గం శాసనసభ నియోజకవర్గానికి టిడిపి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో 2009-10 ఆర్థిక సంవత్సరానికి తన వార్షిక ఆదాయం రూ. 3.27 లక్షలుగా, తన భార్య ఆదాయం రూ. 1.98 లక్షలుగా పేర్కొన్నారు. వాటాలు, ఇతర చరాస్తులు తన పేరు మీద రూ. 4.59  కోట్లు, తన భార్య పేరున రూ. 1.76 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే తన పేరున రూ. 5.86 కోట్ల విలువైన స్థిరాస్తులు, తన భార్య పేరున రూ. 16.86 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు చూపించారు. ఈ ఆస్తులు కాకుండా వివాదాల్లో రూ. 6,781.05 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఆస్తులు ఎలా సంపాదించారో తేల్చడానికి సీబీఐ, ఈడీల దర్యాప్తుకు ఆదేశాలివ్వాలని  పిటిషనర్ తన పిటిషన్‌లో కోర్టును కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement