ఆగితే చస్తావ్... | Supposed gap ... | Sakshi
Sakshi News home page

ఆగితే చస్తావ్...

Mar 14 2014 11:24 PM | Updated on Sep 2 2017 4:42 AM

ఆగితే చస్తావ్...

ఆగితే చస్తావ్...

1976 మాంట్రియల్ ఒలింపిక్స్ జరుగుతున్న సమయం... బేబీ డాక్‌గా ప్రసిద్ధుడైన నియంత జీన్ క్లాడ్ డువలియర్ అప్పటికే హైతీ దేశాన్ని ఐదేళ్లుగా తన చెప్పుచేతల్లో పెట్టుకుని పాలిస్తున్నాడు.

1976 మాంట్రియల్ ఒలింపిక్స్ జరుగుతున్న సమయం... బేబీ డాక్‌గా ప్రసిద్ధుడైన నియంత జీన్ క్లాడ్ డువలియర్ అప్పటికే హైతీ దేశాన్ని ఐదేళ్లుగా తన  చెప్పుచేతల్లో పెట్టుకుని పాలిస్తున్నాడు. నియంత పాలన ఎలా ఉంటుందో జనాలకు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్న డువలియర్... ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్టును ఎంపిక చేసే బాధ్యతను కూడా తనే తీసుకున్నాడు. తన సన్నిహితులతో కలిసి చాలా మందిని వడపోసి చివరకు 13 మంది క్రీడాకారులను ఎంపిక చేశాడు. ఇందులో పది మంది అథ్లెట్లు, ముగ్గురు బాక్సర్లు ఉన్నారు. వీళ్లతో పాటు తన స్నేహితుల్లో కొంత మందిని కూడా పోటీలకు పంపాడు. అప్పటిదాకా జరిగిన 12 ఈవెంట్లలో ఏ ఒక్కరూ గెలవలేకపోయారు. దీంతో అంతర్జాతీయ వేదికపై అవమానం జరి గిందనే కోపం, అసహనం, ఆవేశంతో డువలియర్ ఊగిపోతున్నాడు. ఇక మిగిలింది ఒకే ఒక్క ఈవెంట్ 5 వేల మీటర్ల పరుగు.
     
బతుకు భయంతో...

డ్యూడన్ లామోత్... హైతీ తరఫున హీట్స్‌లో పాల్గొంటున్న అథ్లెట్. తమ అథ్లెట్లందరూ ఓటమిపాలు కావడంతో అతనిలో ఏదో తెలియని భయం. గెలుపును పక్కనబెడితే కనీసం రేసునైనా పూర్తి చేస్తానో లేదోనని ఆందోళన. గన్ పేలింది... రేసు మొదలైంది. అథ్లెట్లు వేగం పుంజుకుంటున్నారు. కానీ లామోత్ మాత్రం సెకన్, సెకన్‌కు వెనుకబడిపోతున్నాడు. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చొన్న డువలియర్‌లో క్షణక్షణానికి అసహనం పెరిగిపోతోంది. గ్యాలరీ వైపే చూస్తూ పరిగెడుతున్న లామోత్ ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.

ఓ దశలో రేసును ఆపేయాలని నిశ్చయించుకున్నాడు. కానీ ‘రేసు పూర్తి చేయకపోతే ఉరితీస్తానని’ డువిలియర్ చేసిన సైగతో లామోత్ ప్రాణం గాలిలో కలిసిపోయినట్లయింది (నిజానికి ఈవెంట్‌కు ముందే ఆ హెచ్చరిక జారీ చేసినట్లు కూడా కొందరు చెబుతారు). అంతే ఊపిరి బిగపట్టి, కండరాలు మెలిపెట్టి... అడుగు తీసి అడుగు వేయలేక... సగం దూరం కూడా పూర్తి చేయని రేసును బతుకు జీవుడా అంటూ 18 నిమిషాల 50.07 సెకన్లలో పూర్తి చేశాడు.

ఒలింపిక్స్ చరిత్రలో ఇది అత్యంత చెత్త రికార్డు. 14 మంది పాల్గొన్న హీట్స్‌లో 13వ స్థానంలో నిలిచిన అతనికి, 12వ స్థానంలో నిలిచిన అథ్లెట్ (13ని. 43.89 సెకన్లు)కు ఏకంగా 5 నిమిషాల తేడా ఉంది. ఒక నియంత పరువు కోసం భయంతో పరుగెత్తిన అథ్లెట్ తన కెరీర్‌లో చెరగని చెత్త రికార్డు నెలకొల్పినా ప్రాణాలను మాత్రం నిలబెట్టుకోగలిగాడు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement