వరుసగా అబార్షన్స్‌ అవుతున్నాయి... సంతానం కలుగుతుందా?

Various causes such as infections can lead to miscarriage - Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 32 ఏళ్లు. పెళ్లయి ఏడేళ్లు అవుతోంది. మూడుసార్లు గర్భం వచ్చింది. కానీ గర్భస్రావం అయ్యింది. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని అన్నారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. హోమియో ద్వారా నాకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉందా?        

గర్భధారణ జరిగి అది నిలవనప్పుడు, ముఖ్యంగా తరచూ గర్భస్రావాలు అవుతున్నప్పుడు అది వారిని మానసికంగానూ కుంగదీస్తుంది. మరోసారి గర్భం ధరించినా అది నిలుస్తుందో, నిలవదో అన్న ఆందోళనను కలగజేస్తుంది. ఇలా రెండు లేదా మూడుసార్లు గర్భస్రావం అయితే దాన్ని ‘రికరెంట్‌ ప్రెగ్నెన్సీ లాస్‌’గా పేర్కొంటారు.

కారణాలు:
►ఇలా గర్భస్రావాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని...
►గర్భాశయం అసాధారణంగా నిర్మితమై ఉండటం (రెండు గదుల గర్భాశయం)
►గర్భాశయంలో కణుతులు / పాలిప్స్‌ ఉండటం
►గర్భాశయపు సర్విక్స్‌ బలహీనంగా ఉండటం
►కొన్ని రకాల ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు
►కొన్ని ఎండోక్రైన్‌ వ్యాధులు
►వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం
►రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి ఎన్నో కారణాలు గర్భస్రావానికి దారితీస్తాయి. అయితే కొంతమందిలో ఎలాంటి కారణం లేకుండా కూడా గర్భస్రావాలు జరుగుతుండవచ్చు.

చికిత్స: రోగనిరోధకశక్తిని పెంపొందించడం, హార్మోన్ల అసమతౌల్యతను చక్కదిద్దడం వంటి చర్యల ద్వారా సంతాన లేమి సమస్యను పరిష్కరించవచ్చు. అలాగే  గర్భస్రావానికి దారితీసే అనేక కరణాలు కనుగొని, వాటికి తగి చికిత్స అందించడంతో పాటు కాన్‌స్టిట్యూషన్‌ పద్ధతిలో మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తే సంతాన సాఫల్యం కలుగుతుంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కారణాలతో పాటు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన ఔషధాలను వాడితే సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది.
డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్,
హైదరాబాద్‌

మైగ్రేన్‌ తలనొప్పి... చికిత్స ఉందా?

నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రంగా వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్‌–రే, స్కానింగ్‌ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్‌గా నిర్ధారణ చేశారు. జీవితాంతం వస్తుంటుందని చెప్పారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా?

తరచూ తలనొప్పి వస్తుంటే అశ్రద్ధ చేయకూడదు. నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్‌ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొప్పి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వాత కచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. మైగ్రేన్‌ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధికప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్‌ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. ఇది స్త్రీలలోనే ఎక్కువ.

మైగ్రేన్‌లో దశలూ, లక్షణాలు: సాధారణంగా మైగ్రేన్‌ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్‌ మైగ్రేన్‌ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి.

వ్యాధి నిర్ధారణ: రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్‌ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్‌ను నిర్ధారణ చేయవచ్చు.

నివారణ: మైగ్రేన్‌ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి.

చికిత్స: మైగ్రేన్‌ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంశీక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్‌ కన్‌స్టిట్యూటషన్‌ సిమిలియమ్‌ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్‌కు అద్భుతంగా పనిచేస్తాయి.
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా,
ఎండీ (హోమియో),
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌

బాబుకు ఆటిజమ్‌... చికిత్స ఉందా?

మా బాబుకు మూడేళ్లు. ఆటిజమ్‌ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో మంచి చికిత్స సూచించండి.

ఆటిజమ్‌ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు,  ఎన్నో లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ లక్షణాలు  ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్‌ డిజార్డర్‌ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్‌ డిజార్డర్‌ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్‌ డిసింటిగ్రేటెడ్‌ డిజార్డర్‌ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్‌ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు.

ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు.  మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్‌ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు.

పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు...
►అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం
►నలుగురిలో కలవడలేకపోవడం
►ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం
►వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్‌ ఉన్న పిల్లలకు లక్షణాలు బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్‌ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్‌ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్‌ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠస్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,
పాజిటివ్‌ హోమియోపతి,
హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top