అతడే వీరేశలింగం..

Veeresalingam Pantulu Life Story In Sakshi Fund Special

బలిపీఠం చిత్రంలోని ‘‘కలసి పాడుదాం తెలుగు పాట/కదలి సాగుదాం వెలుగు బాట/తెలుగువారు నవ జీవన నిర్మాతలని/తెలుగు జాతి సకలావనికే జ్యోతి అని’’ పాటలో వీరేశలింగం పంతులు గారిని మన కళ్లకు కట్టినట్లు చూపారు శ్రీశ్రీ. 
మన పూర్వీకులు చేసిన తప్పుడు పనులకు ఎంతో మంది అభాగ్యులు బలైపోయారు. బాల్య వివాహాల కారణంగా ఆడపిల్లలు చిన్నతనంలోనే వైధవ్యం అనుభవించారు. ఇటువంటి తప్పుడు పనులకు పరిష్కారం చూపాలనే ఆలోచన ఎవ్వరికీ కలగలేదు. అలా ఎవరికీ రాని ఆలోచన కందుకూరి వీరేశలింగంగారికి వచ్చింది. ఆయన అనేక రకాలుగా సంఘంలో మార్పు తీసుకు రావడానికి నడుం బిగించారు. సంఘంలో వేళ్లూనుకున్న దురాచారాలను ఆయన కూకటి వేళ్లతో లాగేసి, సమాజానికి సందేశాన్నిచ్చి, అందరికీ ధైర్యాన్ని కలిగించాడు. అటువంటి పంతులు గారి గురించి శ్రీశ్రీ ‘‘కార్యశూరుడు వీరేశలింగం/ కలం పట్టి పోరాడిన సింగం/దురాచారాల దురాగతాలను తుద ముట్టించిన అగ్ని తరంగం/అదిగో వీరేశలింగం’’ అని ఆయన వ్యక్తిత్వాన్ని హృద్యంగా చూపారు. 

పంతులు గారు ఈ ఒక్క విషయం మీదే కాకుండా, చాలా సమస్యల గురించి తెలుసుకున్నారు. స్నేహితులను కలిసినప్పుడు వారితో మాట్లాడి, వారు చెప్పిన సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించి ఆచరణలోకి తెచ్చారు. ఆయన చేసిన వితంతు పునర్వివాహం వెనుక ఎంతోమంది ఆలోచన ఉందని ఆయనే స్వయంగా చెప్పేవారని పెద్దలు చెప్పగా విన్నాను. నేను కూడా ఆయన పుట్టిన రాజమండ్రిలోనే ఉండటం నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఆయనని తలచుకుంటే, ఆయన పుట్టిన ఊరిలో మేమున్నామన్న ఆనందం కలుగుతుంది. కించిత్తు గర్వం కూడా కలుగుతుంది.
వితంతు పునర్వివాహాల మీదే ఎక్కువ పనిచేశారంటే కారణం వారి బాధను దగ్గరగా చూసి తెలుసుకోవడమే.

‘‘మగవాడెంతటి ముసలాడైనా మళ్లీ పెళ్లికి అర్హత ఉంటే/బ్రతుకే తెలియని బాల వితంతువులకెందుకు లేదా హక్కంటాను/చేతికి గాజులు తొడిగాడు చెదిరిన తిలకం దిద్దాడు/మోడువారిన బ్రతుకున పసుపు కుంకుమ నిలిపాడు’’ అని పంతులుగారు బాల వితంతువుల కోసం చేసిన పోరాటాన్ని శ్రీశ్రీ అలతి పదాలలో మనసుకు హత్తుకునేలా రచించారు.

పంతులు గారి గురించి మాట్లాడటం నా జీవితానికి గొప్ప అదృష్టం. ఆయన జీవిత చరిత్ర కాని, ఆయన జీవిత సంఘటనలు కాని తెలుసుకునే కొద్దీ ఒళ్లు పులకిస్తుంది. ఆయన దేవుడు పంపిన దూత, యుగపురుషుడు. పంతులు గారి భార్య రాజ్యలక్ష్మి కూడా ఎంతో సహకరించారు. కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల రాజమండ్రిలో ఇన్ని సంవత్సరాలుగా నడుస్తోందంటే అదంతా ఆయన గొప్పదనమే. అంత ఛాందసనంగా ఉన్న రోజుల్లోనే ఈయన తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది.

ఆ రోజుల్లో ఆయనను వ్యతిరేకించిన వారు చాలా మందే ఉన్నారు. అదేవిధంగా ఆయనను బలపరిచిన వారూ లేకపోలేదు. ఇప్పటికీ చాలామంది వితంతువులు గర్వంగా తిరుగుతున్నారంటే అది ఆయన గొప్పతనమే. దారుణమైన దురాచారాలు రాజ్యమేలుతున్న రోజుల్లో, స్త్రీల తరఫున పోరాడారు. ఈరోజు ముత్తయిదువ, వితంతువు తేడా లేకుండా ఉండటానికి ఆయన చేసిన కృషి చెప్పరానిది. ఆ రోజుల్లో ఆయన విప్లవం తీసుకుని రాకపోయి ఉండకపోతే, ఎంతోమంది ఆత్మహత్య చేసుకునేవారు. ఆయన శతవర్థంతి సందర్భంగా పంతులుగారిని స్మరించుకోవడం నాకు చాలాసంతోషంగా ఉంది. నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. – సంభాషణ: వైజయంతి పురాణపండ

జిత్‌ మోహన్‌ మిత్రాసినీ నటుడు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top