నగర చిత్రపటంపై చెరగని ముద్ర

నగర చిత్రపటంపై చెరగని ముద్ర - Sakshi


ప్రముఖ నిర్మాత డి.రామానాయుడికీ, హైదరాబాద్ నగరానికీ బలమైన అనుబంధం ఉంది. సినిమా కెరీర్ ప్రథమార్ధమంతా మద్రాసులో, ద్వితీయార్ధమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. తెలుగు సినిమా రంగం మద్రాసు నుంచి హైదరాబాద్‌కు పూర్తిగా మారాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ మార్పును వేగవంతం చేసిన వారిలో రామానాయుడు ఒకరు. జూబ్లీహిల్స్‌లో ఆయన నిర్మించిన రామానాయుడు స్టూడియో ఇవాళ తెలుగు చిత్ర నిర్మాణానికి ఒక ల్యాండ్‌మార్క్. ఆ తరువాత హైదరాబాద్ శివార్లలో నానక్‌రామ్‌గూడ దగ్గర ‘రామానాయుడు సినీ విలేజ్’తో స్టూడియోను విస్తరించారు.

 ..:: రెంటాల జయదేవ

 

జూబ్లీహిల్స్‌లో స్టూడియో నిర్మాణానికి ఆయన నడుంకట్టిన తొలిరోజుల్లో జూబ్లీహిల్స్‌లోని ఆ స్థలం కొండలు, గుట్టలతో జనావాసాలకు దూరంగా ఉండేది. ఆ సంగతులను ఆయనే ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూ.. ‘భవనం వెంట్రామిరెడ్డి గారు ముఖ్యమంత్రిగా, వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు స్టూడియోల నిర్మాణానికి పద్మాలయా వారికీ (హీరో కృష్ణ), నాకూ స్థలం కేటాయించారు. రెండు పెద్ద రాళ్ళ గుట్టలు ఇచ్చేసి, స్టూడియో కట్టమంటారేమిటని నవ్వుకున్నారు అందరూ’ అని రామానాయుడు అనేవారు. అయితే, మట్టిని బంగారంగా మార్చిన హైదరాబాద్‌లోని స్టూడియో అంటేనే రామానాయుడుకు ప్రత్యేక అభిమానం.

 

భవిష్యత్‌ను ఊహించి...



ఇవాళ సినిమా వాళ్ళందరికీ చిరునామాగా మారిన ఫిల్మ్‌నగర్ కూడా రామానాయుడు హస్తవాసితో అభివృద్ధి అయ్యిందే. హైదరాబాద్‌లో ఫిల్మ్‌నగర్ కో-ఆపరేటివ్ సొసైటీ పెట్టి, ఇళ్ళస్థలాలు ఇచ్చినా 1980లలో బతిమలాడినా ఎవరూ సభ్యత్వం తీసుకొనేవారు కాదు. ఆ సమయంలో సీనియర్ నిర్మాత డి.వి.ఎస్. రాజు సలహా మేరకు రామానాయుడు తన పేరుపై, తన పిల్లలు సురేష్‌బాబు, వెంకటేశ్ పేర్లపై మూడు సభ్యత్వాలు తీసుకున్నారు. అప్పట్లో అక్కడ ‘ప్రతాప్ ఆర్ట్స్’ రాఘవలాంటి ఒకరిద్దరి ఇళ్ళే ఉండేవి.



తరువాత అక్కడ ఇల్లు కట్టింది రామానాయుడే. అక్కడే సురేష్‌బాబు స్థలంలో ‘సురేష్ గెస్ట్‌హౌస్’ నిర్మించారు. హైదరాబాద్‌లో తాను నిర్మిస్తున్న తెలుగు, హిందీ సినిమాలకు మద్రాసు, బొంబాయి నుంచి వచ్చే నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆ గెస్ట్‌హౌస్‌లోనే విడిది అని షరతు పెట్టారు. లక్షల రూపాయల స్టార్‌హోటళ్ళ ఖర్చును ఆదా చేసి, నిర్మాణ వ్యయాన్ని నియంత్రణలో ఉంచి, సిసలైన నిర్మాత అనిపించుకున్నారు. అనిల్‌కపూర్, రేఖ, మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్, టబు, దివ్యభారతి లాంటి అప్పటి టాప్ స్టార్లంతా ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో బిజీ కూడలిగా మారిన ఆ గెస్ట్‌హౌస్‌లో ఉన్నవారే!

 

రాళ్లల్లో.. గుట్టల్లో...



రామానాయుడు స్టూడియో నిర్మాణం కాక ముందే అక్కడ చిత్ర నిర్మాణం మొదలైంది. వెంకటేశ్ హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మించిన ‘బ్రహ్మపుత్రుడు’ (1988) చిత్రాన్ని నిర్మిస్తూ, జూబ్లీహిల్స్‌లోని స్టూడియో స్థలంలో రాళ్ళగుట్ట మీద పెద్ద కాలనీ సెట్ వేయించారు రామానాయుడు. ఆ స్టూడియో స్థలంలో జరిగిన తొలి షూటింగ్ అదే. ఆ సినిమా తెచ్చిన లాభాలు, ఆ తరువాత వచ్చిన హిట్లే ఆ రాళ్ళ గుట్టలో సుందరమైన స్టూడియో వెలిసేందుకు దోహదపడ్డాయని రామానాయుడు చెబుతుండేవారు.



1990ల దశకంలో సూపర్‌హిట్ల ద్వారా సంపాదించిన సొమ్మంతా స్టూడియో నిర్మాణానికే వెచ్చించారాయన. ల్యాబ్, రికార్డింగ్ థియేటర్, డబ్బింగ్, ప్రివ్యూ థియేటర్ల లాంటి సమస్త సదుపాయాలతో తన కలల సౌధం నిర్మించారు. మునుపటి రాళ్ళగుట్టతో ఆ స్టూడియోను పోల్చి చూసినప్పుడల్లా తన మనసు సంతోషంతో నిండిపోతుందని రామానాయుడు ఎప్పుడూ చెబుతుండేవారు. స్టూడియో మీద, ఆ పరిసరాల మీద ఆయనకు ఎంత ప్రేమంటే... ప్రతిరోజూ ఆయన స్టూడియోకు వెళ్లి ఆ పరిసరాలను కళ్ళారా చూడాల్సిందే, స్టూడియో వ్యవహారాలు కనుక్కోవాల్సిందే!



చివరకు క్యాన్సర్‌తో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉన్నా సాయంత్రం కాసేపు స్టూడియోకు వచ్చి వెళ్ళేవారంటే ఆయన ప్రేమను అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు పూర్తిగా షిఫ్టయ్యే సమయానికి రామానాయుడు స్టూడియో, నానక్‌రామ్ గూడ సినీ విలేజ్‌లతో నగర చిత్రపటంపై సినిమా రంగ ప్రాథమిక వసతులను స్థిరీకరించిన దార్శనికుడిగా రామానాయుడు నిలిచిపోతారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top