జీరో అవర్‌

 Triple Talaq Bill Passed By Lok Sabha - Sakshi

తలాక్‌ బాధితుల్ని ఉద్ధరించడానికి బిల్లే అవసరం లేదు. మహిళలకు ఇన్నని సీట్లిచ్చేస్తే.. మగ పార్లమెంటేరియన్‌ల ఆడగొంతు డబ్బింగ్‌లతో పని లేకుండా మహిళల సమస్యల్ని మహిళలే పరిష్కరించుకునే ‘ఫిమేల్‌ వాయిస్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీ’ మాత్రమే చట్టసభల్లో వినిపిస్తుంది. ఏది తక్షణ అవసరమో తెలియకున్నా నష్టం లేదు. ఏది తక్షణ అనవసరమో పాలకులకు తెలియాలి! జీరో అవర్‌ను లంచ్‌ అవర్‌ తర్వాత పెట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో! ఆకలితో ఆలోచించలేరు కదా. 

ఆకలిగా ఉన్నప్పుడు మాట్లాడలేం. వినలేం. శుక్రవారం పార్లమెంటులో లంచ్‌ అవర్‌కు ముందు జీరో అవర్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు గురించి మాట్లాడే అవకాశం కేరళ కన్నూర్‌ ఎంపీ శ్రీమతి టీచర్‌కు లభించింది. మాట్లాడే అవకాశం మాత్రమే అది. ప్రశ్నించే అవకాశం కాదు. ప్రశ్నించడానికి జీరో అవర్‌ కంటే ముందు క్వొశ్చన్‌ అవర్‌ ఉంటుంది. ఆ అవర్‌లో మాట్లాడ్డం ఉండదు. ప్రశ్నించడం, ప్రశ్నకు సమాధానం వినడం ఉంటుంది. డిసెంబర్‌ 11న శీతాకాల సమావేశాలు మొదలయ్యాక క్వొశ్చన్‌ అవర్‌లో ఇంతవరకు ఎవరూ మహిళా బిల్లు ఏమైందని ప్రశ్నించలేదు. జనవరి 8న సమావేశాలు ముగుస్తాయి. ఆలోపు ఎవరైనా ప్రశ్నించినా, ఎవరు లేచి సమాధానం చెబుతారు? ప్రధానమంత్రా, పార్లమెంటరీ అఫైర్స్‌ మినిస్టరా, న్యాయశాఖ మంత్రా? మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై వెయ్యడానికి చాలా ప్రశ్నలే ఉన్నాయి. ఒక క్వొశ్చన్‌ అవర్‌ సరిపోదు. ఎన్ని రోజులు సమావేశాలు జరిగితే అన్ని రోజుల క్వొశ్చన్‌ అవర్‌లూ కావాలి. ఎనిమిదేళ్ల క్రితమే రాజ్యసభలో పాస్‌ అయిన బిల్లు, లోక్‌సభ టేబుల్‌ మీదకు ఎందుకు రావడం లేదు? పార్లమెంటులో మెజారిటీ ఉండి కూడా బీజేపీ ఈ ఐదేళ్లలో బిల్లు మాటే ఎందుకు ఎత్తలేదు? ఈ పార్లమెంటు సమావేశాలలో మొత్తం 46 బిల్లులు టేబుల్‌ మీదకు వచ్చాయి.

వాటిల్లో తలాక్‌ బిల్లు ఉంది కానీ, మహిళా రిజర్వేషన్‌ బిల్లు లేదు! తలాక్‌ బాధితుల్ని ఉద్ధరించడానికి బిల్లే అవసరం లేదు. మహిళలకు ఇన్నని సీట్లిచ్చేస్తే.. మహిళలే తమ సమస్యల్ని చక్కగా డీల్‌ చేసుకోగలరు. ఏది తక్షణ అవసరమో తెలియకున్నా నష్టం లేదు. ఏది తక్షణ అనవసరమో పాలకులకు తెలిసి ఉండాలి. జీరో అవర్‌లో మాట్లాడేందుకు శ్రీమతి టీచర్‌కు (ఆమె పేరు అదే) ఐదు నిముషాల సమయం ఇచ్చారు. మహిళా బిల్లును వెంటనే సభలో ప్రవేశపెట్టి, డిస్కషన్‌కి పెట్టండని ఆమె విజ్ఞప్తి చేశారు. మిగతా ఎంపీలు కూడా ఆమెను సపోర్ట్‌ చేశారు. ఆ సపోర్ట్‌ చేసినవాళ్లలో పాలకపక్షం అయిన ఎన్డీయేవాళ్లు కానీ, ప్రతిపక్షమైన యూపీయే వాళ్లు గానీ లేరు! ఐదు నిముషాలు ముగిశాయి. జీరో అవరూ ముగిసింది. అంతా లంచ్‌కి వెళ్లిపోయారు. శ్రీమతి టీచర్‌ పార్లమెంటులో రిజర్వేషన్‌ బిల్లు గురించి అడగడానికి ముందురోజు సాయంత్రం లోక్‌సభ సభ్యులందరికీ ఫోన్‌లు వెళ్లాయి.

కొందరు రాజ్యసభ సభ్యులకు కూడా. అవన్నీ దేశప్రజల నుంచి వెళ్లిన ఫోన్‌లు! రైతులు, గృహిణులు, ఉద్యోగినులు, విద్యార్థులు, లైంగికదాడి బాధితులు, సఫాయీ పని మాని పునర్‌వృత్తి పొందినవారు, మీడియా మహిళలు, బ్యాంకర్‌లు, వివిధ రంగాలలో శిక్షణ లో ఉన్నవారు, పరిశోధకులు, సామాజిక కార్యకర్తలు, ఇంటిపనివారు, వ్యాపార ప్రకటన సంస్థల నిపుణులు, పారిశ్రామికవేత్తలు చేసిన ఫోన్‌లు. బెంగళూరులోని ‘శక్తి’అనే సంస్థ ‘కాల్‌ యువర్‌ ఎంపీ’ అంటూ వీళ్లందరితో ఎంపీలకు ఫోన్‌ చేయించింది. అందరి చేతా ఆ సంస్థ అడిగించిన ప్రశ్న ఒకటే. ‘మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మీరు మద్దతు ఇస్తారా?’ అని. ‘ఎస్‌’ అని 127 మంది ఎంపీలు సమాధానం ఇచ్చారు. మిగతావాళ్లు రెస్పాండ్‌ కాలేదు. మొత్తం 373 మంది ఎంపీలకు ఈ ఫోన్‌లు వెళ్లాయి. ఫోన్‌ చేసినవారు 500 మంది. ఫోన్‌ కాల్‌కి సమాధానం ఇచ్చినవాళ్లలో రాజ్యసభ బీజేపీ ఎంపీ సహస్రబుద్ధే కూడా ఉన్నారు. ‘‘బిల్లుకు మేము అనుకూలం అని బీజేపీ ఎప్పుడో స్పష్టంగా చెప్పింది. కానీ కొన్ని పార్టీలు కోటాలో మళ్లీ కోటా అడుగుతున్నాయి. ఏకాభిప్రాయం కుదరక ఆలస్యం అవుతోంది.

ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు టేబుల్‌ మీదకు వస్తుందో లేదో నేను చెప్పలేను. ఎందుకంటే నాకు తెలియదు’’ అని చెప్పారు సహస్రబుద్ధే! తక్కినవాళ్ల సమాధానాలు కూడా ఇలాగే ఉన్నాయి. బిల్లుకు సపోర్ట్‌ చేస్తామన్నారే కానీ, బిల్లును టేబుల్‌పైకి రప్పించే ఎఫర్ట్‌ చేస్తామని ఎవరూ చెప్పలేదు! బీజేపీ ఎంపీ సహస్రబుద్ధే ఈ విషయంలో ఏమీ చెయ్యలేకపోవచ్చు. బీజేపీ పీఎం నరేంద్ర మోదీ బుద్ధిశాలే కదా. పైగా స్త్రీమూర్తుల శక్తి సామర్థ్యాలపై  ఎన్నో సందర్భాలలో ఆయన తన మాటల్లో అపారమైన విశ్వాసాన్ని ప్రదర్శించారు.  ‘స్త్రీలు.. అభివృద్ధి గురించి కాదు, స్త్రీల నాయకత్వంలో జరిగే అభివృద్ధి గురించి ఆలోచించే సమయం ఆసన్నమైంది’ అన్నారు. ‘స్త్రీలకు సాధికారతను ఇచ్చేందుకు పురుషులెవరు?’ అని ప్రశ్నించారు. ‘మిమ్మల్ని మీరు సమర్థంగా తీర్చిదిద్దుకోండి. సాంకేతిక అంశాల్లో సాధికారత సాధించుకోండి’ అని సలహా ఇచ్చారు. ‘‘క్షమ, ఓపిక లాంటివి స్త్రీలకు సహజ గుణాలు. భర్త, పిల్లల కోసం వారెంతో త్యాగం చేస్తారు’’ అని ప్రశంసించారు.

ఇన్ని అని, ఇన్ని చెప్పిన మనిషి ఐదేళ్లు పూర్తవుతున్నా బిల్లు గురించి పార్లమెంటు లోపల గానీ, బయట గానీ మాట్లాడలేదు. ఇల్లు, వాకిలి శుభ్రంగా ఉంచుకోడానికి ముప్పైమూడు శాతం రిజర్వేషన్‌లు ఎందుకని ఆయన అనుకున్నట్లుంది! రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రణబ్‌ ముఖర్జీ, ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు హమీద్‌ అన్సారీ, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌  మహిళా రిజర్వేషన్‌ల గురించి మాట్లాడారు కానీ, పార్లమెంటు లోపల ఎప్పుడూ మాట్లాడలేదు. తొలిసారి 1996లో మహిళా బిల్లు పార్లమెంటుకు వచ్చింది. ఇరవై రెండేళ్లు గడిచాయి. దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్, ఇప్పుడు నరేంద్ర మోదీ.. ఐదుగురు ప్రధాన మంత్రులు మారారు. వారిలో ఇద్దరు ఐ.కె.గుజ్రాల్, వాజ్‌పేయి కాలధర్మం చెందారు. ఇప్పటికింకా బిల్లు సగం ఉడికిన అన్నంగానే ఉండిపోయింది.  న్యూ ఇయర్‌లోకి వస్తున్నాం. తర్వాత న్యూ గవర్నమెంట్‌లోకీ వచ్చేస్తాం.

ఇంకో వారమే ప్రస్తుత శీతాకాల సమావేశాలు. ఈ వారంలో రోజుల్లో దేనికి ఏదన్నది ఫిక్స్‌ అయిపోయింది. మహిళా బిల్లుకు చోటు లేదు. లేకపోయినా ఇవ్వొచ్చు. ఏకాభిప్రాయం అవసరం లేకుండా పేటెంటు బిల్లును, పోటా బిల్లును తెచ్చినవాళ్లు మనవాళ్లు! మహిళా బిల్లును తేలేరా? ఆ బిల్లును పక్కన పడేసి మోదీ తెచ్చిన తలాక్‌ బిల్లు సుప్రీంకోర్టు ఇచ్చిన శబరిమల తీర్పులా ఉంది. దర్శనం కోసం వచ్చే మహిళల్ని అడ్డుకోవద్దని సూచిస్తే సరిపోయేది. అడ్డుకోడానికి వీల్లేదని ఆదేశించడమే అలజడికి కారణం అయింది. తలాక్‌ చెల్లదనే బిల్లు కూడా అంతే. మహిళలకు చట్టపరమైన భద్రత ఉన్నప్పుడు మహిళల్లోంచి మళ్లీ ముస్లిం మహిళను ప్రత్యేకం చేసి ప్రత్యేక భద్రత కల్పించే తొందర ఏమిటి? ఇదెలా ఉందంటే.. ముప్పై మూడు శాతంలోంచి మళ్లీ కొంత శాతం వేరుగా తీసి రిజర్వేషన్‌లు ఇవ్వాలని కొన్ని పార్టీలు మహిళా బిల్లుకు అడ్డుపడుతున్నాయి కదా.. అలా ఉంది! 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top