పిల్లల పెళ్లిళ్ల మేళా!


ప్రపంచం ఎంత ముందుకెళ్లినా కొన్ని జాడ్యాలు సమాజాన్ని వదిలిపోవడం లేదు. ముఖ్యంగా చిన్నవయసులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసే దురాచారం ఇంకా కొనసాగుతూనే వుంది. ముక్కుపచ్చలారని పసిపాపలను పెళ్లిపీటలు ఎక్కించే అనాగరిక ఆచారం పూర్తిగా తొలగిపోలేదు. ఆడపిల్లలను అంగడి బొమ్మను చేసి అమ్ముకునే దుస్సంస్కృతి ఆధునిక కాలంలోనూ సాగుతుండడం జాగృత మానవాళికి మాయని మచ్చ.



బాహ్య ప్రపంచానికి బహు దూరంగా ఉండే గిరిజన జాతులు ఎక్కువగా ఇటువంటి దురాచారాలు కొనసాగిస్తున్నాయి. ఇందుకు పశ్చిమ బెంగాల్లోని జంగల్మహల్ ప్రాంతంలో ఉన్న గిరిజనులు నిర్వహిస్తున్న పిల్లల పెళ్లిళ్ల మేళా(చైల్డ్ మ్యారేజ్ ఫెయిర్స్)  ప్రత్యక్ష తార్కాణం. ప్రతి ఏటా తాము జరుపుకునే పండుగ సీజన్లో వీటిని ఏర్పాటు చేస్తుంటారు. మావోయిస్టులను సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో గిరిజనులు వీటిల్లో పాల్గొనడం గమనించాల్సిన విషయం.



ఈ సీజన్లో పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పిల్లల పెళ్లిళ్ల మేళాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. త్వరలో బిన్పూర్ సమీపంలో ఒరగొండ పాటబిందా మేళా జరగనుంది. దీనికి పురూలియా, బాంకురా జిల్లాల నుంచి వేలాది మంది తరలివస్తారు. తమ పిల్లలకు పెళ్లిచేయాలనుకునే ఆడపిల్లల తల్లిదండ్రులు ఇక్కడి వస్తారు. సిల్దా నుంచి బెల్పారీ వరకు 20 కిలోమీటర్ల పరిధిలో జరిగే పెళ్లిళ్ల మేళాల్లో లక్షమందిపైగా గిరిజనులు పాల్గొంటారని అంచనా.  అయితే మావోయిస్టుల భయంతో ఈ ఏడాది మేళాల్లో పాల్గొనే వారి సంఖ్య స్వల్పంగా తగ్గతుందని భావిస్తున్నారు.



మేళాలో తమకు నచ్చిన వరుడిని ఎంపిక చేసుకోమని ఆడపిల్లలకు తల్లిదండ్రులు చెబుతారు. ఈ విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉండదు. కొన్ని సందర్భాల్లో తాము చెప్పిన వాడి మెడలోనే వరమాల వేయాలని తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తారు. సంతాల్, లోధా, ఖేరీ, మహతో తెగలో 12 ఏళ్లు నిండిన బాలికలు వరుడిని ఎంపిక చేసుకునే ఆచారం కొనసాగుతోంది. ఈ తెగలో బాల్యవివాహాలు సర్వసాధారణం. నిరక్షరాస్యత, పేదరికం కారణంగానే ఇటువంటి జరుగుతున్నాయని ఎన్జీవోలు అంటున్నాయి. బాల్య వివాహాల కారణంగా పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో బాలికలు చదువుకు దూరమవుతున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఎన్జీవోలు కోరుతున్నాయి.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top