ఎటాకింగ్ స్నాప్ | Duggempudi ravinder reddy talks about his photography | Sakshi
Sakshi News home page

ఎటాకింగ్ స్నాప్

Oct 12 2014 2:19 AM | Updated on Sep 2 2017 2:41 PM

ఎటాకింగ్ స్నాప్

ఎటాకింగ్ స్నాప్

నక్సల్స్ ఉద్యమ నేత కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూకు ఆయన తీసిన ఫొటోనే హైలెట్.. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఈ కెమెరా క్లిక్ చేసిన ఫొటోలు విభిన్న కోణాలను ఆవిష్కరించాయి.

నక్సల్స్ ఉద్యమ నేత కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూకు ఆయన తీసిన ఫొటోనే హైలెట్.. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఈ కెమెరా క్లిక్ చేసిన ఫొటోలు విభిన్న కోణాలను ఆవిష్కరించాయి. లాతూర్‌లో భూకంపం మిగిల్చిన బీభత్సాన్ని ఆయన ఫొటోల్లో మరింత వాస్తవికంగా చూపించాడు ఫొటో జర్నలిస్ట్ రవీందర్‌రెడ్డి. ఆయన తీసిన ఫొటోలు 2004లో డీకే పబ్లికేషన్ తీసుకొచ్చిన ‘1858 ఫొటోగ్రాఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియా’లో చోటు దక్కించుకున్నాయి. మోస్ట్ సెలబ్రేట్ ఫొటోగ్రాఫర్ల ఫొటోలు ప్రచురించే ఈ సంస్థ అప్పటి ఆంధ్రప్రదేశ్ నుంచి దుగ్గంపూడి రవీందర్‌రెడ్డికి అవకాశం కల్పించింది. ప్రముఖ దినపత్రికల్లో పని చేసిన ఈఫొటో జర్నలిస్ట్ లెన్స్‌లో క్లిక్ అయిన ఓ ఫొటో గురించి ఆయన మాటల్లోనే..
 దుగ్గంపూడి రవీందర్‌రెడ్డి
 ravistudios@gmail.com

 
 1992, డిసెంబర్ 5న అయోధ్య చేరుకున్నా. అప్పటికే అక్కడ లాఠీచార్జీ, పోలీస్ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. గొప్ప ఫొటో జర్నలిస్ట్ నితిన్ రాయ్‌ని కలిసే అవకాశంతోపాటు ఆయన పనితీరు దగ్గరగా చూడొచ్చని నేను అక్కడికి వెళ్లాను. ముందుగా సరయూ నదీ తీరానికి వెళ్లాను. మధ్యాహ్నం అయోధ్య వీధుల్లో కొందరు బాణాలు పట్టుకుని కనిపించారు. సాయంత్రం మళ్లీ నా కెమెరాకు పని చెప్పాను. ఆరో తేదీ ఉదయం మళ్లీ సరయూ నది వరకూ వెళ్లొచ్చాను. ఉదయం 9.30 గంటలకు సుమారు నాలుగైదు లక్షల మంది బాబ్రీ మసీద్ వైపు వెళ్లడం కనిపించింది. అప్పటికే నితిన్ రాయ్.. కెమెరా ఫ్లాష్‌లు కొడుతూనే ఉంది.
 
 కరసేవకుల్లో ఒకరిగా..
 బాబ్రీ మసీదు ప్రవేశ ద్వారం నుంచి కరసేవకులతో కలసి వెళ్లేందుకు ప్రయత్నించాను. వారితో కలసి నినాదాలు చేస్తూ ముందుకు వెళ్లాను. ఇదే సమయంలో నా బ్యాగ్‌లోని కెమెరా తీసి కరసేవకుల ఫొటోలు తీశాను. తర్వాత బాబ్రీ మసీదు వెనుక నుంచి లోపలికి వెళ్లి అటాకింగ్ ఫొటోలు తీశాను. ఇది గమనించిన ఓ కరసేవకుడు నాపై దాడికి దిగాడు. నా బ్యాగ్ లాక్కునే ప్రయత్నం చేశాడు. అతడిని నిలువరించి అయోధ్య రైల్వే స్టేషన్ చేరుకున్నా. మరుసటి రోజు ఫరీదాబాద్‌కు, అక్కడి నుంచి వారణాసి వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నా. ఇండియాటుడే, టైమ్స్ వాళ్లకు నేను తీసిన ఫొటోలిచ్చాను. ఆ పత్రికల్లో ఈ ఫొటోలు ప్రముఖంగా రావడం నాకు ఎంతో పేరును తెచ్చిపెట్టాయి.
 
 టెక్నికల్‌గా..
 ఈ ఫొటోకి నేను వాడిన కెమెరా కెనాన్ ఏ వన్. ఫిక్స్‌డ్ లెన్సెస్. షట్టర్ స్పీడ్ 60. అంతా మాన్యువలే కాబట్టి లైట్ ఎంత ఉండాలో కూడా మాన్యువల్‌గానే అడ్జెస్ట్ చేసి తీశాను.
 
 చాలెంజింగ్ జాబ్..
 ఫొటోగ్రఫీ జర్నలిజం అంటేనే చాలెంజింగ్ జాబ్. ఇందులో రిస్క్ ఎక్కువ. పనిని ఎంత ఆరాధిస్తే అంత ముందుకు వెళ్తారు. ఈ ఫీల్డ్‌లో ఎన్నో కొత్త ప్రాంతాలు, వ్యక్తులను కలిసే అవకాశముంటుంది. సమాజంలో మంచి హోదా లభిస్తుంది. నేను తీసిన ఫొటోలు చూడాలంటే http://www.dravinderreddy.com/లో చూడవచ్చు. ప్రస్తుతం వావ్ హైదరాబాద్ మేగజైన్‌కు ఫొటోలు
 అందిస్తున్నాను.
 -ప్రజెంటర్: వాంకె శ్రీనివాస్

Advertisement
Advertisement