స్వచ్ఛభారత్ కోసం ఉద్యోగాన్నే వదిలేశాడు..!

స్వచ్ఛభారత్ కోసం ఉద్యోగాన్నే వదిలేశాడు..!


23 ఏళ్ల యువకుడు... చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశాడు. దేశానికి వెన్నెముకగా నిలిచే రైతులపై దృష్టి సారించాడు. రైతులు సేంద్రియ పద్ధతిలో తామే ఎరువులను తయారు చేసుకునేలా, విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునేలా చేయాలని సంకల్పించాడు.

 

భారత ప్రధాని నరేంద్రమోడి స్వచ్ఛభారత్ అభియాన్‌ను ఎందుకు ప్రారంభించారు అంటూ చాలామంది తమ పరిసరాలను గమనించడం మొదలుపెట్టారు. అయితే హైదరాబాద్ వాస్తవ్యులైన సుజిత్‌రెడ్డి మాత్రం తను చేస్తున్న బి.పి.ఓ. ఉద్యోగానికి రాజీనామా చేసి, 150 కి.మీ. స్వచ్ఛభారత్ క్యాంపెయిన్‌ని నగరంలో నిర్వహించి మరో అడుగు ముందుకు వేశారు. పదిహేను రోజులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నాందిగా నిలిచిన విషయం చెబుతూ -‘‘మూడు నెలల క్రితం, కరీంనగర్ జిల్లాలోని మా తాతగారి ఊరైన వేములవాడలో ఓ రైతు పంటనష్టం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త విని చాలా బాధపడ్డాను.గడచిన పదేళ్ళలో మన దేశంలో 3 లక్షల 50 వేల మంది రైతులు పంటనష్టం, అప్పుల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారని ఇంటర్‌నెట్ ద్వారా తెలుసుకున్నాను. వారికోసం ఏదైనా చేయాలనిపించింది. ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో వ్యర్థపదార్థాల నుంచి తయారు చేసిన విద్యుత్, బయోగ్యాస్ వంటివి రైతులకు ఎంతో ఉపయోగడుతున్నాయి. మన దేశంలోని ఒక రోజు చెత్తనంతా సేకరించి బయోగ్యాస్‌గా మారిస్తే కనీసం 2 లక్షల సిలిండర్లను నింపవచ్చు అని అర్థమైంది’’ అని తెలిపారు ఈ పట్టభద్రుడు.అనుకున్నదే తడవుగా తన ఆలోచనను ఆచరణలో పెట్టాలనుకున్నారు. రైతుల క్షేమం కోసం పోరాడాలనుకున్నారు. చెత్తను సేకరించి దానిని విద్యుత్తుగానూ, ఎరువులుగానూ మార్చి స్వచ్ఛభారత్ కార్యక్రమానికి మొదటి అడుగు అవ్వాలని నిశ్చయించుకున్నారు.

 ‘‘మొదటిరోజు చెత్తను సేకరించడానికి శస్త్రచికిత్స సమయంలో వైద్యులు వాడే గ్లౌజులను ఇచ్చి మా కజిన్ మనోజ్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఆ తర్వాత రోజుకు నలుగురు, ఐదుగురు చొప్పున ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది’’ అని తెలిపారు సుజిత్.వీరంతా బస్టాప్‌లు, స్కూళ్లు, కళాశాలలు, షాప్‌లు సందర్శిస్తారు. అలాగే ప్రతి ఇంటి నుంచి, షాపుల నుంచి తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి, సేకరించడానికి పూనుకున్నారు. సేకరించిన చేత్తను మున్సిపాలిటీ కుండీలకు చేరుస్తారు. నిండిన కుండీల గురించి మున్సిపాలిటీ వారికి సమాచారం ఇస్తారు. డంప్‌యార్డ్ వద్ద విద్యుదుత్పాదన చేయవచ్చని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనితో పాటు పరి శుభ్రత గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు పూను కున్నారు.చెత్తను వీధుల్లో కాకుండా కుండీలలోనే వేస్తున్నారా అంటూ ప్రతి దుకాణదారుడి దగ్గరకు వెళ్లి అడుగుతున్నారు.అంతేకాదు వారు తాము చెప్పిన విధంగా చేస్తున్నారా, లేదా? అనేదీ పరిశీలిస్తున్నారు. తొంభై శాతం దుకాణదారులు చెప్పినట్టుగా చేయడం గర్వంగా ఉంటోంది అంటున్నారు సుజిత్.

 

ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. అయితే, కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు చేయి కలిపితే మరిన్ని మెరుగైన ఫలితాలను తీసుకురావచ్చు అంటున్న సుజిత్ తన కార్యక్రమానికి ‘వి ఆర్ ఫౌడ్ టు బి ఎ హైదరాబాదీ’ అని ప్రింట్ చేసిన యూనిఫామ్‌ను రూపొందించారు. ‘‘మేం బేగంపేటలోని ట్రాఫిక్ పోలీస్‌లను కలిశాం. వారు చాలా సంతోషంగా, ఈ కార్యక్రమానికి ప్రోత్సహమిచ్చారు. ముక్కుకు అడ్డుగా కట్టుకోవడానికి మాకు పొల్యూషన్ మాస్క్‌లను ఇచ్చి, మరీ ప్రోత్సహించారు. ఎవరికైనా మంచి పని చేయాలని ఉంటే, అందుకు తప్పక మరికొంతమంది సాయపడతారు’’ అని నవ్వుతూ తెలిపారు సుజిత్.మరో ముందడుగు గురించి సుజిత్ చెబుతూ- ‘‘త్వరలో గ్రామాలకు వెళ్లి, రైతులతో మాట్లాడతాను. వారికి సేంద్రియ ఎరువులను సొంతంగా ఎలా తయారుచేసుకోవచ్చో, చెత్త నుంచి వంట గ్యాస్‌ను ఎలా తయారుచేసుకోవచ్చో తెలియజేస్తాను. ఇదే నా కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం’’ అంటున్నారు. త్వరలోనే సుజిత్ దాన్ని సాధిస్తారు. అతనికళ్లలో, మాటల్లో కనిపిస్తోన్న ఆత్మవిశ్వాసమే అందుకు సాక్ష్యం!

 - నిర్మలారెడ్డి

 

ఈ కార్యక్రమంలో మీరూ పాల్గొనాలనుకుంటే...

 facebook:sujithreddyswachhbarath, we are proud to be a hyderabadi కు వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

 

స్ఫూర్తిమంతమైన ఇటువంటి కథనాలను మాతో పంచుకోవాలనుకుంటున్నారా? మేము సైతం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34.

 email:swachhbharat.sakshi@gmail.com, swachhbharat@sakshi.com కు పంపండి. బాగున్న వాటిని ప్రచురిస్తాం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top