వెల్వెట్వెచ్చని నెచ్చెలి | Velvetveccani career | Sakshi
Sakshi News home page

వెల్వెట్వెచ్చని నెచ్చెలి

Jan 1 2014 11:42 PM | Updated on Sep 2 2017 2:11 AM

ముఖమల్ అంటే ఆధునికులు కొంత ఆలోచనలో పడతారు. అదే ‘వెల్వెట్’ అంటే ‘వావ్ గుడ్ ఫ్యాబ్రిక్’ అంటూ ఆ క్లాత్‌ని తమ మేనికి అతికించుకుంటారు.

మీకేం ఇష్టమో తెలిసిన ఫ్రెండ్ ఒకరు
 మీకేం ఇష్టం ఉండదో తెలిసిన ఫ్రెండ్ ఇంకొకరు
 ఇద్దర్లో మీరు ఎవరి దగ్గర ఓపెన్ అవుతారు?
 మీకేది బాగుంటుందో చెప్పే ఫ్రెండ్ ఒకరు
 మీకేం బాగుండదో చెప్పే ఫ్రెండ్ ఒకరు
 ఇద్దర్లో మీరు ఎవర్ని సలహా అడుగుతారు?
 మీరెలా చెబితే అలా వినే ఫ్రెండ్ ఒకరు
 మీరేమీ చెప్పకుండానే వినే ఫ్రెండ్ ఒకరు
 ఇద్దర్లో మీరు ఎవరి తోడును కోరుకుంటారు?
 సమాధానం మీ మనసుకు తెలుసు.
 ఆ మనసుకు చక్కగా ఫిట్ అయ్యే నెచ్చెలే... వెల్వెట్!

 
ముఖమల్ అంటే ఆధునికులు కొంత ఆలోచనలో పడతారు. అదే ‘వెల్వెట్’ అంటే ‘వావ్ గుడ్ ఫ్యాబ్రిక్’ అంటూ ఆ క్లాత్‌ని తమ మేనికి అతికించుకుంటారు. చూపులకు కాంతిమంతం, చుట్టుకుంటే మృదుత్వం కట్టుకుంటే కనువిందుచేసే సోయగం ముఖమల్ సొంతం అంటూ మురిసిపోతారు. చూపరుల మదిని కొల్లగొడతారు.


 రాచరికానికి కొత్త హంగులు అద్దిన ‘ముఖమల్’ ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టి సామాన్యుడిని సైతం పలకరించింది. సింగిల్‌గానే కాదు నీరు ఏ పాత్రలో పోస్తే అందులో ఒదిగిపోయినట్టుగా వెల్వెట్ ఏ ఫాబ్రిక్‌తో కలిస్తే ఆ రూపకంగా సొబగులు అద్దుకుంటూ వచ్చింది. కాని తన గుర్తింపును మాత్రం ఏ మాత్రం కోల్పోకుండా అదే హంగు, ఆర్భాటంతో హల్‌చల్ చేయడం మొదలుపెట్టింది. అంతే డిజైనర్ల లుక్‌ను ఆటోమేటిగ్గా తన వైపుకు తిప్పుకుంది. తన చుట్టూ ప్రదక్షిణలు చేయించింది. చేయిస్తూ ఉంది. సంప్రదాయ తరహాలో ‘కుందనపుబొమ్మల’ను తీర్చిదిద్దే ముఖమల్ ఆధునిక తరహాలో ర్యాంప్‌షోలపైనా షార్ట్స్‌గా హోయలు పోతోంది. దుస్తులే కాదు యాక్ససరీస్‌నూ వెల్వెట్ విభిన్నతరహాలో మెరిసిపోతుంది.
 
పట్టుతో తయారైన ముఖమల్ ఫ్యాబ్రిక్ మరింత మృదువుగా ఉండటమే కాదు కాంతిమంతంగానూ ఉంటుంది. దీనిని పోలినట్టుగా ఉండే ఇతర వెల్వెట్ నాణ్యతలో తేడా కనిపిస్తుంది. షిఫాన్ వెల్వెట్ -చాలా తక్కువ బరువుతో కాస్తంత ట్రాన్స్‌పరెంట్‌తో అట్రాక్ట్ చేస్తే, పై ఆన్ పై వెల్వెట్ ప్రింట్స్‌తో పలకరిస్తుంది. వీటిలో సిజిల్, క్రషడ్, ఎంబోస్‌డ్, హ్యామర్డ్, లేయన్స్, మిర్రర్.... వంటి రకరకాల ఫ్యాబ్రిక్‌గా కొత్త అందాలను సింగారించుకుని అతివల మనసులను కొల్లగొడుతుంది.
   
 క్రీ.పూ 12 వందల కాలంలో ప్రభువుల కోసమే రూపొందిన ముఖమల్‌ను మొట్టమొదట బాగ్దాద్ పట్టణంలో తయారుచేసినట్టు, ఆ తర్వాత కాశ్మీర్ వ్యాపారులు ప్రపంచానికి పరిచయం చేసినట్టు చరిత్ర చెబుతుంది. ప్రాచీన రోజుల్లో ముఖమల్ స్వచ్ఛమైన పట్టుతో తయారయ్యేది. అందుకే గజం ముఖమల్ క్లాత్ కొనాలంటే బోలెడన్ని బంగారు కాసులు ఖర్చు చేయాల్సి వచ్చేది. దీంతో ఇది అత్యంత ఖరీదైన వస్త్రంగా ప్రపంచమంతా పేరుపొందింది. ఆ తర్వాత కాలంలో లినెన్, ఊల్, పాలియస్టర్, నైలాన్... వంటి విభిన్నరకాలైన సింథటిక్స్‌తో మేళవించి వెల్వెట్‌ను రూపొందించడం మొదలుపెట్టారు. దీంతో ధర పరంగానూ వెల్వెట్ అందరికీ అందుబాటులోకి దిగిరాకతప్పలేదు.
   
 వెల్వెటీన్: టీన్స్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ వెల్వెట్. కురచ డ్రెస్సులను ఇష్టపడే అమ్మాయిలను ఆకట్టుకునే ఫ్యాబ్రిక్. అలాగే మృదువుగా ఉండటంతో సౌక్యర్యంగా అనిపిస్తుంది. పెద్దగా సాగే గుణం ఉండదు. కాటన్ వెల్వెట్ అయితే చమటను పీల్చుకునే గుణం కూడా ఉంటుంది. తడిగా ఉన్న పొడిగానే చూపులకు కనిపిస్తుంది. అంతేకాదు చలిని కట్టడి చేసి ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది. దీంతో చలికాలం ఫ్యాషనబుల్ ఫ్యాబ్రిక్‌గా వెలుగొందుతుంది. స్టైల్‌గా, స్మార్ట్‌గా, స్టన్నింగ్‌గా అనిపించే ఫ్యాబ్రిక్ వెల్వెట్ కావడంతో ఈ క్లాత్‌పై మగ్గం పనితీరు అందంగా అమరుతుంది. జర్దోసీ జిగేల్మంటుంది. అద్దాలు మిరుమిట్టుగొలుపుతుంటాయి.చమ్కీలు చమక్కుమంటాయి.
   
 యాక్ససరీస్: వెల్వెట్ ప్రాబ్రిక్‌తో దుస్తులు మాత్రమే కాదు వివిధ రకాల యాక్సరీస్‌కూడా రూపొందుతున్నాయి. బ్యాగు లు, పర్సులు, చెప్పులు, బెల్ట్‌లు,.. గానూ కనువిందు చేస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement