కంటిచూపు లేకపోతేనేం...ఇంటి దీపమయింది! | two times she gives speech in the united nations | Sakshi
Sakshi News home page

కంటిచూపు లేకపోతేనేం...ఇంటి దీపమయింది!

Jul 23 2014 12:45 AM | Updated on Sep 2 2017 10:42 AM

కంటిచూపు లేకపోతేనేం...ఇంటి దీపమయింది!

కంటిచూపు లేకపోతేనేం...ఇంటి దీపమయింది!

అది 1999, సెప్టెంబరు 27వ తేదీ. కూతురు పుట్టిందని సంతోషించాడు దురైకన్ను. ఇంతలోనే పిడుగు లాంటి వార్త... పుట్టిన బిడ్డకు కళ్ళు కనబడవని, భవిష్యత్తులో కూడా చూపు వచ్చే పరిస్థితి లేదన్నారు డాక్టర్లు.

అది 1999, సెప్టెంబరు 27వ తేదీ. కూతురు పుట్టిందని సంతోషించాడు దురైకన్ను. ఇంతలోనే పిడుగు లాంటి వార్త... పుట్టిన బిడ్డకు కళ్ళు కనబడవని, భవిష్యత్తులో కూడా చూపు వచ్చే పరిస్థితి లేదన్నారు డాక్టర్లు. భోరున విలపించాడు దురైకన్ను. కూతురు అంధత్వంతో పుట్టిందన్న బాధ కన్నా తమ తర్వాత బిడ్డకు ఎవరు తోడుంటారన్నదే ఆదంపతులను తీవ్రంగా బాధించిన అంశం.

అయితే భవిష్యత్తులో ఆమే ఆ ఇంటికి దీపమవుతుందని వారు ఆ రోజు ఊహించకపోయి ఉండవచ్చు.ఆ అమ్మాయే స్వర్ణలక్ష్మి. పాండిచ్చేరి ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ప్లస్‌వన్ చదువుతోంది. పదవ తరగతిలో 458 మార్కులు తెచ్చుకుంది. అందులో ఏ విశేషమూ లేదు. కానీ విశేషం ఏమిటంటే... ఆమె రెండుసార్లు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించింది.
 
2013వ సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన అమెరికా, చైనా, అర్జంటీనా, ఉరుగ్వే, ఉగండా దేశాల ప్రతినిధుల తర్వాత స్వర్ణలక్ష్మి వంతు వచ్చింది. భారత్‌లో మహిళలపై జరుగుతున్న దురాగతాలు, అత్యాచారం, నేరాలు, వారి హక్కుల హరించడం, స్త్రీల హక్కులపై పురుషుల అధిక్యంతో పాటు సంప్రదాయాల పేరిట మహిళలకు ఎదురవుతున్న అసమానత్వం, అవమానాలు, బాల్యవివాహాలు, బాలికలను విద్యకు దూరంగా ఉంచడం లాంటి సమస్యలను ఆధారాలతో సహావివరించింది. అలాగే చిన్నపిల్లలను చదువుల పేరిట ఆటలకు దూరంగా ఉంచడం మీద కూడా వ్యాఖ్యానించింది.
 
తల్లిదండ్రులు తమ బాధ్యత పేరిట పిల్లల హక్కులను హరించడం, తమ ఆశల కోసం చిన్నారులపై భారాన్ని మోపడంతో చిన్నారులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించింది. మహిళలు, చిన్నపిల్లల హక్కులపై స్వర్ణలక్ష్మి చేసిన ఏడు నిమిషాల ప్రసంగం అనేక దేశాల ప్రతినిధులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో మహిళలు, చిన్నపిల్లలపై హక్కులపై మరింత సమాచారంతో మరోసారి ప్రసంగించాల్సిందిగా ఐరాస నుండి ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం మేరకు 2013 అక్టోబర్‌లో ఐదు నిమిషాల పాటు ప్రసంగించింది. అలా ఐక్యరాజ్యసమితిలో ఒకే ఏడాదిలో రెండుసార్లు ప్రసంగించింది స్వర్ణలక్ష్మి.
 
 ఇంతకీ ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే అవకాశం ఎలా వచ్చిందంటే... స్వర్ణలక్ష్మి పాఠశాల నేపథ్యాన్ని గుర్తు చేసుకోవాలి. చెన్నైలోని లిటిల్‌ప్లవర్ పాఠశాలలో నిర్వహించే వకృత్వం, వ్యాసరచన, కీబోర్డు వాయించడం తదితర రంగాలలో తన ప్రతిభను కనబరిచిందామె. పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించే మాక్ పార్లమెంట్‌లో సమాచార శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా రాణించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మాక్ పార్లమెంట్‌లో స్వర్ణలక్ష్మి చేసిన ప్రసంగాలను విదేశీ స్వచ్ఛంద సంస్థల ద్వారా తెలుసుకున్న ఐకాస ప్రతినిధులు తమ వేదికపై ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందుకుంది. మనిషి మేధాసంపత్తికి, ప్రతిభకు అంధత్వం అడ్డుకాదని నిరూపించింది.
 
 - కోనేటి వెంకటేశ్వర్లు, న్యూస్‌లైన్, చెన్నై, ఫొటోలు: చుండి ముకుందరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement