అదిరేటి డ్రెస్సులు.. అలరించే డిజైన్లు

Fashion Trends In Weddings - Sakshi

పెళ్లి వేడుకల్లో ఫ్యాషన్‌ పదనిసలు

రూ.లక్షలు ఖర్చుపెడుతున్నసెలబ్రిటీలు

ముంబై డిజైనర్లతో డ్రెస్సుల తయారీ

సిటీ నుంచీ పుట్టుకొస్తున్న డిజైనర్లు

మధ్యతరగతికీ పాకిన ‘వెడ్డింగ్‌ ఫ్యాషన్‌’

పెళ్లి వేడుకల్లో ఫ్యాషన్‌ అగ్రతాంబూలం అందుకుంటోంది. వెడ్డింగ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాస్ట్‌లీ వెడ్డింగ్‌లకు కేరాఫ్‌ మారిన మన నగరం... వేడుకలో ధరించేదుస్తులకు అంతే ప్రాధాన్యమిస్తోంది. రూ.లక్షల్లో ఖర్చు చేస్తోంది. జాతీయ డిజైనర్లనుసంప్రదిస్తోంది. సిటీ సెలబ్రిటీల పెళ్లిళ్లను గమనిస్తే ఈ విషయం అవగతమవుతుంది. 

పింకీ‘సన్‌’దడి... డిజైనర్స్‌ రారండి  
సిటీ సోషలైట్‌ పింకీరెడ్డి–సంజయ్‌రెడ్డి కుమారుడు కేశవ్‌రెడ్డి పెళ్లి సుబ్బరామిరెడ్డి మనవరాలితో జరిగిన విషయం విదితమే. ఈ వేడుకకు రణ్‌వీర్‌సింగ్, రవీనాటండన్, శిల్పాశెట్టి తదితర ముంబై తారాగణమంతా దిగింది. నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకలో పెళ్లి కూతురి చీరలు, గాగ్రా చోళీలు.. వరుడు ధరించిన షేర్వానీ, సూట్స్‌ అసాధారణ డిజైన్లతో ఆహూతులను కట్టి పడేశాయి. అవును మరి.. దేశంలోనే టాప్‌ డిజైనర్లుగా పేరొందిన మనీష్‌మల్హోత్రా, సబ్యసాచి, తరుణ్‌ తహ్లియానీ, రోహిత్‌బాల్, నీతాలుల్లా, నిషికాలుల్లా లాంటి మహామహులు తీర్చిదిద్దినవి ఇవి. వధూవరులకే కాదు.. ఏకంగా కుటుంబం మొత్తానికీ తమదైన హంగులు అద్దారు వీరు. రోహిత్, శంతను–నిఖిల్‌ సంగీత్, రిసెప్షన్‌ కోసం సంప్రదాయ దుస్తులకు తమదైన ప్రత్యేకతను జోడించారు. వీరి కూతురు మల్లికారెడ్డి పెళ్లి వేడుక సమయంలోనూ ముంబై నుంచి వచ్చిన అతిథుల జాబితాకే కాదు... ప్రఖ్యాత డిజైనర్లు తీర్చిదిద్దిన డ్రెస్సులూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచాయి.  

సల్లూ భయ్యా.. అదిరిందయ్యా  
సల్మాన్‌ఖాన్‌ తన సోదరి అర్పితాఖాన్‌ వివాహ వేడుకను సిటీలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్‌ డిజైనర్లు పనిచేశారు. అర్పితాఖాన్‌ ధరించిన గ్రాండ్‌ లెహెంగా డ్రెస్‌ని ప్రముఖ డిజైనర్లు అబుజానీ, సందీప్‌ఖోస్లాతో డిజైన్‌ చేయించారు. ఈ డ్రెస్‌ ధరించిన అర్పితా తన లుక్‌తో ఆహూతులను కట్టిపడేసింది. వేడుకలో రెండో కాస్ట్యూమ్‌గా క్రీమ్, పింక్‌ కాంబినేషన్‌లతో డిజైన్‌ చేసిన దుస్తులను ఢిల్లీ డిజైనర్‌ అనితాడోంగ్రేతో డిజైన్‌ చేయించారు.  

ఫ్యామిలీ ‘షో’
ఒకప్పుడు పెళ్లంటే వధూవరులే ప్రత్యేకం. ఇప్పుడు మాత్రం సకుటుంబ సపరివారంగా డిజైనర్‌ దుస్తులతో  సిద్ధమవుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కూతురిని మించి తల్లి.. కొడుకును మించి తండ్రి అన్నట్టు డిజైనింగ్‌ దుస్తులతో అదరగొట్టేస్తున్నారు. దీంతో ఇది డిజైనర్లకు మరింత కలిసొచ్చే ట్రెండ్‌ అయింది. ‘ఇప్పుడు పెళ్లి దుస్తులను ఒక్క వధూవరులకే కాకుండా కుటుంబసభ్యులు మొత్తం డిజైన్‌ చేయించుకుంటూ, పూర్తి ప్యాకేజ్‌ ఆర్డర్‌ ఇస్తున్నారు. దీంతో ఒక పెళ్లి వర్క్‌ అంటే కనీసం 15 రోజులపైనే పడుతోంద’ని నగరానికి చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ సంతోష్‌కుమార్‌ చెప్పారు. అంతేకాదు కుటుంబసభ్యులు మొత్తం ఒకే తరహాలో డిజైన్‌ చేయించుకునే థీమ్‌ డ్రెస్సింగ్‌ కూడా ఇప్పుడు సిటీలో ట్రెండ్‌గా మారింది.  

లక్షల్లో... కోట్లలో...
నటి సమంత ఎంగేజ్‌మెంట్‌కు రూపొందించిన ఒక్క లెహెంగాకే రూ.15లక్షల వరకు వెచ్చించినట్టు సమాచారం. అదే విధంగా పింకీరెడ్డి కుమారుడి పెళ్లి వేడుకల కోసం రూపొందించిన దుస్తుల ఖర్చు రూ.కోట్లలోనే ఉంటుందని ఫ్యాషన్‌ పరిశ్రమ వర్గాల అంచనా. ఓ వైపు ఖరీదైన వేడుకల్లో దుస్తుల వ్యయం ఇలా పెరిగిపోతుంటే.. మరోవైపు డిజైనర్‌ దుస్తులను సామాన్యుల దరికి చేర్చే మార్కెట్‌ ప్లాన్‌లూ ఊపందుకున్నాయి. ‘మొత్తం పెళ్లి దుస్తుల ఖర్చును ఇప్పుడు రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు వెచ్చించడానికి మధ్య తరగతి సైతం సిద్ధపడుతోంద’ని ఫ్యాషన్‌ రంగ నిపుణులు రూపేష్‌ చెప్పారు. సాధారణంగా డిజైనింగ్‌ దుస్తుల ఖరీదు కనీసం రూ.50,000ల నుంచి మొదలై ఆ తర్వాత పిండికొద్ది రొట్టె అన్నట్టుగా ఉంటుందని వీరంటున్నారు.

మిడిల్‌ క్లాస్‌కీ..   
మధ్యతరగతి ప్రజలకు వైవిధ్యభరితమైన వెడ్డింగ్‌ ఫ్యాషన్‌ను చేరువ చేసే క్రమంలో డిజైనర్లు తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. దీనికి అనుగుణంగానే ఇప్పుడు మధ్య తరగతి పెళ్లి వేడుకల్లో సైతం దోవతీలు పోయి.. డిజైనర్‌ పంచెలు రాజ్యం చేస్తున్నాయి. తక్కువ ఖరీదులోనే షేర్వానీలు, వెడ్డింగ్‌ గౌన్‌లు సైతం అందుబాటులోకి వస్తున్నాయి.

దేనికదే ప్రత్యేకం..  
పెళ్లి అంటే ఒక వేడుక కాదు.. కొన్ని వేడుకల కలయిక. విభిన్న సందర్భాల సంబరం. పెళ్లి నిర్ణయించిన దగ్గర మొదలుపెడితే ప్రీ వెడ్డింగ్‌ షూట్, బ్యాచిలర్‌ పార్టీ, బ్రైడల్‌ షవర్, ఎంగేజ్‌మెంట్, సంగీత్, వివాహం, రిసెప్షన్, వ్రతం, హనీమూన్‌... ఇలా దాదాపు 10 వరకు విభిన్న వేడుకల సమాహారంగా పెళ్లిని చూస్తున్నారు నగరవాసులు. దీనికి తగ్గట్టే సందర్భోచితంగా దుస్తులను డిజైన్‌ చేయిస్తున్నారు. బ్యాచిలర్‌ పార్టీకి ఓ రకంగా, హనీమూన్‌కి మరో రకంగా... ఇలా ఆయా సందర్భాలకు, మూడ్స్‌కు అనుగుణంగా దుస్తులు డిజైన్‌ చేయించుకుంటున్నారు. 

సిటీ డిజైనర్ల పాత్ర..  
సెలబ్రిటీల పెళ్లిళ్లకు ముంబై, ఢిల్లీ తదితర నగరాల నుంచి డిజైనర్లు దిగుమతవుతుంటే... మేం మాత్రం తక్కువనా అన్నట్టు సిటీ డిజైనర్లు తమదైన స్థాయిలో పెళ్లి దుస్తులను తీర్చిదిద్దుతున్నారు.  ఇప్పటికీ సిటీ సెలబ్రిటీ ఫ్యామిలీలు ఇతర మెట్రోల నుంచి డిజైనర్లను రప్పించడానికే ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ... ఇప్పుడిప్పుడే సిటీ డిజైనర్లను కాస్త పలకరిస్తున్నారు. పింకీ కుమారుడి పెళ్లిలో సిటీ డిజైనర్లు ఆనంద్‌ కబ్రా, శ్రవణ్‌కుమార్‌ సైతం తమవంతుగా పాలుపంచుకోవడం దీనికో ఉదాహరణ.

శామ్స్‌.. డిజైనర్‌ డ్రీమ్స్‌  
హీరో నాగచైతన్య, నటి సమంత (శామ్స్‌) జంట ఫ్యాషన్‌ప్రియులు కావడంతో తమ పెళ్లి దుస్తుల డిజైనింగ్‌కు చాలా ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యంగా సమంత తన ఎంగేజ్‌మెంట్‌ కోసం సృష్టించిన లవ్‌స్టోరీ లెహెంగా అయితే టాక్‌ ఆఫ్‌ ది ఫ్యాషన్‌ వరల్డ్‌ అయింది. దీని మీద చైతూతో తన ప్రేమకథను అందంగా చెక్కించిన సమంత... పెళ్లి దుస్తుల కోసం కూడా లెహెంగానే డిజైన్‌ చేసిన ముంబై డిజైనర్‌ క్రేషా బజాజ్‌నే ఎంచుకుంది. ‘సమంత అంటేనే ఫ్యాషన్‌కి సింబల్‌ అని పేరుంది. ఆ అంచనాలకు తగ్గకుండా, అదే సమయంలో తమ ప్రేమలోని గాఢతను కూడా తెలియజెప్పేందుకు శామ్స్‌ లెహెంగాను విభిన్నంగా డిజైన్‌ చేయించార’ని చెప్పారు ఆమె వ్యక్తిగత స్టైలిస్ట్‌ నీరజ కోన. 

మంచి ‘తరుణ్‌’ం మించిన దొరకదు..  
అనుకుంటూ తమ పెళ్లి కోసం టాప్‌ డిజైనర్‌ తరుణ్‌ తహిల్యానీకి ఓటేశారు హీరో రామ్‌చరణ్‌. ఆయన పెళ్లికి ప్రత్యేకంగా ముంబై నుంచి తరుణ్‌ బృందం తరలివచ్చింది. ‘తరుణ్‌ తహిల్యానీ మా కుటుంబానికి బాగా దగ్గరివాడు కావడంతో ఆయన్నే మా పెళ్లి దుస్తుల డిజైనింగ్‌కి ఎంచుకున్నాం. అంతేకాకుండా ఆయన మా ఎంగేజ్‌మెంట్‌ కోసం రూపొందించిన దుస్తులు నాకు బాగా నచ్చాయి. ఆయన డిజైనింగ్‌ వర్క్‌ నాకు చాలా ఇష్టం. ఇక వేరే పేరే నాకు తట్టలేదు’ అని చెప్పారు ఉపాసన.  

మేమూ చేస్తున్నాం...  
నగరవాసుల్లో ఫ్యాషన్‌పై ఆసక్తి పెరగడానికి సెలబ్రిటీలే కారణమనడం లో సందేహం లేదు. దీంతో వెడ్డింగ్‌ సీజన్‌లో మాకు చేతినిండా పని ఉంటోంది. అయితే సెలబ్రిటీల పెళ్లిలకు డిజైనర్లు దిగుమతవుతుండ డం గతంతో పోలిస్తే తగ్గింది. ఇటీవల రెండు రాజకీయ కుటుంబాల పెళ్లిళ్లకు నేను దుస్తులు అందించడమే దీనికి ఉదాహరణ. ఈ ట్రెండ్‌ ఇంకా పుంజుకోవడం తథ్యం.         – శశి వంగపల్లి, సిటీ డిజైనర్‌

సిటీ క్లయింట్లు ఎక్కువే..  
 శృతిహాసన్, కాజల్‌ లాంటి తారలు నాకు క్లయింట్స్‌గా ఉన్నారు. పెళ్లిళ్లకు అటెండ్‌ అవడానికి, ఇంకేవైనా ప్రైవేట్‌ ఫంక్షన్లకు వారికి డ్రెసెస్‌ డిజైన్‌ చేయడం కోసం మమ్మల్ని సంప్రదిస్తుంటారు. తరచూ వెడ్డింగ్‌ సీజన్‌లో హైదరాబాద్‌లో మా కలెక్షన్‌ను ప్రదర్శిస్తుండడానికి అదో కారణం.    – అర్పిత, ముంబై డిజైనర్‌

Read latest Fashion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top