జులుబుకు ఏ సూప్‌ మంచిదంటే! 

 Which soup is good for the cold - Sakshi

సీజనల్‌ సూప్స్‌

వాతావరణంలో మార్పులు మన శరీరం మీద ప్రభావం చూపుతాయి. అవి, జలుబు, ఒళ్ళు నొప్పులతో కూడిన జ్వరం, దగ్గు రూపంలో బాధిస్తాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇంట్లోనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. జులుబు, జ్వరం, దగ్గు సమస్యల ఉపశమనానికి... 

చికెన్‌ సూప్‌: ఉల్లికాడలు, ఉల్లిపాయలు, మిరియాల పొడి కలిపి తయారుచేసుకున్న చికెన్‌ సూప్‌ జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలకు త్వరగా ఉపశమనం ఇస్తుంది. 
మష్రూమ్‌/పాల కూర సూప్‌: శాకాహారులు పుట్టగొడుగులు, పాలకూరలతో సూప్‌లను తయారుచేసుకోవచ్చు. దీంట్లోనూ ఉల్లికాడలు, మిరియాలు, వెల్లుల్లి, జిలకర్ర కలిపి తయారుచేసుకొని సేవించాలి.సూప్‌లు ఏ సమయంలోనైనా వేడి వేడిగా తీసుకుంటే రుచిగానూ ఉంటాయి. అనారోగ్యసమస్యల నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. 

వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే... 
రోజూ ఉదయం అల్పాహారంతో పాటు ఒక గ్లాసు ఆరెంజ్‌ జ్యూస్‌ తీసుకోవాలి. దీంట్లో ఉండే ‘సి’ విటమిన్, యాంటీయాక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి.ఈ సీజన్‌లో నీటి కాలుష్యం ఎక్కువ. వడకట్టడం, మరిగించి చల్లార్చిన నీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోకపోతే విరేచనాలు అవుతుంటాయి. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే పెరుగు, మజ్జిగ వంటి ద్రవాలు తీసుకుంటూ ఉండాలి. వారానికి ఒకరోజు లేదా 15 రోజులకొకసారి ఉపవాసం ఉండాలి. అంటే పూర్తిగా ఆహారం తీసుకోకుండా కాదు. ఆ రోజు మొత్తం కూరగాయలు, పండ్లు, పళ్ల రసాలు, నీళ్ల మీదే ఉండాలి. వేరే ఇతర ఆహార పదార్థాలేవీ తీసుకోకూడదు. దీని వల్ల శరీరంలో మలినాలు తొలగి, జీర్ణవ్యవస్థ పనితీరు చురుకు అవుతుంది.  శరీరానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా శాతం పెరిగి అనారోగ్యసమస్యలు దరిచేరవు. ఆరెంజ్‌ జ్యూస్, దానిమ్మ జ్యూస్‌లు ఈ కాలం చాలా మంచివి.

ఈ కాలం మూత్రవ్యవస్థకు సంబంధించిన సమస్యలు, ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తుంటాయి. అలాగే – ఊపిరితిత్తులు, ముక్కుకు సంబంధించినవి, మలబద్దకం సమస్యలకు అవకాశాలు ఎక్కువ. రోజులో 2–3 లీటర్లు  శుభ్రమైన నీళ్లు సేవిస్తే యూరిన్‌ ఇన్ఫెక్షన్ల సమస్య ఉండదు. పీచు పదార్థాలు ఎక్కువ ఉండే పదార్థాలు తినడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే విరేచనం సాఫీగా అవుతుంది. కాయగూరల్లో బీట్‌రూట్, క్యారెట్‌ వంటి సూప్‌లను ఎర్రకందిపప్పును ఉపయోగించి తయారుచేసుకోవాలి. ఇది సలాడ్‌లా తయారుచేసుకొని భోజనంలా కూడా తినవచ్చు. ∙టొమాటో రసం, టొమాటో పప్పు.. టొమాటోతో కూడిన వంటకాలు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యకరం.జీర్ణకోశం నుంచే రోగనిరోధక కణాలు పుడుతూ ఉంటాయి. అందుకని జీర్ణకోశాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే ఈ కాలం అంత ఆరోగ్యంగా ఉంటాం అనే విషయాన్ని విస్మరించకూడదు.
– డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌ 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top