జెన్ గురువుతో మల్లయుద్ధం | Zen master wrestling | Sakshi
Sakshi News home page

జెన్ గురువుతో మల్లయుద్ధం

Jun 5 2014 10:36 PM | Updated on Sep 2 2017 8:21 AM

జెన్ గురువుతో మల్లయుద్ధం

జెన్ గురువుతో మల్లయుద్ధం

ఆయనో అసలు సిసలు జెన్ గురువు. చూడ్డానికి బక్కపల్చగా కనిపించినా ఆయన మల్లయుద్ధంలోనూ పట్టున్న వ్యక్తి. అసామాన్యులు. ఆయన ఉన్న ఊళ్లోనే మరో మల్లయుద్ధ వీరుడున్నాడు.

 జెన్ పథం
 
ఆయనో అసలు సిసలు జెన్ గురువు. చూడ్డానికి బక్కపల్చగా కనిపించినా ఆయన మల్లయుద్ధంలోనూ పట్టున్న వ్యక్తి. అసామాన్యులు. ఆయన ఉన్న ఊళ్లోనే మరో మల్లయుద్ధ వీరుడున్నాడు. అతను మల్లయుద్ధంలో ప్రావీణ్యుడే కానీ కోపిష్టి. అనవసరంగా అందరితో చీటికీ మాటికీ గొడవ పడుతుండే వాడు.
 
ఆ ఊళ్లో వాళ్లందరూ ఎంత సేపూ అసలు సిసలు గురువును చూడ్డానికే వెళ్లి తమకున్న సందేహాలను నివృత్తి చేసుకునే వారు. అది ఆ కోపిష్టి మల్లయుద్ధ వీరుడికి నచ్చలేదు. జెన్ గురువుపై ఈర్ష్యాద్వేషాలు ఎక్కువయ్యాయి. ఆయనను ఎలాగైనా దెబ్బతీయాలనుకున్నాడు. ఊరి ప్రజల మనస్సు మళ్లించడం కోసం గురువుగారిపై లేనివీపోనివీ చెప్పి ఎవరినీ ఆయన వద్దకు వెళ్లవద్దని వారించాడు. కానీ ఎవరూ అతని మాటలు లె క్క చేయలేదు. అసలు సిసలు గురువుదగ్గరకు వెళ్లి రావడం మానలేదు. దాంతో ఇక లాభం లేదనుకుని ఆ కోపిష్టి నేరుగా తనే గురువుగారున్న ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ వాకిట్లో నిల్చుని ఆ దారిన వచ్చీపోయే  వారందరికీ వినిపించేలా గురువుగారిని తిట్టడం మొదలుపెట్టాడు.
 
‘‘నువ్వు అసలుసిసలు గురువువి అయితే లోపలి నుంచి బయటకు రా....ఎవరికో నీతులూ చెప్పడం కాదు... నన్ను ఎదుర్కో... నాతో తలపడు... మనిద్దరిలో ఎవరు గొప్పో ఈ ఊరి ప్రజలకు తెలియాలి’’ అని నానా మాటలు పెద్ద పెద్దగా అన్నాడు. అతని మాటలు విన్న గురువుగారు ఏమీ చెక్కుచెదరలేదు. దాంతో శిష్యులు బాధ పడ్డారు.
 
‘‘ఏమిటి గురువుగారూ, అతను అన్నేసి మాటలు అంటుంటే మీరే దీ పట్టనట్టు ఉన్నారు. మీరు మామూలు గురువుగారు కాదు కదా. మల్లయుద్ధంలోనూ పట్టున్నవారు. మీరు తలచుకుంటే అతన్ని సులభంగా నేలకూల్చవచ్చు’’ అని శిష్యులు ముక్తకంఠంతో చెప్పుకొచ్చారు.
 
వారు చెప్పిన మాటలన్నీ విన్న గురువుగారు ఏ మాత్రం రెచ్చిపోలేదు. పెపైచ్చు ఓ చిన్న నవ్వు నవ్వారు. ఆయనేదీ విననట్టే మిన్నకుండిపోయారు.
 
ఆయన నుంచి ఎటువంటి ప్రతిస్పందనా లేకపోవడంతో కోపిష్టి మరింత రెచ్చిపోయాడు. ఆయనపై అవాకులూ చవాకులూ వాగి వాగి అలసిపోయాడు. గొంతెండిపోయింది. నోరు పెగల్డం లేదు. అతను అక్కడ నిలవలేకపోయాడు. డీలాపడిన కోపిష్టి ఏ మాత్రం అరవలేక అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయాడు.
 
అప్పుడు అసలు సిసలు గురువుగారు నాలుగే నాలుగు మాటలన్నారు. అవేమిటంటే....
 ‘‘ఎలా ఉంది నా మల్లయుద్ధం?’’ అని.
 
ఇక్కడ గురువుగారికి మౌనమే ఆయుధమై కోపిష్టిని మానసికంగా శారీరకంగా దెబ్బతీసిందన్న వాస్తవాన్ని శిష్యులు గ్రహించి ఆవేశానికి ఆవేశం, ద్వేషానికి ద్వేషం జవాబు కాదని తెలుసుకున్నారు.
 
- యామిజాల జగదీశ్
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement