వేకువ పువ్వు 

Winter is the cold winter because everyone is cold - Sakshi

చెట్టు నీడ 

అది డిసెంబర్‌లో ఒక సాయంత్రం. ఒక చెట్టు కింద చినిగిన దుస్తులు కట్టుకుని ఉన్న ఒక అవ్వ చేతిలో సత్తుగిన్నెతో నిలుచుని ఉంది. ఎన్ని అనుభవాలో.. ఆ అవ్వ ముఖం మీద ముడతలై పరుచుకుని ఉన్నాయి. చలికాలం కావటం వల్ల అందరూ ఒంటినిండా వెచ్చటి చలికోట్లు. చేతుల్లో పెద్ద పెద్ద సంచుల్లో ప్లాస్టిక్‌ నక్షత్రాలు, చెట్లు, అలంకరణ సామగ్రితో నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతున్నారు. తన ముందు నుంచి వెళ్తున్న అందరి వంక ఆ అవ్వ తన సత్తుగిన్నెను చాపి ఆశగా చూస్తోంది.  కొందరు ఆ చెట్టు కిందే ఆగి తాము చేసిన క్రిస్మస్‌ షాపింగ్‌ గురించి, క్రీస్తు పుట్టుక గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప ఆమె వంక కూడా చూడటం లేదు. అయితే అవ్వ మాత్రం వారి మాటలు ఆసక్తిగా వింటున్నట్టుగా చెవులు రిక్కిస్తోంది. ఇంతలో ఒక పెద్ద కారు అవ్వ ముందు ఆగింది. ఆమె కళ్ళలో ఆనందం! ఇక ఆ అవ్వ గిన్నెధనంతో నిండి పోతుంది అని.. చిన్న సంతోషం. కారు వెళ్లిపోయింది. ఆ అవ్వ గిన్నెలో ఒక్క పది రూపాయల నోటు కనిపించింది.. కారు పెద్దదే కానీ అందులో ఉన్నవారి హృదయాలు చిన్నవే అనుకుంటా! ఆ అవ్వ ఆ గిన్నెలో ఉన్న డబ్బులు లెక్క పెట్టుకుంటుంటే అవ్వకి సాయం చేయాలని నేను అటువైపు కదిలాను.

ఇంతలో ఎక్కడ నుండి వచ్చిందో నక్షత్రం తెగిపడినట్టు ఉన్నపాటుగా వేకువపువ్వు పరిమళించినట్టుగా ఒక చిన్న పాప ఆ అవ్వ సత్తు గిన్నెలో వందరూపాయల కాగితం వేసి తన వంటిమీద ఉన్న శాలువాను అవ్వ మీద కప్పి అవ్వని ముద్దు పెట్టుకొని వెళ్లిపోయింది. అదంతా చూస్తున్న నాకు క్రీస్తు పుట్టింది ఆ పాప హృదయంలోనేనేమో అనిపించింది. కాసేపయ్యాక ఆ అవ్వ తన సత్తుగిన్నెలో ఉన్న పైసలు లెక్కపెట్టుకొని ఎదురుగా అడుక్కుంటున్న ఒక అంధుడి గిన్నెలో కొంత వేసింది. మెల్లిగా వెళ్లి ఆ అవ్వని అడిగాను – అవ్వా! నీకు వచ్చిందే తక్కువ కదా, మళ్ళీ అందులోనే అతనికి దానం చేసావేంటి అని. అప్పుడు ఆ అవ్వ నావైపు చూసి – అయ్యా! నేను మొత్తం ఇవ్వలేదు. నాకు కలిగిన దానిలో కొంత ఇచ్చాను. ఇవ్వమని నా ప్రభువు చెప్పాడు! అని అంది. అప్పుడు అర్థమైంది నాకు ఆ అవ్వ ఎంత ధనవంతురాలో..!
– బెల్లంకొండ రవికాంత్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top