
స్లిప్పర్స్‌తో ప్రపంచ కప్పు!
క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొనాలంటే ఏం కావాలి?ఒక మంచి క్రికెట్ బ్యాట్..
మారథాన్
క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొనాలంటే ఏం కావాలి?ఒక మంచి క్రికెట్ బ్యాట్... నీ ప్యాడ్స్, గార్డ్, మంచి బాల్.. ఎట్సట్రా ఎట్సట్రా...మరి ఒక మారథాన్‌లో పాల్గొనాలంటే..?బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. బాడీ ఫిట్‌గా ఉండాలి. ఎప్పటికప్పుడు లోపాలు సరిదిద్దుతూ, వెన్నుతట్టి ప్రోత్సహించే పర్సనల్ కోచ్ ఉండాలి. బోలెడంత ప్రాక్టీసుండాలి... మాంచి రన్నింగ్ షూస్... స్పోర్ట్స్ డ్రెస్ ఉండాలి. అయితే ఇవేమీ లేకుండానే మారథాన్‌లో గెలిచింది మారియా లోరెనా రామిరెజ్ అనే ఓ 22 ఏళ్ల మెక్సికన్ అమ్మాయి. 12 దేశాలనుంచి కనీసం 500 మంది మహిళలు పాల్గొన్న ఈ మారథాన్‌లో ఈ అమ్మాయి 50 కిలోమీటర్ల దూరాన్ని ఏడుగంటల మూడు నిమిషాల వ్యవధిలో అధిగమించింది. అదీ ఒంటికి ఒక స్కర్ట్, తలకు ఒక కర్చీఫ్, కాళ్లకు సాధారణమైన స్లిప్పర్స్, చేతిలో ఒక వాటర్ బాటిల్‌తో మారియా తన లక్ష్యాన్ని ఛేదించింది, బంగారు పతకాన్ని గెలుపొందింది.
ఒక మారథాన్ రన్నర్‌గా ఏ విధమైన స్పెషల్ యాక్సెసరీస్ లేకుండా వచ్చింది మారియా. మిగిలిన అందరిలా జెల్ కానీ, ఎనర్జీ స్వీట్లు కానీ, వాకింగ్ స్టిక్ కానీ, కళ్లకు గాగుల్స్ కానీ, కనీసం రన్నింగ్ షూస్ కానీ వాడలేదు. ‘‘మారియాను చూస్తే మారథాన్ గెలుచుకుంటుందని ఎవరూ ఊహించలేరు’’ అన్నారు ఈ రేస్ ఆర్గనైజర్ ఆర్లాండో జిమినెజ్. అవేమీ లేకపోతేనేం, లోరినా పరిగెత్తేటప్పుడు ఒళ్లంతా చెమటలు కారిపోవడం, ఆయాసపడటం, రొప్పడం, పట్టి పట్టి అడుగులు వేయడం వంటివేమీ లేవు. ఎంతో అలవోకగా పరిగెత్తి ఈ విజయాన్ని సాధించింది. అసలు ఇంతకీ మారియా వృత్తి ఏమిటనుకున్నారు.. గొర్రెలు కాయడం, పశువులను మేపడం... ఇదే ఆమె నిత్యకృత్యం. తన పనిలో భాగంగా మారియా రోజుకు కనీసం పది పదిహేను కిలోమీటర్ల దూరం నడుస్తుంది. ఇలానే గత సంవత్సరమే చిన్హువాలో జరిగిన వంద కిలోమీటర్ల విభాగంలో కాబల్లో బ్లాన్కో అల్ట్రా మారథాన్‌లో సెకండ్ ప్రైజ్ గెల్చుకుంది. ప్రస్తుత మారథాన్‌లో ఆమె గెల్చుకున్న మొత్తం 6,000 పెసోలు. అంటే సుమారు రూ. 21000 అన్నట్టు మారియా ఒక్కతే కాదు... ఆమె కుటుంబంలో తండ్రి, తాత, సోదరులు, అక్కచెల్లెళ్లు కూడా మారథాన్లలో పాల్గొన్నవారే.