breaking news
Jangalmahal
-
మే 2 తర్వాత మమత ఆట ముగిసిపోతుంది: మోదీ
పురూలియా: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆట ముగిసిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. దీదీ సర్కార్‌కి రోజులు దగ్గర పడ్డాయని, అసలు సిసలు పరివర్తన ఇక మొదలు కానుందని అన్నారు. ‘‘దీదీ మీరు పదేళ్లు మీ ఆట ఆడారు. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే దీదీ ఖేలా శేష్ హోబె, వికాస్ ఆరంభ్ హోబె (ఆమె ఆట ముగిసిపోతుంది, మా అభివృద్ధి ప్రారంభమవుతుంది)’’అని ప్రధాని అన్నారు. ఈ నెల 27 నుంచి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలు కానున్న నేపథ్యంలో ఆదివాసీ ప్రాంతమైన జంగల్‌మహల్ ప్రాంతంలోని పురూలియాలో గురువారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని తృణమూల్ కాంగ్రెస్ ఖేలా హోబె (ఆట మొదలైంది) నినాదాన్ని ప్రస్తావిస్తూ మాటల తూటాలు విసిరారు. ‘మమత ఎన్నికల ర్యాలీలో తరచూ ఆట మొదలైంది అని అంటూ ఉంటారని ఆమెకు ఆట మొదలైందేమో కానీ బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, విద్య, మహిళా సాధికారత, ఉద్యోగాలు, పక్కా ఇళ్లు, సురక్షిత నీరు, ఇంటింటికీ కుళాయిలు అన్నీ మొదలవుతాయని ప్రధాని గట్టిగా చెప్పారు. కట్ మనీ ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతి బురదలో కూరుకుపోయిందని ప్రధాని ఆరోపించారు. కమీషన్లు లేనిదే ప్రభుత్వం పని చేయడం లేదని, అధికార పార్టీ చేస్తున్న ఈ దోపిడీ వల్ల దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన వర్గాలు అధికంగా నష్టపోతున్నారని అన్నారు. భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన ప్రధాని మధ్య మధ్యలో బెంగాలీలో కొన్ని వాక్యాలు మాట్లాడుతూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘‘మీరు చాలా కాలంగా ప్రజల్ని అణచివేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో మిమ్మల్ని ఓడిస్తాం’’అని సభికుల హర్షధ్వానాల మధ్య బెంగాలీలో చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పదానికి ప్రధాని కొత్త అర్థాన్ని ఇచ్చారు. టీఎంసీ అంటే ట్రాన్స్ఫర్ మై కమిషన్ అని అభివర్ణించారు. కేంద్రం డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానాన్ని అనుసరిస్తూ ఉంటే, తృణమూల్ కాంగ్రెస్ ట్రాన్స్ఫర్ మై కమిషన్ అంటోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా ధనాన్ని లూటీ చేసే మావోయిస్టులను మమత సర్కార్ పెంచి పోషిస్తోందని మోదీ ఆరోపించారు. కేంద్ర నిధులన్నీ స్వాహా వెనుకబడిన ప్రాంతాలకి, వర్గాలకి కేంద్రం అందించే నిధులేవీ మమత ప్రజలకు ఇవ్వడం లేదని ప్రధాని ఆరోపించారు. ‘కేంద్రం పక్కా గృహాల కోసం నిధులు ఇచ్చింది. టీఎంసీ సర్కార్ దానిని స్వాహా చేసింది. నిరుపేదలకు తక్కువ ధరకే బియ్యం పంపాం. టీఎంసీ దోపిడీదారులు దానిని మింగేశారు. లాక్డౌన్ సమయంలో ఉచిత బియ్యం ఇచ్చాం. దీదీ సర్కార్ వాటిని బొక్కేసింది. అంఫాన్ తుపాను సమయంలోనూ అదే తీరు. రైతన్నలు, సాంతాల్ గిరిజనులు సాయం కోసం ఆశగా ఎదురు చూశారు. వారిపై మమత కురిపించలేదు’’అనివిమర్శించారు. మమత తన ఆటలో తాను మునిగితేలిపోతున్నారని, దీంతో ఈ గిరిజన ప్రాంతానికి పరిశ్రమలు రావడం లేదని, నీళ్లు లేక వ్యవసాయం సంక్లిష్టంగా మారి ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ జనం వలస బాట పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే వలసల్ని అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. -
పిల్లల పెళ్లిళ్ల మేళా!
ప్రపంచం ఎంత ముందుకెళ్లినా కొన్ని జాడ్యాలు సమాజాన్ని వదిలిపోవడం లేదు. ముఖ్యంగా చిన్నవయసులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసే దురాచారం ఇంకా కొనసాగుతూనే వుంది. ముక్కుపచ్చలారని పసిపాపలను పెళ్లిపీటలు ఎక్కించే అనాగరిక ఆచారం పూర్తిగా తొలగిపోలేదు. ఆడపిల్లలను అంగడి బొమ్మను చేసి అమ్ముకునే దుస్సంస్కృతి ఆధునిక కాలంలోనూ సాగుతుండడం జాగృత మానవాళికి మాయని మచ్చ. బాహ్య ప్రపంచానికి బహు దూరంగా ఉండే గిరిజన జాతులు ఎక్కువగా ఇటువంటి దురాచారాలు కొనసాగిస్తున్నాయి. ఇందుకు పశ్చిమ బెంగాల్‌లోని జంగల్‌మహల్ ప్రాంతంలో ఉన్న గిరిజనులు నిర్వహిస్తున్న పిల్లల పెళ్లిళ్ల మేళా(చైల్డ్ మ్యారేజ్ ఫెయిర్స్) ప్రత్యక్ష తార్కాణం. ప్రతి ఏటా తాము జరుపుకునే పండుగ సీజన్లో వీటిని ఏర్పాటు చేస్తుంటారు. మావోయిస్టులను సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో గిరిజనులు వీటిల్లో పాల్గొనడం గమనించాల్సిన విషయం. ఈ సీజన్లో పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పిల్లల పెళ్లిళ్ల మేళాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. త్వరలో బిన్పూర్ సమీపంలో ఒరగొండ పాటబిందా మేళా జరగనుంది. దీనికి పురూలియా, బాంకురా జిల్లాల నుంచి వేలాది మంది తరలివస్తారు. తమ పిల్లలకు పెళ్లిచేయాలనుకునే ఆడపిల్లల తల్లిదండ్రులు ఇక్కడి వస్తారు. సిల్దా నుంచి బెల్పారీ వరకు 20 కిలోమీటర్ల పరిధిలో జరిగే పెళ్లిళ్ల మేళాల్లో లక్షమందిపైగా గిరిజనులు పాల్గొంటారని అంచనా. అయితే మావోయిస్టుల భయంతో ఈ ఏడాది మేళాల్లో పాల్గొనే వారి సంఖ్య స్వల్పంగా తగ్గతుందని భావిస్తున్నారు. మేళాలో తమకు నచ్చిన వరుడిని ఎంపిక చేసుకోమని ఆడపిల్లలకు తల్లిదండ్రులు చెబుతారు. ఈ విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉండదు. కొన్ని సందర్భాల్లో తాము చెప్పిన వాడి మెడలోనే వరమాల వేయాలని తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తారు. సంతాల్, లోధా, ఖేరీ, మహతో తెగలో 12 ఏళ్లు నిండిన బాలికలు వరుడిని ఎంపిక చేసుకునే ఆచారం కొనసాగుతోంది. ఈ తెగలో బాల్యవివాహాలు సర్వసాధారణం. నిరక్షరాస్యత, పేదరికం కారణంగానే ఇటువంటి జరుగుతున్నాయని ఎన్జీవోలు అంటున్నాయి. బాల్య వివాహాల కారణంగా పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో బాలికలు చదువుకు దూరమవుతున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఎన్జీవోలు కోరుతున్నాయి.