ఆరని మంట.. మోగని రవళి

Stalked set on fire Ravali dies - Sakshi

రవళి... తమ జీవితాలకు ఆనంద రవళి అవుతుందని కలలు కన్నారు ఆమె అమ్మానాన్నలు. అందెలు ఘల్లుమంటూ రవళి ఇంట్లో తిరుగుతుంటే సంతోషాల హరివిల్లును చూశారా అమ్మానాన్నలు. ఒక్కగానొక్క బిడ్డ. ఆమె ప్రతి వేడుకా ఆ ఇంటికి ఆనందాల డోలికగానే సాగింది. ఓణీ ఫంక్షన్‌లో పెళ్లి కూతురిలా అలంకరించి ఫొటో తీసుకున్నారు ఆమె అమ్మానాన్న పద్మ, సుధాకర్‌. తాము చదువుకోలేదు. ఉన్న కొద్దిపాటి పొలంలో సాగు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. కూతురిని చదివించాలనేది వాళ్ల కల. రోజూ రవళిని కాలేజ్‌కి పంపించి గోడ మీదున్న ఓణీ ఫంక్షన్‌ ఫొటోను చూస్తూ డిగ్రీ పూర్తయిన వెంటనే సంబంధాలు చూడాలి. బంధువులందరినీ పిలుచుకుని మంచి వరుడితో ఆమె పెళ్లి వైభవంగా చేయాలని చెప్పుకునేవాళ్లు పద్మ, సుధాకర్‌లు. వాళ్లు అనుకున్నట్లే నిన్న (మంగళవారం) రవళికి పెళ్లి చేశారు వరుడిని వెతక్కుండానే. అరటి చెట్టుతో పెళ్లి చేశారామెకి. కాదు... ఆమెకి కాదు... ఆమె మృతదేహానికి. (ప్రేమోన్మాది దాడిలో గాయపడిన రవళి మృతి)

రవళిది వరంగల్‌ జిల్లా, సంగం మండలం, రామచంద్రాపురం. రెండు నెలల కిందట ఇంట్లో చెప్పింది... కాలేజ్‌లో ఓ కుర్రాడు తనను వేధిస్తున్నాడని. అతడు అదే ఊరికి చెందిన అన్వేష్‌. ఊరి పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. తన అమ్మానాన్న, మేనమామ సాక్షిగా ‘ఇక ఆ అమ్మాయి జోలికి వెళ్లను’ అని తలవంచుకున్నాడు అన్వేష్‌. పెద్దవాళ్లు మందలించడంతో తప్పు తెలుసుకున్నాడనే అనుకున్నారంతా. ఇక్కడే అందరి అంచనాలూ తారుమారయ్యాయి. అతడి మౌనం కార్చిచ్చులా రవళిని దహించి వేస్తుందని అతడు రవళి మీద పెట్రోల్‌ పోసి తగల పెట్టే వరకు ఎవరూ ఊహించ లేదు. (పేట్రేగిన ప్రేమోన్మాదం)

సున్నితమైన శరీరం భగ్గున మండిపోయింది. 85 శాతం బర్న్స్‌. కళ్లు మండిపోయాయి. ఊపిరి తిత్తులు మాడిపోయాయి. ఇంకేం మిగిలి ఉంది జీవించడానికి. దేహంలో ప్రతి అవయవమూ బతుకుపోరాటం చేసే శక్తిలేనంతగా బొగ్గయిపోయాయి. ఆరు రోజులు ప్రాణాలతో పోరాడి చివరికి తాను గెలవలేకపోతున్నానని లోకానికి చెప్పింది రవళి. హాస్పిటల్‌ వాళ్లు దేహం మొత్తానికి తెల్లటి వస్త్రాన్ని చుట్టి అమ్మానాన్నల చేతుల్లో పెట్టారు. అప్పుడే పుట్టిన బిడ్డను అందుకున్నంత భద్రంగా అందుకున్నారు అమ్మానాన్నలు ప్రాణం లేని రవళిని. 

చివరి చూపు లేదు
ఇంటికి తీసుకువచ్చి పడుకోబెట్టారు. బంధువులంతా వచ్చారు. ఆమె ముఖాన్ని కళ్లారా చూసుకుందామని కట్లు విప్పిన వాళ్లకు కళ్లు బైర్లుకమ్మాయి. తల్లి స్పృహ తప్పి పడిపోయింది. రవళి ముఖం... ముఖంలా లేదు. చూడలేక కప్పేయాల్సి వచ్చింది. అంతిమ సంస్కారాలు మొదలయ్యాయి. అరటి చెట్టుతో పెళ్లి చేశారు. అక్షింతలు వేస్తూ ‘నీ పెళ్లికి వచ్చి అక్షింతలు వేస్తామనుకున్నామే కానీ ఇలా జరిగిందేమిటి తల్లీ’ అని బంధువులంతా భోరున ఏడుస్తూ ఉంటే అక్కడున్న వాళ్లందరి గుండెలు తరుక్కుపోయాయి. ఏ బిడ్డకూ ఇలాంటి పరిస్థితి రాకూడదని కన్నీళ్లు తుడుచుకున్నారు.


రవళి మృతదేహానికి అరటి చెట్టుతో పెళ్లి చేస్తున్న దృశ్యం

ఓ ఉన్మాది చేతిలో కాలిపోయిన జీవితం రవళిది. మరే తల్లికీ ఇలాంటి గర్భశోకం రాకూడదని గుండెలవిసేలా ఏడుస్తోంది రవళి తల్లి. బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేని తల్లి మనసు గంటకోసారి స్పృహ కోల్పోతోంది. స్పృహలోకి వచ్చిన ప్రతిసారీ ఒకటే మాట... ‘అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు. ఒక తల్లి కన్న బిడ్డ ప్రాణాలు తీసే హక్కు అతడికెక్కడిది? ఆ  దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష అందరికీ కనువిప్పు కావాలి. అట్లాంటి చట్టాల్లేకపోతే చట్టాలు మార్చుకుని మరీ శిక్ష వేయండి’ అంటూ పలవరిస్తోంది.
- గజ్జెల శ్రీనివాస్, సాక్షి, సంగెం, వరంగల్‌ రూరల్‌

మా చెల్లికి దిక్కెవరు
నాకు, మా చెల్లికి కలిపి ఒక్కర్తే అమ్మాయి. రవళికి ఆడపిల్లకు చేసుకునే వేడుకలన్నీ ఇద్దరం కలిసి చేసుకున్నాం. చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేయాలనుకుంటే ఇప్పుడిలా అయింది. మా చెల్లికి మెలకువ వస్తే ఫిట్స్‌ వస్తున్నాయి. ఇప్పుడు పద్మను కాపాడుకోవడం ఎలాగో తెలియడం లేదు. ప్రభుత్వం వాడిని(అన్వేష్‌) శిక్షించాలి. ఇలాంటి ఉన్మాదులు ఆడబిడ్డ వైపు కన్నెత్తి చూడడానికి భయపడేటట్లు శిక్షించాలి.
- రమ, రవళి పెద్దమ్మ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top