
ప్రతీకాత్మక చిత్రం
లండన్ : రోజులో అత్యధిక సమయం టీవీ చూస్తూ గడిపే వారి అకాల మరణానికి గురవడం లేదా క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడే ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. శారీరక కదలికలు లేకుండా అధిక సమయం టీవీ ముందు, కంప్యూటర్ స్క్రీన్ల ఎదుట గడిపే వారు అస్వస్థతకు లోనవడం, జీవన శైలి కారణంగా మృత్యువాతన పడే ముప్పుందని గ్లాస్గో యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. స్క్రీన్ల ఎదుట గంటలకొద్దీ సమయం గడిపే వారు అకాల మరణానికి గురవుతారని, శారీరకంగా చురుకుగా ఉండేవారిలో ఈ ముప్పు తక్కువని తెలిపారు.
జీవనశైలి సమస్యలతో బాధపడే వారికి అందించే చికిత్సలో తమ అథ్యయనంలో వెల్లడైన అంశాలు ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 3,90,000 మంది ప్రజల జీవనశైలిని విశ్లేషించిన పరిశోధకులు వీరిలో అత్యధికంగా టీవీ, కంప్యూటర్ స్క్రీన్ల ఎదుట గడిపే వారు ఊబకాయం, డయాబెటిస్, హైబీపీలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. వీరిలో పొగతాగడం, అధిక కొవ్వు, ప్రాసెస్డ్ మాంసం తినడం వంటి అలవాట్లు పేరుకుపోయాయని కనుగొన్నారు. శారీరక కదలికలు లేకపోవడంతో వీరిలో క్యాన్సర్, గుండెజబ్బుల ప్రమాదం పొంచిఉందని హెచ్చరించారు. శారీరకంగా ఫిట్‌గా ఉండి, చురుకుగా ఉన్న వారు అంతే సమయం టీవీ స్క్రీన్ల వద్ద గడిపినా ఎలాంటి దుష్ర్పభావాలు కనిపించలేదని అథ్యయనంలో గుర్తించారు.