ఖల్‌నాయక్.. | Amir Ali thaggu the only Banjara Hills | Sakshi
Sakshi News home page

ఖల్‌నాయక్..

Apr 21 2015 12:07 AM | Updated on Sep 3 2017 12:35 AM

ఖల్‌నాయక్..

ఖల్‌నాయక్..

చార్మినార్ కేంద్రంగా నూతన నగరం ఏర్పడిన తర్వాత నగరం గురించి చెప్పిన...

చార్మినార్ కేంద్రంగా నూతన నగరం ఏర్పడిన తర్వాత నగరం గురించి చెప్పిన వారిలో అమీర్‌అలీ  మూడో తరానికి చెందినవాడు. ఈ థగ్గు ప్రత్యేకత ఏమిటి? ముందు తరాలు చెప్పిన ‘ఉద్యానవన నగరి’ వైనాలు నిజమేనని ధ్రువీకరించుకున్నాం.‘రోమాంచిత సాహసాలు’ ఇతడికే ప్రత్యేకం!
 

అమీర్ అలీ అనే థగ్గు మాత్రమే బంజారాహిల్స్‌ను తొలిసారి వర్ణించాడు. ‘కుడివైపున కఠిన శిలల గుట్టలు. ఎడమవైపు మైదానప్రాంతం. ఆకాశంలో కలుస్తోందా అన్నట్టు ఆ మైదానం చాలా విశాలంగా ఉంది. మధ్యలో చిన్నిలోయ. అక్కడో నది (మూసి). తీరం వెంబడి అడవిని తలపించే వృక్షాలు. మధ్యలో సూర్యకాంతిలో తెల్లటి నివాసాలు. ధగధగా మెరుస్తున్నాయి. వీటన్నిటి మధ్య వీటన్నికంటే ఎత్తులో చార్మినార్.. పక్కనే మక్కామసీదు.. తలెత్తుకుని నిల్చున్నాయి. నూరు చిన్నచిన్న మసీదులు శ్వేతవర్ణంలో కాంతులీనుతున్నాయి. దూరం నుంచి ఈ నగరం చొరబడలేని అడవి. దగ్గరకు చేరేకొద్దీ తోటలు. తీర్చిదిద్దినట్టు.. వీధులు,నివాసాలు. దూరం నుంచి చూస్తే.. ఇక్కడ నరమానవులు ఉన్నారా..? అని అనిపించేది. నగరంలోకి ప్రవేశిస్తే తెలిసింది.. ఇది చిక్కని జనసముద్రం!  చార్-మినార్‌ల మొనలు మేఘాలను చీల్చుకుని ఆకాశాన్ని అందుకున్నాయి. ఈ ఒక్క దర్శనం చాలు. ఢిల్లీ నుంచి వచ్చిన ఫలితం దక్కింది’ అని హైదరాబాద్ గురించి రాసుకున్నాడు అమీర్ అలీ.
 
బందీని విడిపించాడు!
కుతుబ్‌షాహీ సమాధులను తొలిసారి వర్ణించిన క్రెడిట్ కూడా అమీర్‌అలీదే!  ఇక్కడకు రావడంలో ‘అందం’ ఉంది.‘ప్రతాపం’ ఉంది. అమీర్ అలీ గుర్రంపై అటుగా వెళ్తున్నాడు. అజీమా అనే అందమైన యువతి బాల్కనీలో విశ్రాంతిగా కన్పించింది. ఓ ముసలి, వ్యసనపరుడు ఆమెను ఇంటి బందీని చేశాడు! అమీర్‌అలీని అజీమా చూపులు కలిశాయి. సహాయకురాలిని అమీర్‌అలీ దగ్గరకు పంపింది, విముక్తం చేయాలని కోరుతూ!  కథను క్లుప్తం చేస్తే, వాళ్లు లేచిపోదామనుకుంటారు. మరుసటి రోజు ఉదయం కుతుబ్‌షాహీ సమాధుల దగ్గరలోని షావలీ దర్గా దగ్గర కలుసుకోవాలని అనుకుంటారు. అనుకున్న వేళకు అమీర్ అలీ వచ్చేస్తాడు.

అజీమాకు ఆలస్యం అవుతుంది. దిక్కులు చూస్తోన్న అమీర్‌అలీకి దర్గా కుడివైపు కుతుబ్‌షాహీ సమాధులు కనిపిస్తాయి. కొంచెం దూరం నుంచి చూసి చెప్పినా ‘కుతుబ్‌షాహీలు శాశ్వతనిద్రపోతున్న అచ్చోట అడవి పావురాళ్లూ, గబ్బిలాలు చేసే సవ్వడిని పెద్దపెద్ద గుమ్మటాలు ప్రతిధ్వనిస్తున్నాయి. అక్కడి శబ్దమూ, నిశ్శబ్దమూ, వెలుతురూ, చీకటి చిత్రమైన భావాలను కలిగించాయి’ అని అన్నాడు.
 
బంధం తెంచుకుంది!
కొంచెం ఆలస్యంగానైనా అజీమా అనుకున్న చోటికి వచ్చింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పిల్లవాడిని కన్నారు. చాలా సుఖంగా జీవించారు. పదేళ్లు రివ్వున గడిచాయి. అమీర్ అలీ పట్టుబడ్డాడు! జైలు పాలయ్యాడు! అజీమా ఎటువంటి మానసికస్థితికి లోనైఉంటుంది..? రోజుకు పలుమార్లు ‘దిగ్భ్రాంతి’ చెందినట్లుగా ప్రకటనలు ఇచ్చే ‘పెద్దవాళ్ల’లా కాదు, ఆమె నిజంగానే దిగ్భ్రాంతి చెందింది! తనను రక్షించిన కథానాయకుడు థగ్గు అని.. చుక్కనెత్తురు చిందకుండా వందల మందిని హత్యచేశాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఆత్మహత్య చేసుకుంది!
ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఫోన్ నంబర్: 7680950863

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement