మణులొద్దు.. మాన్యాలొద్దు..

మణులొద్దు.. మాన్యాలొద్దు..


యావత్ భారతదేశంలోనే వయోలిన్‌కు పర్యాయపదంగా నిలిచిన మహామహోపాధ్యాయుడు ద్వారం వెంకటస్వామి నాయుడు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, వయోలిన్‌పై స్వర విన్యాసాలను సాధన చేసిన మంగతాయారు ఎనిమిది పదుల వయసులోనూ అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. వంశీ సంగీత అకాడమీ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న సందర్భంగా మంగళవారం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో తన వయోలిన్ కచేరీతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా ఆ వాద్య శిఖామణిని ‘సిటీప్లస్’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

 ..:: త్రిగుళ్ల నాగరాజు

 

 వయోలిన్ వాద్య విన్యాసంలో మేరునగధీరుడు మా నాన్నగారు. బ్రహ్మ సృష్టికారుడైతే.. నాదాన్ని సృష్టించింది సరస్వతీదేవి. ఆ అమ్మవారు సృజించిన నాద విలాసాన్ని భువిపై నలుచెరగులా వ్యాప్తి చేసిన కారణజన్ములలో మా నాన్నగారు ఒకరని నేను విశ్వసిస్తాను. విదేశీ వాద్య పరికరమైన వయోలిన్‌ను వాగ్దేవి ఒడిలో అలంకరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన పుంభావ  సరస్వతి. ఎందరో శిష్యులను ఆదరించి, విద్వాంసులుగా తీర్చిదిద్ది, వయోలిన్‌ను భారత వాద్య సంపదలో ఓ భాగంగా మార్చేశారాయన. అలాంటి మహానుభావుడి వారసురాలుగా పుట్టడంనా పూర్వ జన్మ సుకృతం.మహామహుల సరసన..

నా బాల్యమంతా విజయనగరంలోనే సాగింది. నాన్నగారి శిష్యురాలిగా చిన్నతనంలోనే వయోలిన్ నేర్చుకోగలిగాను. విజయనగరంలోని సంగీత కళాశాలలో డిప్లొమా చేశాను. అంతేకాదు కొన్నాళ్లు నేను సంగీతం నేర్చుకున్న కళాశాలలోనే అధ్యాపకురాలిగా కూడా పనిచేశాను. మా కుటుంబం మద్రాస్‌కు వెళ్లిన తర్వాత ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో సంగీతంలో డిగ్రీ చేశాను. ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో గ్రేడ్-ఏ కళాకారిణిగా సెలెక్టయ్యాను. 16 ఏళ్ల పాటు ఆకాశవాణిలో నా వాద్య స్రవంతి కొనసాగింది. అదే సమయంలో ఎన్నో కచేరీల్లో పాల్గొన్నాను. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్, వేదవల్లి, ఎమ్మెల్ వసంతకుమారి వంటి గానశారదల

 కచేరీల్లో వాద్య సహకారం అందించడం మరచిపోలేని అనుభూతి. నా జీవితాన్ని కళకే అంకితం చేశాను.

 

వయోలిన్‌లో లీనమై వివాహం సంగతే మరచిపోయాను. ఒక గురువుగా ఎందరో శిష్యులను తీర్చిదిద్దాను. నేడు ఇండియాతో పాటు అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లోనూ నా శిష్యులు పాఠశాలలు స్థాపించి మరీ కళాసేవ చేస్తున్నారు. ఒక గురువుగా అంతకంటే ఏం కావాలి.

 

ప్రభుత్వం  బాధ్యత..


పూర్వం రోజుల్లో కళాకారులను ఆదుకోవడానికి మహారాజులు ఉండేవారు. నేడు రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు.. ప్రభుత్వాలు, ప్రజాపాలకులు వచ్చారు. కళాకారులకు మాత్రం సరైన పోషణ కరువైందనే చెప్పాలి. అప్పుడు ఇచ్చినట్టు మణులు, మాన్యాలు అవసరం లేదు.. కళనే సర్వసంగా భావించి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులకు పోషించడం ప్రభుత్వం కనీస బాధ్యత. నాదసాధకులకు

 ప్రోత్సాహం మాట అటుంచండి, పోషణ అందిస్తే అదే పదివేలు. కళాకారులు తృప్తిగా ఉంటేనే దేశం, కాలం సుభిక్షంగా ఉంటాయి. ఆయా కళాకారుల ప్రదర్శనలను సీడీలుగా రూపొందించి మార్కెట్‌లోకి విడుదల చేసి, వాటిపై వచ్చిన మొత్తాన్ని వారికి అందజేస్తే ఎంతో మేలు చేసిన వారు అవుతారు.

 

గురువులదే బాధ్యత..

జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందరో మహానుభావులకు ఆలవాలంగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో నాకీ సత్కారం చేయడం మరింత ఆనందాన్నిచ్చింది. నేటి తరంలో సంగీతం, నాట్యం నేర్చుకోవాలనే జిజ్ఞాస కనిపిస్తోంది. దాన్ని మరింత అర్థవంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదే. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప వేదం, నాట్యం, సంగీతం, చిత్రలేఖనం.. వంటి కళల్లో ప్రవేశం పొందలేరు. మీకు లభించిన వరం నిష్ఫలం కాకూడదంటే కళను ఆరాధించాలి. భక్తి, శ్రద్ధలతో సాధన చేయాలి. ఈ రెండూ లేనివాళ్లు.. సంగీతంలోనే కాదు ఏ రంగంలో ఉన్నా రాణించలేరు. గురువుల కృపను పొందడం అంటే .. వారికి సుశ్రూష చేసి విజ్ఞానాన్ని సముపార్జించడం ఒకటే కాదు, వారు చూపిన బాటలోనడవగలగాలి. వారు నేర్పిన విద్యల్లోని అర్థాన్ని, అంతరార్థాన్ని గ్రహించగలగాలి. అప్పుడే గురువును మించిన శిష్యులని అనిపించుకోగలరు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top