అభినయకళామూర్తి

అభినయకళామూర్తి


నివాళి : జె.వి. రమణమూర్తి  (1933-2016)
గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకాన్ని భుజానికెత్తుకొని, దేశవిదేశాల్లో కొన్ని పదుల ఏళ్ళు, కొన్ని వందల ప్రదర్శన లిచ్చిన ఘనత జె.వి. రమణమూర్తిదే. ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించినా, నడిచొచ్చిన దారిని మర్చిపోని  మధ్యతరగతి మనిషి. ‘శంకరాభరణం’ శంకరశాస్త్రి’ పాత్రతో తోడబుట్టిన అన్నయ్య తన కన్నా ముందుకు దూసుకుపోయినా, అన్న చాటు తమ్ముడిగా ఆనందించిన మమతానురాగాల మూర్తి.


 


ఒక తరానికి ఆయన రంగస్థల నటుడు. బ్లాక్ అండ్ వైట్ సినిమా తరానికి ఆయన హీరో... సెకండ్ హీరో పాత్రల ఫేమ్. కలర్ సినిమాల యుగానికి వచ్చేసరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్. నిన్న మొన్నటి దాకా - టీవీ, రేడియో ఆర్టిస్ట్. అందుకే, జె.వి. రమణమూర్తిగా సుప్రసిద్ధుడైన అభినయమూర్తి జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి గురించి ఒక్క మాటలో, ఒక్క ముక్కలో చెప్పడం, నిర్వచించడం కష్టం. శ్రీకాకుళం జిల్లా లుకులామ్ అగ్రహారంలో మొదలై మద్రాస్ మీదుగా హైదరాబాద్ దాకా వివిధ ప్రాంతాల మీదుగా విభిన్న రంగాల్లో విస్తృత ప్రయాణం, కాలంతో పాటు మారుతూ బహుపాత్ర పోషణ చేయడం ఆయన ప్రత్యేకత.


 

చిన్నప్పటి నుంచి... నాటకమే జీవితం

ఎక్సైజ్ ఇన్‌స్పెక్టరైన జె.వి. శివరామమూర్తి ఆరుగురు సంతానంలో రెండోవారు జె.వి. సోమయాజులైతే, నాలుగోవారు రమణమూర్తి. గమ్మత్తే మిటంటే, సోమయాజులు, రమణమూర్తి, రమణమూర్తి తరువాతి వాడైన జె.వి. శ్రీరామ్మూర్తి - ముగ్గురూ రంగస్థల నటులే. చిన్నప్పటి నుంచి రమణమూర్తికి నాటకాలంటే అభిమానం. విజయనగరంలో పెరగడం అందుకు దోహదం చేసింది. శ్మశానమైన గురాచారి తోటలో ప్రాక్టీస్ చేసి, మహారాజా వారి ఒకప్పటి ఏనుగులశాలైన ‘హస్తబల్ హాలు’లో తొలిసారి నాటకం వేయడంతో ఆయన అభినయ ప్రస్థానం మొదలైంది. పదిహేనో ఏట 1948లో ‘కవిరాజు మెమోరియల్ క్లబ్’ పెట్టి నాటకాలు వేశారు. ఆ సమాజం విజయనగరంలో ఇప్పటికీ నడుస్తుండడం విశేషం.


 

అన్నయ్య సోమయాజులుతో కలసి ఆత్రేయ ‘ఎన్జీవో’, కవిరాజు ‘దొంగాటకం’, డి.వి. నరసరాజు ‘నాటకం’, ప్రఖ్య శ్రీరామ్మూర్తి ‘కాళరాత్రి’ లాంటివన్నీ ప్రదర్శించారు. బి.ఎస్సీ చదివిన రమణమూర్తి ఆ రోజుల్లోనే ప్రదర్శనకు కావాల్సినవన్నీ సమకూర్చి, అన్నీ అందరికీ చెబుతూ తెలియ కుండానే ‘డెరైక్టర్’ అయ్యారు. హైదరాబాద్‌లో 1955లో జరిగిన ‘ఆంధ్ర నాటక కళాపరిషత్’ పోటీల్లో ‘కాళరాత్రి’ ప్రదర్శనతో ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం అనుకోకుండా ఆయన సినీరంగానికి బాట వేసింది.


 

హీరోగా 20 సినిమాలు...


ఆ ప్రదర్శన చూసిన రచయిత డి.వి. నరసరాజు, దర్శకుడు తాతినేని ప్రకాశరావుల పరిచయం రమణమూర్తి పేరును దర్శక - నిర్మాత ఎల్వీ ప్రసాద్ దాకా తీసుకెళ్ళింది. ఎల్వీ దగ్గర అవకాశం రావాల్సింది, చివరకు ఆయన మేనల్లుడు కె.బి. తిలక్ దర్శకత్వంలోని ‘ఎం.ఎల్.ఎ’ దగ్గర వచ్చింది. ఆ సినిమా హిట్టవడంతో వచ్చిన గుర్తింపు... ఆ తర్వాత ‘అత్తా ఒకింటి కోడలే’, ‘బావామర దళ్ళు’, ‘పెళ్ళి మీద పెళ్ళి’ ఇలా 20 సినిమాల్లో హీరో వేషాలొచ్చేలా చేసింది.


 

ఎన్టీఆర్‌తో కలసి ‘మంచి మనసుకు మంచి రోజులు’, ‘శభాష్ రాముడు’ లాంటి చిత్రాల్లో నటించారు. ‘శభాష్ రాముడు’లో తమ్ముడి పాత్ర వేయడంతో ఆ తరువాత నుంచి ఎన్టీఆర్ తనను ఆప్యాయంగా ‘తమ్ముడూ’ అని పిలిచేవారని రమణమూర్తి గుర్తుచేసుకొనేవారు. అలాగే, ఏయన్నార్ సైతం అవకాశాలివ్వమంటూ అందరికీ చెప్పడమే కాక, ‘మాంగల్యబలం’, ‘అమాయకురాలు’ లాంటి చిత్రాల్లో మంచి వేషాలిచ్చారు.


 

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ‘మరో చరిత్ర’


కుడికాలికి యాక్సిడెంటై కొన్నేళ్ళు మంచం మీద ఉండాల్సి రావడం ఆయన కెరీర్‌ను ఇబ్బంది పెట్టింది. ఆ తరువాత ‘అనురాగాలు’ చిత్రంతో క్యారెక్టర్ యాక్టర్‌గా రెండో దశ మొదలుపెట్టారు. కె.విశ్వనాథ్ ‘సిరిసిరి మువ్వ’ నుంచి మళ్ళీ ఒక ఊపందుకొని, ‘మన ఊరి పాండవులు’, ‘మరో చరిత్ర’, ‘ఆకలిరాజ్యం’, ‘గుప్పెడు మనసు’, ‘సిరివెన్నెల’, ‘వంశగౌరవం’, ‘శ్రీదత్తదర్శనం’ లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్నారు.


 

1933 మే 20న జన్మించిన రమణమూర్తి, అన్నయ్య జె.వి. సోమ యాజులు కన్నా అయిదేళ్ళు చిన్న. రమణమూర్తి ముందుగా సినిమాల్లోకి వచ్చి, పేరు గడించినా, ఆలస్యంగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన అన్నయ్యకు ‘శంకరాభరణం’ సినిమా పుణ్యమా అని మరింత ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ఆ క్రమంలో అన్నదమ్ములిద్దరూ రంగస్థలం మీద లానే సినిమాల్లోనూ ‘సప్తపది’ లాంటి పలు చిత్రాల్లో కలసి నటించారు. అప్పుడిక పాపులారిటీలో అన్న చాటు తమ్ముడిగానే తెరపై మిగిలిపోయినా, తన మార్కు అభినయంతో అలరిస్తూనే వచ్చారు.


 

కన్యాశుల్కంతో చిరకీర్తి


ఎన్ని సినిమాలు, సీరి యల్స్‌లో చేసినా, ‘కన్యాశుల్కం’ నాటకాన్ని మూడు గంటలకు కుదించి, 1953 నుంచి 1995 దాకా 42 ఏళ్ళపాటు ‘నటరాజ కళాసమితి’గా ఏక ధాటిగా ప్రదర్శనలివ్వడం రమణమూర్తిని చిరస్మరణీయుణ్ణి చేసింది. సోమయాజులు రామప్ప పంతులైతే, రమణమూర్తి గిరిశం. టీవీకి తగ్గట్లు స్క్రీన్‌ప్లే రాసుకొని, 1990లలో దూరదర్శన్‌కు 19 భాగాల సీరియల్‌గా కూడా ‘కన్యాశుల్కా’న్ని అందించారు.


 

రెండేళ్ళ క్రితం కూడా తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఆ నాటక ప్రదర్శనలో 6 నెలలు శిక్షణ నిచ్చారు. ఆఖరుదాకా రంగస్థలాన్ని ఊపిరిగా శ్వాసించి, ఒకానొక దశలో అన్నయ్యతోనే ఆ విషయంలో తేడా వచ్చినా అంకితభావం వీడని ఈ అభినయ కళామూర్తికి అశ్రునివాళి.


 

- రెంటాల జయదేవ


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top