ఎంబీబీఎస్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే బ్యాచ్‌.. ఒకే బెంచ్‌

three sisters same class and same batch and same bench - Sakshi

తండ్రి తను డాక్టర్‌ కావాలని కలలు కన్నాడు. ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. అయితే ముగ్గురు కుమార్తెలు ఒకేసారి డాక్టర్లు అయి ఆయన కలల్ని నెరవేర్చారు! ఇదొక అపూర్వమైన సందర్భం. కర్ణాటక, బళ్లారి నగరంలోని శ్రీరాంపురం కాలనీకి సమీపంలో.. విశ్వనాథపురం కాలనీలో నివాసం ఉంటున్న శంకర్‌.. స్థానిక ఆస్పత్రిలో నర్సింగ్‌ ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు శ్వేత, స్వాతి, శ్రుతి అని ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. 2017లో ‘నీట్‌’లో ఈ ముగ్గురికీ ఒకేసారి ఎంబీబీఎస్‌ సీటు రావడం మాత్రమే కాదు, ముగ్గురూ బళ్లారిలోని ‘విమ్స్‌’ (విజయనగర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) సీటు సంపాదించారు.

కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. 2014లో పీయూసీ పూర్తి చేసిన శ్వేత అప్పట్లో అనారోగ్య కారణాలతో ఎంబీబీఎస్‌ సీటు సంపాదించుకోలేక పోయింది. రెండవ అమ్మాయి స్వాతి 2015లో పీయూసీ పూర్తి చేసి ఏఐపీఎంటీ (ఆలిండియా ప్రీ మెడికల్‌ టెస్ట్‌) పరీక్షలు రాసి ఎంబీబీఎస్‌కు ప్రయత్నించింది. అయితే ఆ ఏడాది ఇద్దరికీ సీటు రాలేదు. మూడవ కుమార్తె శ్రుతి 2017లో పీయూసీ పూర్తి చేయడంతో ఈసారి ముగ్గురూ కలిసి బెంగళూరులో  2016–17 విద్యాసంవత్సరంలో జాతీయ స్థాయి ‘నీట్‌’ పరీక్షలు రాశారు.

నీట్‌లో శ్వేత 1216, స్వాతి 1413, శ్రుతి 750వ ర్యాంకులను సాధించడంతో బళ్లారి విమ్స్‌లో ఎంబీబీఎస్‌ చదివేందుకు ముగ్గురికీ ఒకేసారి సీటు లభించింది. సాధారణంగా టెన్త్‌లో లేదా పీయూసీలో.. అక్కాచెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు  ఒకే తరగతి గదిలో కూర్చొని చదువుకోవడం చూస్తుంటాం. అయితే ప్రతిష్టాత్మకమైన ఎంబీబీఎస్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒకే బ్యాచ్‌లో సీటు లభించడంతో పాటు ఒకే కాలేజీ, ఒకే బెంచ్‌లో కూర్చునే అవకాశం లభించడం నిజంగా విశేషమే. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిలు ముగ్గురూ ఒకేసారి ఎంబీబీఎస్‌లో సీటు దక్కించుకోవడం మరొక విశేషం. శ్వేత, స్వాతి, శ్రుతి రోజూ ఉదయం ఇంటి నుంచి క్యారియర్‌ కట్టించుకుని కాలేజీకి వెళుతుంటే.. చూడముచ్చటగా ఉంటుందని చుట్టపక్కల వాళ్లు, బంధువులు అంటున్నారు. 
– జి.నరసనగౌడ్, స్టాఫ్‌ రిపోర్టర్, బళ్లారి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top