నన్నెందుకు నిందిస్తారు!

Why do not you plunge a primice of water? - Sakshi

మీ వరకేనా న్యూ ఇయర్‌ తీర్మానాలు? చెట్లను కాపాడతానని, చుక్క నీటిని వృథా చేయనని ఎందుకు ప్రతిజ్ఞ చెయ్యరు?

డిసెంబరు 31, ఆ తరవాత జనవరి 1. నా కాల గతి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలుగా సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు. చంద్రుడు రాత్రివేళల్లోనే తన చల్లని కిరణాలను ప్రసరిస్తున్నాడు. సృష్టి ప్రారంభం నుంచి మానవులందరికీ రెండు కళ్లు, రెండు చెవులు, రెండు చేతులు, రెండుకాళ్లు.. అన్నీ మామూలే. నవమాసాలు మోసి స్త్రీలే పిల్లల్ని కంటున్నారు. నా ప్రయాణంలో ఇవి అనునిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రకృతిలో సహజంగా ఎటువంటి మార్పు లేదు.

ఇంత నిక్కచ్చిగా నేను ప్రయాణిస్తుంటే, అందరూ నన్ను నిందిస్తారెందుకో! ఏ చిన్నపాటి ప్రకృతి వైపరీత్యం వచ్చినా, ఏ మాత్రం ఆలోచించకుండా, ‘కాలమహిమ కాకపోతే...’ అంటారు. కాలంలో ఏ మార్పు వచ్చిందని ఈ మాట అంటున్నారో నాకు అర్థం కాదు. కాలచక్రం ప్రారంభమైన నాటినుంచి నేటి వరకూ సృష్టి పంచభూతాత్మకంగానే ఉంది కదా. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం.. ఇవన్నీ ఎవరి తప్పిదాల వల్ల జరుగుతున్నాయి? గాలి తనంతట తాను కలుషితం కాదుగా? నీరు తనంత తాను కలుషితం కాదుగా? ఇటువంటి కాలుష్యాలకు నేనేదో కారణం అయినట్లు, ‘కాలం కాకపోతే’ అని నన్ను నిందించవలసిన అవసరం ఏంటి? ఇవన్నీ పక్కన పెడదాం.

నా ప్రయాణం ఒక సంవత్సరంలో నుంచి మరో సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే సమయంలో.. ఈ రోజు నుంచి సిగరెట్, మందు వంటి దురలవాట్లు మానేయాలి అంటూ నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి తీసుకోవడానికి నా కాలగమనానికి సంబంధం ఏంటి?  ఇవన్నీ వ్యక్తిగత నిర్ణయాలు. అసలు వీరంతా సమాజం గురించి ఆలోచించరా? ‘‘నా వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగకూడదు. సమాజానికి మేలు జరగాలి. నేను వృక్షాలను పరిరక్షిస్తాను, నేటి నుంచి ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయను, హామీలను నెరవేర్చని నాయకుడిని పదవీచ్యుతుడిని చేస్తాను’’ అని ఎందుకు ప్రతిజ్ఞ చేయరు? ఇన్ని మంచి మార్పులు జరిగితేనే కదా నేను ఆరోగ్యంగా ఉండగలుగుతాను. నాకు అనారోగ్యం చేస్తే మానవ మనుగడకు ఎంత ప్రమాదమో ఒక్కరూ ఆలోచించరే. ఒక్కో చెట్టు కొట్టేస్తుంటే నా గుండెలు ఎలా పగులుతాయో ఒక్కరైనా ఆలోచించారా? మానవ తప్పిదాల వల్ల భూమాత శరీరం ఎంత వేడెక్కిపోతోందో ఆలోచించారా? ఇప్పటికైనా ‘సొంత లాభం కొంతమానుకు, పొరుగువారికి తోడుపడవోయ్‌’ అనే గురజాడ మాటలను ఆచరిస్తామని సంకల్పించండి. మానవ అభివృద్ధి కోసం ప్రతినబూనండి. అప్పుడు ‘కాల మహిమ’ అనండి. నా మహిమలను కాపాడండి.

స్వగతం : వైజయంతి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top