
బ్రెజిల్ : బలవంతుడే బతకాలని చెప్పేది ఆటవిక నీతి. ఆహారం కోసం సాగే వేటలో.. ఇదొక అక్షర సత్యం. అడవుల్లో ఆహారం కోసం నిత్యం పరుగులు తీసే క్రూరమృగాలు ఇదే నీతిని అనుసరిస్తాయి. అది మొసలి కావచ్చు.. పులి కావచ్చు.. లేదంటే సింహం కావచ్చు. ఇదే పోరాటం రెండు క్రూరమృగాల మధ్య జరిగితే.. అటువంటి ఘటనను చూసేందుకైనా ధైర్యం కావాలి. సరిగ్గా ఇటువంటి సంఘటనే బ్రెజిల్‌లోని మాటో గ్రాస్సో అడవిలోని త్రీ బ్రదర్స్ నదిలో జరిగింది.
ఆకలేసిన చిరుత పులి.. వేటాడ్డం కోసం త్రీ బ్రదర్స్ నదీ తీర ప్రాంతానికి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో నది లోపల ఉండే మొసలి.. కూడా ఆహారం కోసం అటూఇటూ చూస్తోంది. ఆకలి మీదున్న పులి-మొసలి వెంటనే ఒకదానిమీద ఒకటి పడ్డాయి.
రెండింటి మధ్య సుమారు 20 నిమిషాల పాటు పోరాటం సాగింది. మొదట మొసలి.. తన వాడి పళ్లతో పులి మీద దాడిచేస్తే.. చిరుత చాకచక్యంగా తప్పించుకుని.. తన పంజాతో చావుదెబ్బ కొట్టింది. ఒకదానిమీద ఒకటి కలియబడుతూ.. రెండు పోరాడాయి. అయితే చిరుత.. మొసలిని చాకచక్యంగా నీళ్లలోంచి బయటకు రప్పించి.. నోటితో కొరుకుతూ.. పంజాతో కొడుతూ.. మొసలిని చంపేసింది.
అడవిలోని జంతువులను, ప్రృకతిని, ఇతర పరిసరాలను ఫొటోలు తీద్దామని వెళ్లిన క్రిస్ బ్రన్‌స్కిల్.. అనె ఫొటో గ్రాఫర్ ఈ చిత్రాలను తన కెమెరాలో బంధించారు.

